అన్యాయం జరుగుతోందనే విడిపోయాం | devided after fail getting law | Sakshi
Sakshi News home page

అన్యాయం జరుగుతోందనే విడిపోయాం

Published Sat, Aug 22 2015 1:20 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

అన్యాయం జరుగుతోందనే విడిపోయాం - Sakshi

అన్యాయం జరుగుతోందనే విడిపోయాం

⇒ నీటి పంపకాల సమస్యపై సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్
⇒ కృష్ణా జలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి
⇒ లేదంటే నాలుగు రాష్ట్రాల వాదనలు వినాలి
⇒ కేంద్రాన్ని అడిగినా పట్టించుకోలేదని వెల్లడి
⇒ బ్రిజేశ్ అవార్డు వ్యతిరేక పిటిషన్లతో కలిపి విచారిస్తామన్న ధర్మాసనం
⇒ 26, 27 తేదీల్లో విచారణకు రానున్న కృష్ణా జలాల పిటిషన్లు


 సాక్షి, న్యూఢిల్లీ: నీటి పంపకాల్లో అన్యాయం జరుగుతోందనే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిందని.. ఇప్పుడు కూడా తమకు న్యాయం జరగకపోతే ఎలాగని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించుకుంది. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, లేదంటే నాలుగు రాష్ట్రాల వాదనలు మళ్లీ వినేలా ఆదేశించాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తమకు జరిగిన అన్యాయాన్ని కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాతనైనా సరిచేయాలని, అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్-3 ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని వివరించింది.

కేంద్రం ఏడాదిలోగా కృష్ణా నదీ జలాల భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయం తీసుకుని సమస్యను పరిష్కరించాల్సిందిపోయి.. ఏడాది గడువు ముగుస్తుండగా కేవలం ఆంధ్రప్రదేశ్ అభిప్రాయాన్ని మాత్రమే తీసుకుందని తెలిపింది. ఈ పిటిషన్ శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ ఎ.కె.సిక్రీ, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. తొలుత తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ‘‘అసలు నీళ్లలో అన్యాయం జరుగుతోందనే తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవాలని కోరుకుంది. అలా విడిపోయాం. విడిపోయిన తరువాత కూడా మాకు న్యాయం జరగకపోతే ఎలా? అన్యాయాన్ని సరిదిద్దేందుకు వీలుగా కృష్ణా జలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం గానీ, నాలుగు రాష్ట్రాల వాదనలు తిరిగి వినిపించేందుకుగానీ వీలు కల్పించాలని కేంద్రాన్ని కోరాం. కానీ కేంద్రం మా గోడు పట్టించుకోలేదు. పైగా దీనిపై కేవలం ఆంధ్రప్రదేశ్ అభిప్రాయం మాత్రమే కోరింది..’’ అని ధర్మాసనానికి వివరించారు.

దీనిపై మహారాష్ట్ర తరఫు న్యాయవాది అంధ్యార్జున స్పందిస్తూ... ‘‘బచావత్ ట్రిబ్యునల్ ఒక అవార్డు ప్రకటించింది. తరువాత బ్రిజేశ్ ట్రిబ్యునల్ 2013లో అవార్డు ప్రకటించింది. కానీ దానిని కేంద్రం నోటిఫై చేయలేదు. 2014లో ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. ఇప్పుడు తెలంగాణ మళ్లీ మొత్తం వాదనలు వినాలంటోంది. లేదంటే కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు జరిపిన కేటాయింపులను ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంచుకోవాలని మేం అంటున్నాం. అయితే బ్రిజేశ్ అవార్డును వ్యతిరేకిస్తూ ఇప్పటికే పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటితోపాటు ఈ పిటిషన్ కూడా విచారిస్తే సరిపోతుంది..’’ అని పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... 26, 27న విచారణకు వచ్చే పిటిషన్లతో కలిపి దీనిని విచారిస్తామని పేర్కొంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement