koudipally
-
నిన్న చెల్లెలు.. నేడు అన్న మృతి
సాక్షి, మెదక్, కౌడిపల్లి(నర్సాపూర్): శోకసంద్రంలో మునిగిన కుటుంబంలో చెరువులోని జేసీబీ గుంత మరింత శోకాన్ని మిగిల్చింది. చెల్లెలు అంత్యక్రియలు పూర్తిచేసుకుని చెరువులోనికి స్నానానికి వెళ్లగా ఆమె అన్న నీటిలో మునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ముందే ఈ సంఘటన జరిగింది. దీంతో కుటంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని మహ్మద్‌నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్‌నగర్ గ్రామానికి చెందిన చాకలి గంగయ్యకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. కూతురు అరుణ (30) అందురాలు. ఇంటివద్దే ఉంటుంది. ఆదివారం అనారోగ్యంతో మృతి చెందింది. సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉండగా అంత్యక్రియల అనంతరం చెరువులో అందరూ స్నానాకి వెళ్లారు. స్నానం చేసే క్రమంలో నర్సింలు(38) చెరువులోనికి వెళ్లాడు. చదవండి: (జీవితం మీద విరక్తితోనే చనిపోతున్నా..) చెరువునీటిలో జేసీబీ గుంత గమనించక పోవడం అతనికి ఈత రాక నీటిలో మునిగి పోయాడు. అప్పటికే అక్కడ ఒడ్డున ఉన్నవారు గమనించి వెళ్లే సరికి మృతి చెందాడు. మృతునికి భార్య నర్సామ్మతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒకే కుటుంబంలో రెండు రోజులలో ఇద్దరు మృతి చెందడటంతో కుటంబంలో, గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుని భార్య నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: (అన్నలారా.. మేమెలా బతకాలి?) -
ఫిట్స్ రావడంతో పొలంలో పడి మహిళ మృతి
కౌడిపల్లి(నర్సాపూర్): ఫిట్స్ రావడంతో బురద పొలంలో పడి మహిళ ఊపిరాడక మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని సలాబత్పూర్ ఇట్య తండాలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని సలాబత్పూర్ ఇట్య తండాకు చెందిన కాట్రోత్ మంజుల (25) ఆమె భర్త గోప్య ఇద్దరూ కలిసి సొంత పొలంలో పనికి వెళ్లారు. మధాహ్నం సమయంలో మంచినీరు తెమ్మని చెప్పడంతో నీళ్లు తెచ్చేందుకు వెళ్లిన మంజులకు ఫిట్స్ రావడంతో ఒరంపై నుండి జారి పొలంలో పడిపోయింది. కొద్దిసేపటికి గమనించిన భర్త అక్కడికి వెళ్లి చూడగా బురదలో పడిపోవడంతో ఊపిరాడక మృతిచెందింది. ఈ విషయమై మృతురాలి అన్న బదావత్ గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలికి కొడుకు ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
గాజుల వ్యాపారులు బిజీ
కౌడిపల్లి: బతుకమ్మ పండుగ నేపథ్యంలో బ్యాంగిల్స్టోర్ బిజీగా ఉంది. బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకం. మహిళలు గాజులు, అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడంతో దుకాణాలు బిజీగా మారాయి. మండలంలోని పలు గ్రామాల్లో శనివారం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం, సోమవారం సైతం బతుకమ్మ పండుగను నిర్వహించనున్నారు. -
తెరచుకోని పశువుల ఆస్పత్రి
డాక్టర్ డిప్యూటేషన్ రద్దు సెలవులో అటెండర్ సమాచారం లేదన్న ఏడీఏ కౌడిపల్లి: రెండు రోజులుగా పశువులు ఆసుపత్రి తెరచుకోవడం లేదు. శనివారం ఆసుపత్రికి వచ్చిన రైతులు ఇబ్బంది పడ్డారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రణీత్‌రాజ్ విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలతో ఉన్నతాధికారులు ఇటీవల అతని డిప్యూటేషన్ రద్దు చేశారు. ఇక్కడ విధులు నిర్వహించే అటెండర్ రెండు రోజుల నుంచి సెలవుపై వెళ్తున్నట్లు ఆసుపత్రి ఎదుట బోర్డుపై కాగితం అంటించారు. వైద్యుడు లేక అటెండర్ రాక మూగజీవులకు వైద్యం అందడదం లేదు. ఆసుపత్రికి వచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై నర్సాపూర్ ఏడీఏ వెంకటయ్య వివరణ కోరగా డాక్టర్‌పై ఆరోపణలు రావడంతో అతని డిప్యూటేషన్ రద్దు చేశామన్నారు. అటెండర్ సెలవు పెట్టిని విషయం తమకు తెలియదన్నారు. సెలవుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదన్నారు. రాయలాపూర్ లైవ్‌స్టాక్ అసిస్టెంట్‌ను డిప్యుటేషన్ వేస్తామని తెలిపారు. -
తునికి నల్లపోచమ్మ హుండీ లెక్కింపు
కౌడిపల్లి: మండలంలోని తునికి నల్లపోచమ్మదేవి ఆలయ హుండీ ఆదాయం రూ.1,63,347 వచ్చినట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. గురువారం దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు, గ్రామస్తుల సమక్షంలో ఆదాయాన్ని లెక్కించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నగదు లెక్కించగా రూ 1,63,347 వచ్చినట్లు తెలిపారు. ఈఓ శ్రీనివాస్, సిబ్బంది రామకృష్ణ, గ్రామ ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్‌రెడ్డి, సర్పంచ్ సువర్ణ మోషయ్య, ఎంపీటీసీ సువర్ణ అంజయ్య, మాజీ సర్పంచ్ సాయగౌడ్, ఉపసర్పంచ్ శేఖర్, వీఆర్ఓ మల్లేశం, కానిస్టేబుల్ దత్తు గ్రామస్తులు పాల్గొన్నారు. సహాయ కమిషనర్‌కు సన్మానం తునికి నల్లపోచమ్మ ఆలయానికి మొదటిసారిగా వచ్చిన్న దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ కృష్ణప్రసాద్‌ను గ్రామ ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. అర్చకులు శివ్వప్ప ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. -
నిండిన గొలుసు చెరువులు
కౌడిపల్లి: హమ్మయ్య.. 26 ఏళ్ల తరువాత మండలంలోని గొలుసు చెరువులకు జలకళ సంతరించుకుంది. అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలతో శనివారం గొలుసు చెరువులు నిండాయి. మహ్మద్‌నగర్, కన్నారం, కౌడిపల్లి, వెల్మకన్న, కొట్టాల గొలుసు చెరువులున్నాయి. మహ్మద్‌నగర్, కన్నారం చెరువులు నిండి... వాటి వరద మిగతా చెరువుల్లోకి చేరి నిండుతాయి. 1988, 1998, 1990లో వరుసగా మూడు సార్లు చెరువులు నిండి అలుగులు పారాయి. అప్పటి నుంచి 26 ఏళ్లగా నిండుకోలేదు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో శనివారం సాయంత్రానికి మహ్మద్‌నగర్, కన్నరం, కౌడిపల్లి, వెలక్మన్న చెరువులు ఆర ఫీటు ఎత్తులో నీరు వస్తే అలుగు పారనున్నాయి. మినీ ట్యాంక్‌బండ్‌కు మరమ్మతులు కౌడిపల్లిలోని పెద్ద చెరువు మినిట్యాంక్ బండ్ అలుగు వద్ద మట్టి తక్కువగా ఉండటంతో గ్రామస్తుల సూచన మేరకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. చెరువు పూర్తిస్థాయిలో నిండింది. అలుగు వద్ద మట్టి తక్కువగా ఉండటంతో ఐబీ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ చాందీరామ్ పరిశీలించి జేసీబీలను తెప్పించి మట్టి వేయించారు. ఏంపీపీ చిలుముల పద్మ నరసింహారెడ్డి, శివాంజనేయులు, సర్పంచ్ బీస కాంతపురుషోత్తం, ఎంపీటీసీ గొర్రె శ్యామల రవి, గ్రామస్తులు ఉన్నారు. -
గ్రామాల్లో బొడ్డెమ్మల సందడి
కౌడిపల్లి: గ్రామాల్లో బొడ్డెమ్మల సందడి మొదలైంది. బతుకమ్మ పండుగకు ముందు చిన్న బతుకమ్మలను, అంతకు ముందు బొడ్డెమ్మల పండుగను నిర్వహించడం ఆనవాయితీ. కాగా గత శుక్రవారం నుంచి గ్రామాల్లో బొడ్డెమ్మల పండుగ సందడి నెలకొంది. మంగళవారం ఐదో రోజు కౌడిపల్లిలో బొడ్డెమ్మలను పేర్చి మహిళలు బతుకమ్మ ఆడారు. అనంతరం బొడ్డెమ్మలను చిన్నపిల్లల ఒడిలోపెట్టి పాటలు పాడుతూ ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. -
ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి
జిల్లాల పునర్విభజనపై.. లోక్‌సత్తా ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమం కౌడిపల్లి: జిల్లాల పునర్విభజనలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని లోక్‌సత్తా నర్సాపూర్ నియోజకవర్గం కన్వీనర్ నాగేందర్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం కౌడిపల్లి బస్టాండ్ ఆవరణలో లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం నిర్వహించారు. నర్సాపూర్ నియోజక వర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయడంతోపాటు ఏ జిల్లాలో కలపాలన్న ప్రజలు ఆభిప్రాయాన్ని పోస్టుకార్డుపై రాసిన సీసీఎల్ఏ అడ్రస్ బాక్స్‌లో వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులన్నారు. జిల్లా, రెవెన్యూ మండలాల పునర్విభజనలో ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని తెలిపారు. ప్రభుత్వం ఏకపక్షంగా కాకుండా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వారి సౌలభ్యం కోసం ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు, పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తున్నందున అనుకూలంగా ఉండేట్లు చూడాలన్నారు. గ్రామస్తులు కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
మంజీర నదిలో మొసలి కలకలం
ఆందోళనలో రైతులు కౌడిపల్లి: చండూర్ సమీపంలోని మంజీర నదిలో శనివారం మొసలి కనిపించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంజీర నదిపై చండూర్ ఎత్తిపోతల పథకం సమీపంలో మోటార్ల మరమ్మతు కోసం రైతులు ఏడెడ్ల మడుగులో దిగగా మొసలి కనిపించడంతో ఆందోళనకు గురై ఒడ్డుకు పరుగులు తీశారు. ఇటీవల వర్షాలు లేకపోవడంతో నది పూర్తిగా ఎండిపోయింది. ఘణపూర్ ఆనకట్టకు సింగూర్ నుంచి నీటిని విడుదల చేశారు. కాలువలో నీరు రావడంతో పలువురు రైతులు నదిలో మోటార్లను ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మడుగులో మొసలి కనిపించడంతో తహసీల్దార్ నిర్మల, ఆర్ఐ కిషోర్‌కుమార్‌కు సమాచారమిచ్చారు. రెవెన్యూ అధికారులు అటవీ అధికారులకు సమాచారమిచ్చి ప్రజలను అప్రమత్తం చేశారు. -
కౌడిపల్లివాసుల ఆగ్రహం
మండలాన్ని మెదక్‌కు తూప్రాన్ డివిజన్లో కలపడంపై ఆగ్రహం ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపు ఇబ్బందులకు గురిచేయడమే సౌలభ్యమా? దూరభారంతో పాటు అవస్థలు తప్పవని ఆవేదన ప్రభుత్వం స్పందించాలని వేడుకోలు కౌడిపల్లి: మండల ప్రజలకు సౌకర్యంగా ఉన్న మెదక్ రెవెన్యూ డివిజన్లోని కౌడిపల్లి మండలాన్ని తూప్రాన్ డివిజన్లో కలపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అవస్థలను తీర్చడంతో పాటు పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం జిల్లాల పునర్విభజన, కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేస్తోంది. ప్రజలకు మరింత సౌకర్యంగా మారాల్సిన ఈ ప్రక్రియ మండలవాసులకు మాత్రం శాపంగా మారనుంది. ప్రభుత్వం మూడు రోజుల క్రితం విడుదల చేసిన డ్రాప్ట్‌లో కౌడిపల్లి మండలాన్ని మెదక్ డివిజన్లో కాకుండా తూప్రాన్ డివిజన్లో కలుపుతున్నట్లు పేర్కోనడంతో స్థానికులు ప్రభుత్వం, అధికారులు, నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌడిపల్లి మండలంలో 28 గ్రామ పంచాయతీల పరిధిలో 35 రెవెన్యూ గ్రామాలు, 10 మదిర గ్రామాలు, 82 తండాలున్నాయి. మొత్తం మండల జనాభా 55,617 మంది. మండలం తూర్పు పడమరగా 28 కిలోమీటర్లు, ఉత్తర దక్షిణంగా 16 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ప్రస్తుతం నర్సాపూర్ నియోజకవర్గం, మెదక్ రెవెన్యూ డివిజన్లో కొనసాగుతోంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా నర్సాపూర్, హత్నూర మండలాలను సంగారెడ్డి జిల్లాలో కలిపారు. కొల్చారం మండలం మెదక్ రెవెన్యూ డివిజన్లో, శివ్వంపేట, వెల్దుర్తి, కౌడిపల్లి మండలాలను నూతనంగా ఏర్పాటు చేస్తున్న తూప్రాన్ డివిజన్లో కలుపుతున్నట్లు ప్రభుత్వం డ్రాప్ట్‌లో పేర్కొంది. మిగతా మండలాలకు ఇబ్బంది లేకున్నా కౌడిపల్లి మండల వాసులకు మాత్రం అవస్థలు ఎదురు కానున్నాయి. కౌడిపల్లి మండలంలోని అన్ని గ్రామాల నుంచి మెదక్‌కు 20 నుంచి 32 కిలోమీటర్ల దూరం ఉంది. అసరం నిమిత్తం మెదక్ వెళ్లినవారు రెండు గంటల్లో పనులు ముగించుకుని తిరిగి వస్తారు. ప్రస్తుతం తూప్రాన్ రెవెన్యూ డివిజన్లో కలపడంతో 48 నుంచి 65 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొననుంది. అవసరం నిమిత్తం మండల ప్రజలు ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తేం మూడు బస్సులు ఎక్కాల్సిన దుస్థితి. రోజంతా వృథాకానుంది. అధికారుల ప్రతిపాదనపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌కు అభ్యంతరాలు చెప్పనున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ స్పందించి కౌడిపల్లి మండలాన్ని మెదక్‌లోనే కలపాలని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ఉద్యమం చేసేందుకు వివిధ పార్టీలతో పాటు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. దూరం భారం మండలాన్ని మెదక్ రెవెన్యూ డివిజన్లో కాకుండా తూప్రాన్‌లో కలపడం సరైంది కాదు. ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉన్న మెదక్‌ను కాకుండా తూప్రాన్‌లో కలపడంతో దూర భారం పెరుగుతుంది. ప్రజల సౌకర్యం కోసం మెదక్‌లోనే కొనసాగించాలి. - నదరి విఠల్, గౌతాపూర్ యువజన సంఘం నాయకుడు అనాలోచిత నిర్ణయం ప్రభుత్వం, అధికారులు అనాలోచిత నిర్ణయంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి. రాజకీయ దురుద్దేశంతో దగ్గరగా ఉన్న మెదక్‌ను కాదని తూప్రాన్‌లో కలపడం సరైంది కాదు. ఎమ్మెల్యే స్పందించి సమస్యను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలి. - ఎంసీ విఠల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సమస్యలను సృష్టించడమే కౌడిపల్లి మండలాన్ని మెదక్‌లో కాకుండా తూప్రాన్‌లో కలపడం ప్రజలకు కొత్త సమస్యలు సృష్టించడమే అవుతుంది. అధికారులు పునరాలోచించాలి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇప్పటికే ఫిర్యాదు చేశాం. యథావిధగా ఉంచాలని మనవి. - సార రామాగౌడ్, మాజీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే దృష్టికి.. మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న తూప్రాన్ రెవెన్యూ డివిజన్లో కలుపుతూ ప్రభుత్వం డ్రాప్ట్ విడుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశాం. సమస్యను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు కృషి చేస్తాం. - చిలుముల పద్మ నరసింహారెడ్డి, ఎంపీపీ -
పశువైద్యశాల తనిఖీ
కౌడిపల్లి: మూగజీవాలకు మెరుగైన వైద్యం అందించాలని పశుసంవర్ధకశాఖ జేడీ విక్రంకుమార్ సూచించారు. గురువారం కౌడిపల్లి పుశువైద్యశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో పశువులు, గొర్రెలు, మేకలకు వ్యాధులు సోకుతాయన్నారు. గొర్రెలకు నీలినాలుక వ్యాధి వ్యాపిస్తుందన్నారు. అనారోగ్యంతో మేత మేయక పోవడంవల్ల మృతి చెందుతాయని వ్యాధి లక్షణాలను గుర్తించి వైద్యులను సంప్రదించాలన్నారు. ఇటీవల పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశామన్నారు. ఆసుపత్రులలో మందుల కొరత లేదన్నారు. ఆయన వెంట డాక్టర్ ప్రణీత్‌రాజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
'స్వచ్ఛత' వైపు బండపోతుగళ్
అతిసార నుంచి బయటపడిన గ్రామం వందశాతం మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం సంపూర్ణ పారిశుద్ధ్య చర్యలు కౌడిపల్లి : అతిసారతో అతలాకుతలమైన గ్రామం స్వచ్ఛత వైపు వడివడిగా అడుగులు వేస్తుంది. పక్షం రోజులక్రితం గ్రామంలో అతిసార ప్రారంభంకాగా వందల సంఖ్యలో గ్రామ ప్రజలు రోగాల బారిన పడ్డారు. వీరిలో ఒకరు మృతి చెందారు. అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రస్తుతం గ్రామం కోలుకుంది. ఇదే స్ఫూర్తితో వందశాతం సంపూర్ణ పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు గ్రామస్తులు చర్యలు చేపట్టారు. మండలంలోని బండపోతుగళ్‌లో గతనెల 25వ తేదీ నుంచి ఒక్కొక్కరిగా వాంతులు, విరేచనాలు ప్రారంభమై గ్రామస్తులందరికి వ్యాపించింది. రక్షితం మంచినీటి పథకం నీరు కలుషితం కావడంతో గ్రామంలో అతిసార ప్రబలింది. దీంతో గతనెల 27వ తేదీన స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సూచనల మేరకు కలెక్టర్ గ్రామాన్ని సందర్శించారు. అధికారులు గ్రామస్తులతో గ్రామంలో కలియ తిరిగి పరిస్థితులను సమీక్షించారు. స్వచ్ఛ గ్రామం వైపు.. బండపోతుగళ్ గ్రామాన్ని కలెక్టర్ రోనాల్డ్‌రాస్ సందర్శంచి సంపూర్ణ పారిశుద్ధ్యం కోసం సహకరించాలని వందశాతం మరుగుదొడ్లను నిర్మించుకోవాలని సూచించారు. గ్రామంలో 218 కుటుంబాలు, జనాభా 1160 జనాభా ఉన్నారు. గ్రామానికి రెండు రక్షిత మంచినీటి ట్యాంకులు, ఒక మినీ ట్యాంక్ ద్వారా నీటి సరఫర జరుగుతుంది. ఇందులో 187 కుటుంబాలకు ఇంటింటికి నల్లకనెక్షన్లు ఉన్నాయి. గ్రామంలో 51 కుటుంబాలకు మరుగుదొడ్లు ఉండగా 136 కుటుంబాకు మరుగుదొడ్లు అవసరమని అధికారులు గుర్తించారు. ఇందులో 108 మందికి మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు సొంత స్థలం ఉండగా, 28 కుటుంబాలకు స్థలంలేదు. రక్షిత మంచినీరు కలుషితం కావడంతోనే అతిసార వ్యాపించినట్లు గుర్తించిన అధికారులు గ్రామస్తులకు పది రోజులపాటు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయడంతోపాటు రోజూ 300 బాటిళ్లలో తాగునీటిని అందించారు. అనంతరం 56 నల్లాగుంతలు పూడ్చివేసి గుంతలలో ఉన్న నల్లా కనెక్షన్లను గ్రామపంచాయితీ ఆధ్వర్యంలో పైకి అమర్చారు. మురికి కాలువలు శుభ్రం చేయడంతోపాటు రోడ్డుపై ఉన్నటువంటి చెత్త, మురికిని శుభ్రంచేసి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. రక్షిత మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయడంతోపాటు లీకేజీలు సరిచేశారు. కలెక్టర్ ఆదేశాలమేరకు ఇంటంటింకి మరుగుదొడ్లు కట్టించుకునేందుకు గ్రామస్తులు ముందుకొచ్చారు. సంపూర్ణ పారిశుద్ధ్యంతోనే ఆరోగ్యం: షఫి, బండపోతుగళ్ సంపూర్ణ పారిశుద్ధ్యంతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ప్రస్తుతం గ్రామంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా నిర్వహించారు. వీధులన్నీ శుభ్రం చేయడంతోపాటు నల్లా గుంతలను పూడ్చివేశారు. మంచినీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకున్నారు. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు: విఠల్, సర్పంచ్ బండపోతుగళ్ కలెక్టర్ రోనాల్డ్‌రాస్ వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఆదేశించారు. అలా చేస్తే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు దీంతో ఇప్పటికే కొందరు నిర్మించుకున్నారు. ప్రస్తుతం గ్రామస్తులు వ్యవసాయం పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామస్తులకు అవగాహన వెంకటేశ్ , పంచాయితీ కార్యదర్శి, బండపోతుగళ్ సంపూర్ణ పారిశుద్ధ్యంపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నాం. వందశాతం మరుగుదొడ్లను నిర్మించుకునేందుకు గాను చర్యలు తీసుకున్నాం. గ్రామంలో ఎంతమందకి అవసరం ఉందో ఇప్పటికే గుర్తించాం. దీంతో త్వరలో గ్రామం స్వచ్ఛ గ్రామంగా మారనుంది. -
త్వరలో డీసీసీబీ మైక్రో ఏటీఎంలు
కౌడిపల్లి: జిల్లాలోని అన్ని సొసైటీలలో డీసీసీబీ ఆధ్వర్యంలో త్వరలో మైక్రో ఏటీఎంలు ప్రారంభించనున్నట్లు డీసీసీబీ వైస్ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. శనివారం కౌడిపల్లిలోని మహ్మద్‌నగర్ సొసైటీలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ సంగారెడ్డిలో డీసీసీబీ ఆధ్వర్యంలో ఏటీఎంను ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలో అన్ని సొసైటీలలో మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేసి ఖాతాదారులకు మరింత సౌకర్యం కల్పిస్తామన్నారు. కౌడిపల్లిలో డీసీసీబీ బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెండు రోజులలో రైతులకు కొత్త రుణాల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. ఒక్కో డైరెక్టర్ పరిధిలోని రైతులకు రూ 20 లక్షల నుండి రూ 25 లక్షల వరకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రుణమాఫీ రాగానే పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల చివరి వరకు డీసీసీబీ ఆధ్వర్యంలో డిపాజిట్ల మహోత్సవం కార్యక్రమంలో భాగంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్లు తెలిపారు. రైతులు డిపాజిట్లు చేయాలన్నారు. సొసైటీల ఆధ్వర్యంలో విత్తనాలు, ఎరువులు విక్రయించడంతో పాటు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మంచి లాభాలు వస్తున్నాయని తెలిపారు. రైతులకు మరిన్ని సౌకర్యలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ వెంకట్‌రెడ్డి, డైరెక్టర్లు జానయ్య, వెంకటన్న, జయరాం తదితరులు పాల్గొన్నారు. -
బండపోతుగళ్‌లో అదుపులో అతిసార
కౌడిపల్లి: మండలంలోని బండపోతుగళ్‌లో అతిసార అదుపులోకి వచ్చింది. అధికారులు సకాలంలో స్పందించి మెరుగైన వైద్యం అందించడంతో అతిసార తగ్గింది. మంగళవారం నాటి వైద్య శిబిరంలో కేవలం ముగ్గురు మాత్రమే ఓపీ చూయించుకున్నారు. ఎవరికి వాంతులు విరేచనాలు లేవని డాక్టర్ దివ్యజ్ఞ తెలిపారు. ఈఓపీఆర్డీ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు వెంకటేశ్, నరేష్, విజయ్‌పాల్‌రెడ్డి తదితరులు గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. రక్షిత మంచినీటి పథకం వద్ద కట్ వాల్వ్‌లను పరిశీలించి లీకేజీలు లేకుండా చేశారు. -
అదుపులో అతిసార
ఊపిరిపీల్చుకున్న బండపోతుగళ్ గ్రామస్తులు కౌడిపల్లి : మండలంలోని బండపోతుగళ్‌లో అతిసార అదుపులోకి వచ్చింది. గత కొద్దిరోజులుగా గ్రామంలో అతిసార విజృంభించడంతో గ్రామస్తులు తల్లడిల్లిపోయారు. గ్రామంలో నాలుగో రోజైన శనివారం కూడా డాక్టర్ విజయశ్రీ, డ్టాక్టర్ దివ్యజ్ఞ, సిబ్బంది ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించారు. గ్రామానికి చెందిన 12 మందికి వాంతులు విరేచనాలు కావడంతో చికిత్స చేశారు. దీంతోపాటు 32 మందికి ఓపీ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. తహసీల్దార్ నిర్మల, ఎంపీడీఓ శ్రీరాములు, ఈఓ పీఆర్డీ సత్యనారాయణ ఎంపీహెచ్ఈఓ సురేందర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చిన్ని నాయక్, వైద్యసిబ్బంది గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. గ్రామస్తులకు అధికారులు మినరల్ వాటర్ బాటిళ్లను సరఫరా చేశారు. పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. సంగారెడ్డి, జోగిపేటలో చికిత్స పొందుతున్నవారు సైతం కోలుకుంటున్నారు. సర్పంచ్ విఠల్, మాజీ సర్పంచ్ మల్లారెడ్డి గ్రామస్తులు సయ్యద్ హుస్సేన్, షఫి, పోచయ్య, మాణిక్యం తదితరులు అధికారులకు సహకరించారు. -
అతిసార బాధితులకు ఊరట
బండపోతుగళ్‌లో కొనసాగుతున్న వైద్య శిబిరం గ్రామాన్ని సందర్శించిన జేడీ డాక్టర్ సుబ్బలక్ష్మి కౌడిపల్లి: మండలంలోని బండపోతుగళ్‌లో వైద్యశిబిరం కొనసాగుతోంది. శుక్రవారం మూడోరోజు గ్రామస్తులకు కాస్త ఊరట లభించింది. వాంతులు, విరేచనాలు అదుపులోకి వచ్చాయి. గ్రామాన్ని జేడీ సుబ్బలక్ష్మి సందర్శించారు. బండపోతుగళ్‌లో అతిసార ప్రబలడంతో గ్రామస్తులు అస్వస్థతకు గురై మూడు రోజులుగా గ్రామంలో వైద్యశిబిరం కొనసాగుతున్న విషయం విధితమే. కాగా మూడోరోజు వైద్య శిబిరంలో డాక్టర్ దివ్యజ్ఞ, డాక్టర్ విజయశ్రీ వైద్య సిబ్బంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పదమూడు మందికి వాంతులు, విరేచనాలు కావడంతో ప్రత్యేక చికిత్సలు చేశారు. దీంతోపాటు మరో యాభై మందికి పీఓ వైద్యం అందించారు. ఏఎన్ఎంలు ఇంటింటికీ తిరిగి గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ పంపిణీ చేసి క్లోరినేషన్ చేశారు. కాచి వడపోసిన నీటిని తాగాలని సూచించారు. గ్రామంలో ప్రధానంగా 1, 2, 3, 4వ వార్డుల ప్రజలకు మాత్రం అధికంగా అతిసార సోకినట్లు గుర్తించారు. దీంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, వైద్య సిబ్బంది రక్షిత మంచినీటి పథకం ట్యాంక్‌లలో క్లోరినేషన్ చేశారు. నల్లా గుంతలను సరిచేయడంతోపాటు కాలనీల్లో పంచాయతీ సిబ్బందితో కలిసి గుంతలు పూడ్చివేశారు. కట్వాల్ వద్ద లీకేజీలు లేకుండా చూశారు. గ్రామాన్ని సందర్శించిన జేడీ సుబ్బలక్ష్మి బండపోతుగళ్ గ్రామాన్ని వైద్య ఆరోగ్యశాఖ జేడీ డాక్టర్ సుబ్బలక్ష్మి సందర్శించారు. గ్రామంలోని పలు కాలనీలలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. నల్ల లీకేజీలు, నల్ల గుంతలను చూశారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులపై ఆరా తీశారు. అనంతరం వైద్యశిబిరంలో రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఓపీ, ఇన్‌పేషెంట్ జాబితా, మందులను పరిశీలించారు. వైద్యులు డాక్టర్ విజయశ్రీ, దివ్యజ్ఞలను అతిసార వ్యాధి బాధితులకు అందుతున్న సేవలను గురించి ప్రశ్నించారు. బాధితులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. డీఎంహెచ్ఓ అమర్‌సింగ్‌నాయక్, ఎపిడమాలజిస్ట్ రజిని, తహసీల్దార్ నిర్మల, ఎంపీడీఓ శ్రీరాములు, ఈఓ పీఆర్డీ సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చిన్ని నాయక్, పంచాయతీ కార్యదర్శులు వెంకటేశ్, వీఆర్ఓలు పాల్గొన్నారు. -
విజృంభించిన అతిసారా
బండపోతుగల్‌లో 48 మందికి అస్వస్థత ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం హైదరాబాద్ తరలింపు సంగారెడ్డి, జోగిపేట, ఎంఎన్ఆర్ ఆసుపత్రుల్లో పలువురి చేరిక గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ రోనాల్డ్ రోస్ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు కౌడిపల్లి : గ్రామంలో ఒక్కసారిగా అతిసార విజృంభించింది. 48 మంది అస్వస్థతకు గురికాగా అందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా వారిని హైదరాబాద్ తరలించారు. మరి కొందరు సంగారెడ్డి, జోగిపేట, ఎంఎన్ఆర్ ఆసుపత్రులలో చేరారు. విషయం తెలియడంతో స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ గ్రామాన్ని సందర్శించి పరిసరాలను పరిశీలించారు. వైద్యశిబిరం ఏర్పాటు చేయించారు. ఈ సంఘటన మండలంలోని బండపోతుగల్‌లో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని బండపోత్గళ్లో రెండురోజులుగా పలువురు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఒక్కసారిగా ఒకరితోపాటు మరొకరు అస్వస్థతకు గురయ్యారు. దీంతో 108, ఆటోల్లో స్థానిక ఆర్‌ఎంపీతోపాటు సంగారెడ్డి, జోగిపేట ఆసుపత్రులకు తరలి వెళ్లారు. మంగళవారం తెల్లవారుజాము నుండి గ్రామానికి చెందిన నీరుడి కిష్టమ్మ, బుచ్చమ్మ, మంతూరి మల్లేశం, సాలె సంగమ్మ, మాందపురం మల్లమ్మ, చెన్న, కమ్మరి శ్రీరాముల వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. సాహెబ్ఖాన్తో పాటు అతని కొడుకు అఫ్రోజ్‌ఖాన్(7) పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అబ్జల్‌ఖాన్, ఖాజాబీ, మంగళి కీర్త, మంగళి నారాయణ, యాదగిరి, ఘనపురం నారాయణ, గొల్ల శ్రీశైలం, బీరప్పకు వాంతులు కావడంతో సంగారెడ్డి, జోగిపేటకు తరలివెళ్లారు. అంగన్వాడీ కార్యకర్త ధనలకీ‡్ష్మ కూతురు మోహనప్రియ, సాయిధనుష్కు అస్వతస్థకు గురికావడంతో ఎంఎన్ఆర్ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఒక్కసారిగా పలువురు వాంతులు, విరేచనాలతో అనారోగ్యం పాలవడంతో స్థానికులు నేరుగా సమస్యను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో గ్రామంలో పరిస్థితిని సమీక్షించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అధికారులను అప్రమత్తం చేశారు. ఇన్చార్జి డీఎంహెచ్ఓ అమర్‌సింగ్‌నాయక్, మెదక్ ఆర్డీఓ నగేష్ గ్రామాన్ని సందర్శించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక వైద్యులు డాక్టర్ విజశ్రీ, దివ్యజ్ఞతోపాటు నర్సాపూర్ క్లస్టర్ సిబ్బంది గ్రామంలోని రోగులకు స్థానిక పంచాయతీ కార్యాలయం, కమ్యూనిటీ భవనంలో వైద్యచికిత్సలు అందించారు. గ్రామానికి చెందిన నర్సింహులు, కృష్ణ, అమేర్హుస్సేన్, అన్వర్‌ఖాన్, ముస్తాక్ హుస్సేన్, దుర్గయ్య, మనెమ్మ, బాలమణి, వినీల్, శాంతమ్మ, శిరీష, శివ్వమ్మ, భాగమ్మ, పోచమ్మ, శోభ, భూమయ్య, రేఖ, స్వప్న, దుర్గయ్య, మల్లయ్య, సభ ఫాతిమ, శివ తదితరులకు ప్రత్యేక చికిత్సలు చేశారు. అందులో ఇద్దరిని జోగిపేట ఆసుపత్రికి తరలించారు. గ్రామాన్ని సదర్శించిన కలెక్టర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ బండపోతుగల్æ గ్రామాన్ని సందర్శించి పరిసరాలను పరిశీలించారు. వైద్య చికిత్సలందుతున్న తీరును పరిశీలించి, రోగులను ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. నీటిగుంతల కారణంగా రక్షిత మంచినీరు కలుషితం అవుతుండడాన్ని గమనించారు. నల్లా నీరు కలుషితం కావడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. అనంతరం గ్రామస్తులతో గ్రామసభ నిర్వహించారు. గ్రామజ్యోతి కమిటీలు సరిగా పని చేయడం లేదన్న విషయం గ్రామాన్ని చూడగానే తెలుస్తోందని కలెక్టర్ చెప్పారు. గ్రామస్తులందరూ గ్రామసభను ఏర్పాటు చేసుకుని నల్లా గుంతలు పూడ్చివేయాలని, మోటార్లు బంద్ చేయించాలన్నారు. నీటి సమస్య తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. గ్రామస్లులు సహకరిస్తే నవాబుపేట మాదిరిగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అయితే గ్రామస్తులు ఆగస్టు 15 వరకు వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. రక్షిత మంచినీటి ట్యాంక్‌కు మెట్ల నిర్మాణం కోసం రూ. 1లక్ష మంజూరు చేశారు. త్వరగా పనులు చేపట్టాలని సూచించారు. దీంతోపాటు స్థానిక ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. తహసీల్దార్ నిర్మల, ఎంపీడీఓ శ్రీరాములు, మాజీ జెడ్పీటీసీ సార రామగౌడ్, సర్పంచ్ విఠల్, మాజీ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్‌హుస్సేన్, మాజీ సర్పంచ్ మల్లారెడ్డి, గ్రామస్తులు మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పది మంది చేరిక సంగారెడ్డి టౌన్ : బండ్లపోతుగల్ గ్రామానికి చెందిన అక్కా తమ్ముడు రేవంతి (4), అభిలాష్ (2) తీవ్ర అస్వస్థతో బుధవారం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేరారు. రేవంతి పరిస్థితి కొంచెం మెరుగుపడింది. కానీ చిన్నారి అభిలాష్ తీవ్ర బాధతతో కొట్టుమిట్టాడుతున్నాడు. చిన్నారుల నానమ్మ శాంతమ్మ మనువడి పరిస్థితి చూసి కన్నీటి పర్యంతం అవుతోంది. అంతే కాకుండా అదే గ్రామానికి చెందిన సంక్తీర్తన (11) ఆసుపత్రిలో చేరింది. జోగిపేట్ ఆసుపత్రిలో చికిత్స అందుబాటులో లేకపోవడంలో అందరూ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలి వచ్చారు. అంతే కాకుండా సంగారెడ్డి పట్టణంలోని బాబానగర్ చెందిన పూజ (10) అతిసారతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. రెండు రోజుల నుండి అతిసార కేసులు వస్తున్నాయని వారికి చికిత్స అందిస్తున్నామని, కొందరు కోలుకున్నారని డాక్టర్ రహీం పేర్కొన్నారు.