నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేద్దాం
శ్రీకాకుళం అర్బన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం చంద్రబాబు నయవంచనకు గురిచేశారని ప్రజలు దుయ్యబడుతున్నారు. టీడీపీ అధికారం చేపట్టి రెండే ళ్లు పూర్తయినా ఒక్కహామీ కూడా అమలు చేయడం లేదని, అర్హులైన వారికి రేషన్‌కార్డులు ఇవ్వలేదని, పింఛన్లు, ఇళ్లు మంజూరు చేయలేదని వాపోతున్నారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ నేతల వద్ద గోడు వినిపిస్తున్నారు. జన్మభూమి కమిటీలు ఏర్పాటుచేసి పచ్చచొక్కాలవారికే ప్రయోజనం చేకూర్చుతోందంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాలో శనివారం నిర్వహించిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.
పెద్దగనగళ్లపేటో...
పంచాయతీలకు ఇచ్చే నిధులను సైతం తెలుగుదేశం ప్రభుత్వం బ్రోకర్లకు కట్టబెడుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం మండలంలోని పెద్దగనగళ్లపేట పంచాయితీలో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు డ్వాక్రా రుణాలు మాఫీ చేశారా?, మత్స్యకారులు వేటకు వెళ్లి మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తామన్నారు... ఏ ఒక్కరికైనా ఇచ్చారా?, మత్స్యకారులకు ఒక్క ఇళ్లయినా నిర్మించారా?, ఇంటికో జాబ్ ఇస్తామన్నారు. ఇచ్చారా?, కనీసం నిరుద్యోగ భృతి నెలకు రూ.2వెలు ఇస్తామన్నారు. ఇచ్చారా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. ఒక్క హామీ కూడా అమలుచేయలేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, పీఏసీఎస్ అధ్యక్షుడు గొండు కృష్ణ, పార్టీ మండల కన్వీనర్ మూకళ్ల తాతబాబు, సర్పంచ్ చీకటి గురమ్మ, గురుమూర్తి, దానయ్య, బలరాంపురం సర్పంచ్ కోనాడ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
తెలికిపెంటలో...
సరుబుజ్జిలి మండలం తెలికిపెంట పంచాయతీలో రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించా రు. టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. రాజకీయ కక్షతో పింఛన్ రద్దుచేసిన తెలికిపెంట గ్రామానికి చెందిన వృద్ధురాలు ఇసాయి పగడాలమ్మ (70)ను ఓదార్చారు. మంచిరోజులు వస్తాయని భరోసా ఇచ్చారు.
కరకవలసలో...
జలుమూరు మండలం కరకవలస గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. పింఛన్లు రద్దుచేసిన వారిని ఓదార్చారు. జగన్ ప్రభుత్వం వస్తుందని, ప్రజలందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. టీడీపీ నియంత పాలను ఎన్నాళ్లూ సాగదన్నారు.
రౌతుపురం, గొల్లబంజరుపేటల్లో...
టీడీపీ ఆరాచక పాలనపై నందిగాం మండలం రౌతుపురం, గొల్లబంజరుపేట తదితర గ్రామాల ప్రజలను వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ చైతన్యవంతం చేశారు. ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చిన అచ్చెన్నాయుడు... బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పారని, ఇప్పుడు జాబు రౌతుపురానికి చెందిన బెవర నానాజమ్మ వాపోయింది. దివ్యాంగ పింఛన్‌కు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని గ్రామానికి చెందిన పోలాకి ఆదినారాయణ తెలిపారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా మాయచేవారంటూ సభ్యురాలు బెవర చిన్నమ్మ ఆవేదన వ్యక్తంచేసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నేతలకు బుద్ధిచెబుతామని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు దువ్వాడ వాణి, రొక్కం సూర్యప్రకాశరావు, కాళ్ల సంజీవరావు, బుసకల సీతారాం, బగాది హరి తదితరులు పాల్గొన్నారు.
పెద్దకొజ్జిరియాలో...
కంచిలి మండలం పెద్దకొజ్జిరియ గ్రామంలో పార్టీ మండలాధ్యక్షుడు వజ్జ మృత్యుంజరావు అధ్యక్షతన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం జరిగింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు పాల్గొని టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. వంద ప్రశ్నలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. మోసపూరిత హామీలతో అధికారం చేపట్టి రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇప్పిలి కృష్ణారావు, పలికల భాస్కరరావు, నవీన్‌కుమార్ అగర్వాలా పాల్గొన్నారు.