- బండపోతుగల్‌లో 48 మందికి అస్వస్థత
- ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం
- హైదరాబాద్ తరలింపు
- సంగారెడ్డి, జోగిపేట, ఎంఎన్‌ఆర్ ఆసుపత్రుల్లో పలువురి చేరిక
- గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ రోనాల్డ్ రోస్
- గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు
కౌడిపల్లి : గ్రామంలో ఒక్కసారిగా అతిసార విజృంభించింది. 48 మంది అస్వస్థతకు గురికాగా అందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా వారిని హైదరాబాద్ తరలించారు. మరి కొందరు సంగారెడ్డి, జోగిపేట, ఎంఎన్‌ఆర్ ఆసుపత్రులలో చేరారు. విషయం తెలియడంతో స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు.
దీంతో జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ గ్రామాన్ని సందర్శించి పరిసరాలను పరిశీలించారు. వైద్యశిబిరం ఏర్పాటు చేయించారు. ఈ సంఘటన మండలంలోని బండపోతుగల్‌లో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని బండపోత్‌గళ్‌లో రెండురోజులుగా పలువురు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.
మంగళవారం రాత్రి ఒక్కసారిగా ఒకరితోపాటు మరొకరు అస్వస్థతకు గురయ్యారు. దీంతో 108, ఆటోల్లో స్థానిక ఆర్‌ఎంపీతోపాటు సంగారెడ్డి, జోగిపేట ఆసుపత్రులకు తరలి వెళ్లారు. మంగళవారం తెల్లవారుజాము నుండి గ్రామానికి చెందిన నీరుడి కిష్టమ్మ, బుచ్చమ్మ, మంతూరి మల్లేశం, సాలె సంగమ్మ, మాందపురం మల్లమ్మ, చెన్న, కమ్మరి శ్రీరాముల వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.
సాహెబ్‌ఖాన్‌తో పాటు అతని కొడుకు అఫ్రోజ్‌ఖాన్(7) పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అబ్జల్‌ఖాన్, ఖాజాబీ, మంగళి కీర్త, మంగళి నారాయణ, యాదగిరి, ఘనపురం నారాయణ, గొల్ల శ్రీశైలం, బీరప్పకు వాంతులు కావడంతో సంగారెడ్డి, జోగిపేటకు తరలివెళ్లారు. అంగన్‌వాడీ కార్యకర్త ధనలకీ‡్ష్మ కూతురు మోహనప్రియ, సాయిధనుష్‌కు అస్వతస్థకు గురికావడంతో ఎంఎన్‌ఆర్ ఆసుపత్రికి తరలించారు.
గ్రామంలో ఒక్కసారిగా పలువురు వాంతులు, విరేచనాలతో అనారోగ్యం పాలవడంతో స్థానికులు నేరుగా సమస్యను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో గ్రామంలో పరిస్థితిని సమీక్షించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అధికారులను అప్రమత్తం చేశారు. ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ అమర్‌సింగ్‌నాయక్, మెదక్ ఆర్డీఓ నగేష్ గ్రామాన్ని సందర్శించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
స్థానిక వైద్యులు డాక్టర్ విజశ్రీ, దివ్యజ్ఞతోపాటు నర్సాపూర్ క్లస్టర్ సిబ్బంది గ్రామంలోని రోగులకు స్థానిక పంచాయతీ కార్యాలయం, కమ్యూనిటీ భవనంలో వైద్యచికిత్సలు అందించారు. గ్రామానికి చెందిన నర్సింహులు, కృష్ణ, అమేర్‌హుస్సేన్, అన్వర్‌ఖాన్, ముస్తాక్ హుస్సేన్, దుర్గయ్య, మనెమ్మ, బాలమణి, వినీల్, శాంతమ్మ, శిరీష, శివ్వమ్మ, భాగమ్మ, పోచమ్మ, శోభ, భూమయ్య, రేఖ, స్వప్న, దుర్గయ్య, మల్లయ్య, సభ ఫాతిమ, శివ తదితరులకు ప్రత్యేక చికిత్సలు చేశారు. అందులో ఇద్దరిని జోగిపేట ఆసుపత్రికి తరలించారు.
గ్రామాన్ని సదర్శించిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ బండపోతుగల్æ గ్రామాన్ని సందర్శించి పరిసరాలను పరిశీలించారు. వైద్య చికిత్సలందుతున్న తీరును పరిశీలించి, రోగులను ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. నీటిగుంతల కారణంగా రక్షిత మంచినీరు కలుషితం అవుతుండడాన్ని గమనించారు.
నల్లా నీరు కలుషితం కావడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. అనంతరం గ్రామస్తులతో గ్రామసభ నిర్వహించారు. గ్రామజ్యోతి కమిటీలు సరిగా పని చేయడం లేదన్న విషయం గ్రామాన్ని చూడగానే తెలుస్తోందని కలెక్టర్ చెప్పారు. గ్రామస్తులందరూ గ్రామసభను ఏర్పాటు చేసుకుని నల్లా గుంతలు పూడ్చివేయాలని, మోటార్లు బంద్ చేయించాలన్నారు. నీటి సమస్య తలెత్తకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
గ్రామస్లులు సహకరిస్తే నవాబుపేట మాదిరిగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అయితే గ్రామస్తులు ఆగస్టు 15 వరకు వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. రక్షిత మంచినీటి ట్యాంక్‌కు మెట్ల నిర్మాణం కోసం రూ. 1లక్ష మంజూరు చేశారు. త్వరగా పనులు చేపట్టాలని సూచించారు. దీంతోపాటు స్థానిక ప్రాథమిక పాఠశాలను, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. తహసీల్దార్ నిర్మల, ఎంపీడీఓ శ్రీరాములు, మాజీ జెడ్పీటీసీ సార రామగౌడ్, సర్పంచ్ విఠల్, మాజీ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్‌హుస్సేన్, మాజీ సర్పంచ్ మల్లారెడ్డి, గ్రామస్తులు మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పది మంది చేరిక
సంగారెడ్డి టౌన్ : బండ్లపోతుగల్ గ్రామానికి చెందిన అక్కా తమ్ముడు రేవంతి (4), అభిలాష్ (2) తీవ్ర అస్వస్థతో బుధవారం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేరారు. రేవంతి పరిస్థితి కొంచెం మెరుగుపడింది. కానీ చిన్నారి అభిలాష్ తీవ్ర బాధతతో కొట్టుమిట్టాడుతున్నాడు. చిన్నారుల నానమ్మ శాంతమ్మ మనువడి పరిస్థితి చూసి కన్నీటి పర్యంతం అవుతోంది.
అంతే కాకుండా అదే గ్రామానికి చెందిన సంక్తీర్తన (11) ఆసుపత్రిలో చేరింది. జోగిపేట్ ఆసుపత్రిలో చికిత్స అందుబాటులో లేకపోవడంలో అందరూ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలి వచ్చారు. అంతే కాకుండా సంగారెడ్డి పట్టణంలోని బాబానగర్ చెందిన పూజ (10) అతిసారతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. రెండు రోజుల నుండి అతిసార కేసులు వస్తున్నాయని వారికి చికిత్స అందిస్తున్నామని, కొందరు కోలుకున్నారని డాక్టర్ రహీం పేర్కొన్నారు.