అచ్చెన్న నంబర్-1 దగాకోరు | Dharmana Prasada fire on AP Minister Achennayudu | Sakshi
Sakshi News home page

అచ్చెన్న నంబర్-1 దగాకోరు

Published Sat, Apr 9 2016 11:13 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

అచ్చెన్న  నంబర్-1 దగాకోరు - Sakshi

అచ్చెన్న నంబర్-1 దగాకోరు

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడుకు నంబర్-1 మంత్రిగా ఎలా మార్కులిచ్చారో చెప్పాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు నంబర్-1 దగా మంత్రి అని ఆరోపించారు. ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మాట్లాడుతుంటే స్పీకర్ మైక్ కట్ చేస్తూ, అచ్చెన్నాయుడును మాట్లాడాలంటూ ఉసిగొల్పుతుంటారని, ఆయనేమో పిచ్చి ప్రేలాపనలు పేలుతూ సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ నిధుల్లో 30 శాతం కమీషన్‌కు కక్కుర్తిపడి టీడీపీ నేతలు రోడ్లేసేస్తున్నారని, టీడీపీది దొంగల పాలన అని మండిపడ్డారు. పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడారు.
 
 జనహితమే లక్ష్యంగా ధర్మ పోరాటం
 జనహితమే లక్ష్యంగా ధర్మ పోరాటం పేరిట నిర్వహించిన సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ గతంలో జరిగిన నీటి సంఘాల ఎన్నికల్ని గుర్తు చేశారు. టీడీపీ నేతలు చీటీ రాసుకుని తమ వారిపేర్లు ప్రకటించేసి ఎన్నికలు పూర్తయినట్టు చెప్పేశారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామో లేదో తెలియని పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేలు పార్టీ మారి పోతున్నారన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు పదేళ్లపాటు అధికారానికి దూరమైపోయారని, మళ్లీ అదే బాబు ప్రజల బలహీనతలపై దెబ్బకొట్టి అధికారంలోకి వచ్చి మళ్లీ మాట మారుస్తున్నారన్నారు.
 
 తాను మారానని చెప్పుకున్న బాబు..ఇప్పుడు ప్రజలు కూడా ఆయన మారలేదని నిర్ణయించేసుకున్నారన్నారు. రైతులు అమాయకులు కావచ్చు కానీ జరుగుతున్నది చూస్తూ మళ్లీ ఓటేసే పరిస్థితి లేదని, ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చట్టం కష్టాల్ని జనం చూడరని, విధానాల్లో నిర్ణయాల్ని మాత్రమే ప్రశ్నిస్తుంటారని, ఆ పని వైఎస్సార్‌సీపీ తరఫున తాము చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామన్నారు. ఏప్రిల్ ముగుస్తున్నా ధాన్యం కుప్పలు ఇంకా పొలాల్లోనే ఉన్నాయని, రైతులు, నిరుద్యోగులు ధైన్యంలో ఉన్నారని, మహిళలంతా తాము బాబుకెందుకు ఓటేశామా అని లోలోన కుమిలిపోతున్నారన్నారు. సహజంగా దొరికే ఇసుక కూడా టీడీపీ నేతలు అక్రమ రవాణా చేస్తున్నారని, అధికారులకు ఫోన్ చేస్తే అది ఏ పార్టీ ఇసుక అంటున్నారని, టీడీపీది అని తెలిస్తే వదిలేస్తున్నారని ఆరోపించారు.
 
 ఎమ్మెల్యే లక్ష్మీదేవి ఏం తెచ్చారు
 తమ హయాంలో నిధులు తెచ్చి ప్రారంభించిన పనుల్నే టీడీపీ నేతలు గొప్పలకు పోయి వారి పనులుగా చెప్పుకుంటున్నారని ధర్మాన అన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తన నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఏం అడిగినా టీడీపీ కార్యకర్తలకే లబ్ధి చేకూరేలా చేస్తున్నారని, ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలున్నారన్నారు. 12 జిల్లాల్లో కేంద్రం విద్యా సంస్థలు ప్రకటిస్తే వెనుకబడిన జిల్లాకు ఏం ఒరగబెట్టిందో ఒక్క నాయకుడైనా ప్రశ్నించారా అన్నారు.
 
  వంశధార, మహేంద్రతనయ, మడ్డువలస ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. గడువు ముగిసిన స్థానిక ఎన్నికలకు ఆరుమాసాల్లో చట్టబద్ధంగా ఎన్నికలు జరపాల్సి ఉంటే నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారని, లోకేష్‌బాబు చేపట్టిన సర్వేలో శ్రీకాకుళం నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిపితే ఓడిపోతామని గ్రహించే ఎన్నికలకు దూరంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. టీటీడీ కల్యాణ మండపం, మంచినీటి వ్యవస్థల్ని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
 
 400 దుకాణాలకు లీజు గడువు తీరితే పట్టించుకోని ఎమ్మెల్యే నగరపాలక సంస్థను ప్రైవేట్ ఎస్టేట్‌గా తయారు చేశారని, దుకాణదారులు అమ్మగారిని కలవాలంటూ టీడీపీ తమ్ముళ్లు చెప్పడం ఎంతవరకు న్యాయం అన్నారు. రెండెకరాల ప్రజల భూమిని పార్టీ కార్యాలయానికి ధారాధత్తం చేశారని, కంపోస్ట్ కాలనీ స్థలాన్ని కార్యకర్తలకు ప్లాట్లుగా విభజించి రెండేసి లక్షలకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
 
 పెదబాబు శాంక్షన్, చినబాబు కలెక్షన్
 పెదబాబు పనుల్ని శాంక్షన్ చేస్తుంటే చినబాబు కలెక్షన్ చేస్తూ ఆ సొమ్ముతో ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేస్తున్నారని ధర్మాన ఆరోపించారు. దమ్ముంటే వైఎస్సార్‌సీపీ నుంచి వెళ్లిపోయినవారంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి ప్రజారాజధాని కాదని, అది దగా రాజధాని అని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓడిపోలేదని, ఒకటి, రెండు సీట్లతో ప్రారంభమై ఏడాదిన్నర సమయంలో 17కి చేరి 2014లో 67సీట్లు సాధించిన పార్టీ ఒడిపోయినట్టు కాదని ధర్మాన స్పష్టం చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement