మాట్లాడుతున్న డీసీసీబీ వైస్ చైర్మన్ గోవర్ధనరెడ్డి
కౌడిపల్లి: జిల్లాలోని అన్ని సొసైటీలలో డీసీసీబీ ఆధ్వర్యంలో త్వరలో మైక్రో ఏటీఎంలు ప్రారంభించనున్నట్లు డీసీసీబీ వైస్ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. శనివారం కౌడిపల్లిలోని మహ్మద్‌నగర్ సొసైటీలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ సంగారెడ్డిలో డీసీసీబీ ఆధ్వర్యంలో ఏటీఎంను ప్రారంభించినట్లు తెలిపారు.
త్వరలో అన్ని సొసైటీలలో మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేసి ఖాతాదారులకు మరింత సౌకర్యం కల్పిస్తామన్నారు. కౌడిపల్లిలో డీసీసీబీ బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెండు రోజులలో రైతులకు కొత్త రుణాల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. ఒక్కో డైరెక్టర్ పరిధిలోని రైతులకు రూ 20 లక్షల నుండి రూ 25 లక్షల వరకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రుణమాఫీ రాగానే పంపిణీ చేస్తామన్నారు.
ఈ నెల చివరి వరకు డీసీసీబీ ఆధ్వర్యంలో డిపాజిట్ల మహోత్సవం కార్యక్రమంలో భాగంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్లు తెలిపారు. రైతులు డిపాజిట్లు చేయాలన్నారు. సొసైటీల ఆధ్వర్యంలో విత్తనాలు, ఎరువులు విక్రయించడంతో పాటు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మంచి లాభాలు వస్తున్నాయని తెలిపారు. రైతులకు మరిన్ని సౌకర్యలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ వెంకట్‌రెడ్డి, డైరెక్టర్లు జానయ్య, వెంకటన్న, జయరాం తదితరులు పాల్గొన్నారు.