మాదిగ ఉపకులాల సత్తా చాటాలి
మాదిగ ఉపకులాల సత్తా చాటాలి
Published Tue, Sep 27 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
కాకినాడ సిటీ : శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టాలని కోరుతూ నవంబర్ 20న హైదరాబాద్‌లో 30లక్షల మందితో చేపట్టనున్న మాదిగల ధర్మయుద్ధ మహాసభ ద్వారా మాదిగ ఉపకులాల సత్తా చాటాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి కాకినాడ అంబేడ్కర్ భవన్‌లో జరిగిన ధర్మయుద్ధ సన్నాహాక సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. లక్ష్యానికి దగ్గరగా ఉన్నామని, శత్రువు నిరంతరం వెంటాడుతున్నందున ఈదశలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పండిట్ దీన్‌దయాల్ శతజయంతి సంవత్సరం ప్రకటించిన సందర్భంలో ఎస్సీ వర్గీకరణ చేసి దళితులపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బీజేపీని కోరారు. దీన్‌దయాల్ కోరుకున్నట్టుగా అట్టడుగున ఉన్న దళిత వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలంటే వర్గీకరణనే సరైన మార్గమన్నారు. వర్గీకరణ లక్ష్యం దీన్‌దయాల్ ఆశయం ఒక్కటే అంటూ అభివర్ణించారు. సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగేంతవరకు సమసమాజ స్థాపన అసాధ్యమని అసమానతలు తొలగిన నాడే అది నెరవేరుతుందన్నారు. సామాజిక న్యాయంనకు కట్టుబడడమంటే వర్గీకరణను సమర్థించడమే అని, సామాజిక న్యాయానికి పర్యాయపదమే వర్గీకరణ అంటూ ఆయన తెలిపారు. వర్గీకరణ చేయడం ద్వారా దళితుల్లో అనేక కులాల పక్షాన బీజేపీ నిలబడినట్టవుతుందన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న మాదిగ, జిల్లా ఇన్‌చార్జి వెంకటేశ్వర్లు, సలహాదారు సుబ్బారావు, టి.సుగుణ కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement