జిల్లాలో అపహాస్యం పాలవుతున్న ఉపాధి హామీ పథకం
రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తే కూలి డబ్బులివ్వకుండా తమను వేధించడం తగదని వెంటనే చేసిన పనికి కూలి డబ్బులిప్పించాలని మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ కూలీలు వేడుకుంటున్నారు.
సాక్షి, మచిలీపట్నం / పెడన, న్యూస్‌లైన్ : రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తే కూలి డబ్బులివ్వకుండా తమను వేధించడం తగదని వెంటనే చేసిన పనికి కూలి డబ్బులిప్పించాలని మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ కూలీలు వేడుకుంటున్నారు. జిల్లాలోని 49 మండలాల్లో ఏడాది కాలంగా 52,26,921 మంది కూలీలు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేశారు. 2012 అగస్టు నుంచి ఇప్పటి వరకు రూ.80 కోట్ల మేర కూలిపనులు చేశారు. ఇప్పటి వరకు రూ.61,06,980 నగదును అధికారులు కూలీలకు అందజేశారు.
ఇంకా సుమారు మరో రూ.20 కోట్ల నగదును విడుదల చేయాల్సి ఉంది. నాలుగు నెలలుగా కూలి డబ్బులందక పేదలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో 5,53,693 కుటుంబాలకు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తామని ప్రభుత్వ యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. వాస్తవానికి వారిలో 3,465 కుటుంబాలకు మాత్రమే వంద రోజులు పని కల్పించారు. మిగిలిన కుటుం బాల వారికి పనికల్పించటంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో సగటున 26.7 శాతం మందికి మాత్రమే వంద రోజుల పని దొరికింది.
ఉదాహరణ కు పెడన నియోజకవరం్గలో మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు రూ.1.4 కోట్లు నగదు విడుదల కావాల్సివుంది. పెడన మండలంలో రూ. 46లక్షలు, గూడూరు మండలంలో రూ.70లక్షలు, బంటుమిల్లిలో రూ.10లక్షలు, కృత్తివెన్నులో రూ.15లక్షల వరకు కూలీలకు నగదు విడుదల కావాల్సి ఉంది. ఏప్రిల్ మాసంలో నెలంతా పనిచేస్తే ఒక్క వారం నగదు మాత్రమే వచ్చిందని , మరో నాలుగు నెలల నగదు రాలేదని చెబుతున్నారు. జూలై మాసంలో చేసిన వారికి కొంత మందికి నగదు స్లిఫ్‌లు వచ్చాయని మధ్య నెలల్లో పని చేసిన వారికి ఇంత వరకు స్లిఫ్‌లు రాలేదని వాపోతున్నారు.
దళితులపై ఇంత నిర్లక్ష్యమా..!
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీ పనులు చేసుకుని ఎక్కువ శాతం జీవనం సాగించేది దళిత వాడ ప్రజలే. వారు రెక్కలు ముక్కలు చేసుకుని పాటుపడిన కూలి డబ్బులు ఇవ్వకుండా ఆపడం దారుణం. దళితులపై ఇంత నిర్లక్ష్యం తగదని చెవేండ్ర పంచాయతీకి చెందిన మేట్లు ఎం.వెంకటేశ్వరరావు, కృష్ణ, కె.రమేష్, కె.జయలక్ష్మీ డీ.వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. ఆరు నెలలు నుంచి వ్యవసాయ పనుల్లేక ఉపాధి కూలీ చేసుకుని పిల్లలను పోషించుకుంటున్నామని, కూలీ ఇవ్వకపోవటంతో అప్పులు తెచ్చుకుని బతుకు బండి లాగిస్తున్నామని చెబుతున్నారు.