పొదుపు.. భారీ కుదుపు!
గద్వాల: మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ సహకార సంఘం చేతులెత్తేసింది. కిస్తీలు, డిపాజిట్ల పేరిట వసూలు చేసిన రూ.3.50 కోట్లకు పైగా సభ్యులకు కుచ్చుటోపి పెట్టింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ సంఘటన సోమవారం గద్వాలలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ కేంద్రంగా గద్వాల పట్టణంలో ‘సేవా’ పరస్పర సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక కుంటవీధి, తూర్పు దౌదర్‌పల్లి కాలనీల్లో కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. వార్డులలో ఎక్కడికక్కడ మహిళలతో సంఘాల ఏర్పాటు చేసి ప్రతి సభ్యురాలితో ప్రతి నెలా రూ.50 నుంచి రూ. 200 వరకు పొదుపు పేరుతో కట్టించుకుంటున్నారు.
అలాగే, సభ్యురాలితో పాటు వారి పిల్లలు, కుటుంబ సభ్యులతో వ్యక్తిగత డిపాజిట్లు సైతం సేకరించారు. మొత్తం 58 సొసైటీలను ఏర్పాటు చేసి.. సుమారు 11వేల మందిని సభ్యులుగా చేర్చుకున్నారు. సుమారు రూ.3.50 కోట్లు డిపాజిట్‌దారులకు చెల్లించాల్సి ఉంది. అయితే కొన్నిరోజులుగా చెల్లింపులు నిలిపివేశారు. ఈ విషయమై సంస్థ నిర్వాహకులు సోమవారం గద్వాలలో సభ్యులతో సమావేశం నిర్వహించారు. డబ్బు చెల్లించడానికి ప్రస్తుతం కుదరదని, సంస్థ నష్టాల్లో ఉందని, మరికొంత గడువు ఇవ్వాలని సంస్థ ప్రతినిధి విజయ్‌కుమార్ సదరు మహిళలను కోరారు. దీంతో ఒక్కసారిగా మహిళలు లేచి ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి చేజారిపోతుండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విజయ్‌కుమార్‌తోపాటు సంఘం లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
రియల్ ఎస్టేట్‌లోకి డిపాజిటర్ల సొమ్ము ?
సేవా పరపతి సహకార సంఘం పేరుతో ఖాతాదారుల నుంచి పొదుపు, డిపాజిట్ల రూపంలో సేకరించిన డబ్బును విజయ్‌కుమార్ తన సొంత రియల్‌ఎస్టేట్ సంస్థ అయిన అవని ప్రాపర్టీస్‌లోకి తరలించినట్లు తెలుస్తోంది. విజయ్‌కుమార్, అతని భార్య, కుటుంబ సభ్యుల పేరుమీద గద్వాల పట్టణ శివారులో నాలుగు వెంచర్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీటిపై దృష్టిపెడితే మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందని ఖాతాదారులు కోరుతున్నారు.