డిప్యూటీ సీఎం ఇంటి ముట్టడి ఉద్రిక్తం
-
కడియం నివాసం సమీపంల బైఠాయించిన రెండో ఏఎన్‌ఎంలు
-
ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం
హన్మకొండ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైద్య, ఆరో గ్య శాఖలో పనిచేస్తున్న రెండో ఏఎన్‌ఎంలు హన్మకొండ టీచర్స్ కాలనీలోని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటి ముట్టడికి శనివారం యత్నించారు. గత 34 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమం గురించి సమాచారం అందడంతో సుబేదారి సీఐ వాసాల సతీష్, హన్మకొండ సీఐ సంపత్‌రావు, కేయూ సీఐ అలీ పోలీసు సిబ్బందితో టీచర్స్ కాలనీలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం ఇంటి సమీపంలో రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోప్ పార్టీ సిబ్బంది మెుహరించారు. ర్యాలీ టీచర్స్ కాలనీకి చేరుకోగానే రెండో ఏఎన్‌ఎంలను అడ్డుకున్నారు. అయినా వారు పోలీసులను నెట్టివేసి కడియం ఇంటి వైపు దూసుకుపోయారు. ఈక్రమంలో పోలీసు లు, రెండో ఏఎన్‌ఎంల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు సీఐటీయూ నాయకులు, రెండో ఏఎన్‌ఎంలను అరెస్టు చేసి వాహనం ఎక్కించారు.
కాగా, వారిని తీసుకెళ్తున్న వాహనాన్ని నిరసనకారులు అడ్డుకోవడంతో మరోసారి పోలీసులు, రెండో ఏఎన్‌ఎంల మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు పలువురు సీఐటీయూ నాయకులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరికొందరు ఏఎన్‌ఎంలను ఇక్కడి నుంచి పంపించారు. అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలంటూ రెండో ఏఎన్‌ఎంలు సుబేదారి పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అంతకుముందు ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చుక్కయ్య మాట్లాడుతూ రెండో ఏఎన్‌ఎంల సమస్యలపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందించాలన్నారు.
ఈ విషయమై సీఎం కేసీఆర్‌తో మాట్లాడాలని కోరారు. కాంట్రాక్టు పద్ధతిలో పని చేసున్న రెండో ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేసి, కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రాగుల రమేష్, యు.నాగేశ్వర్‌రావు, భోగి సురేష్, కృష్ణం రాజు, రొయ్యల రాజు, జి.శ్రీనివాస్, రెండో ఏఎన్‌ఎంల అసోసియేషన్ నాయకులు కె.సరోజ, మంజుల, జమునారాణి, ప్రమోద, దీనా పాల్గొన్నారు.