ఆల్‌బెండజోల్ మందు పంపిణీకి ఆదేశాలు
ఆల్‌బెండజోల్ మందు పంపిణీకి ఆదేశాలు
Published Mon, Aug 29 2016 9:45 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కాకినాడ సిటీ :
పిల్లల్లో అనారోగ్యానికి కారణమవుతున్న నులిపురుగుల నివారణ కోసం మంగళవారం జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా వారందరికీ ఆల్‌బెండజోల్ మందు పంపిణీ చేయాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ పాఠశాలల్లో చదువుకుంటున్న 5,31,332 మంది విద్యార్థులకు, అంగన్‌వాడీ కేంద్రాలలోని 4.05 లక్షల మంది చిన్నపిల్లలకు ఈ మందును అందించడానికి చర్యలు చేపట్టాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలోని ఒకటి నుంచి రెండు సంవత్సరాల పిల్లలకు 400 మిల్లీగ్రాముల ఆల్‌బెండజోల్ సగం ట్యాబ్లెట్‌ను పొడుం చేసి ఇవ్వాలన్నారు. పిల్లలందరికీ ఈ మందు అందేలా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖను కలెక్టర్ ఆదేశించారు. ఈ మందు పంపిణీలో ఎవరైనా మిగిలిపోతే వారికి సెప్టెంబర్ 2వ తేదీన పంపిణీ చేయాలన్నారు. మందు పంపిణీ చేసేటప్పుడు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ : జిల్లాలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని, వీటి నివారణకు ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకూ అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, జెడ్పీ సీఈఓ కె.పద్మ, డీఆర్‌డీఏ పీడీ ఎస్.మల్లిబాబు, డీసీహెచ్ డాక్టర్ రమేష్ కిషోర్, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ చంద్రయ్య, కాకినాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, డ్వామా పీడీ ఎ.నాగేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ ఇడీ ఎం.జ్యోతి పాల్గొన్నారు.
డీ వార్మింగ్ డే అన్ని పాఠశాలల్లో నిర్వహించాలి
బాలాజీచెరువు (కాకినాడ) : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మంగళవారం డీ వార్మింగ్ డేను నిర్వహించాలని డీఈఓ ఆర్.నరసింహరావు సోమవారం ఆదేశించారు. ప్రతి విద్యార్థి ఆల్‌బెండజోల్ మాత్రలను విధిగా వేసుకునేలా ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. విద్యార్థులు ఆరోజు స్కూల్‌కు రాకపోతే మరునాడు వారికి మాత్రలు అందజేయాలని సూచించారు.
Advertisement