కౌడిపల్లి గ్రామం
- మండలాన్ని మెదక్‌కు తూప్రాన్ డివిజన్‌లో కలపడంపై ఆగ్రహం
- ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపు
- ఇబ్బందులకు గురిచేయడమే సౌలభ్యమా?
- దూరభారంతో పాటు అవస్థలు తప్పవని ఆవేదన
- ప్రభుత్వం స్పందించాలని వేడుకోలు
కౌడిపల్లి: మండల ప్రజలకు సౌకర్యంగా ఉన్న మెదక్ రెవెన్యూ డివిజన్‌లోని కౌడిపల్లి మండలాన్ని తూప్రాన్ డివిజన్‌లో కలపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అవస్థలను తీర్చడంతో పాటు పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం జిల్లాల పునర్విభజన, కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేస్తోంది.
ప్రజలకు మరింత సౌకర్యంగా మారాల్సిన ఈ ప్రక్రియ మండలవాసులకు మాత్రం శాపంగా మారనుంది. ప్రభుత్వం మూడు రోజుల క్రితం విడుదల చేసిన డ్రాప్ట్‌లో కౌడిపల్లి మండలాన్ని మెదక్ డివిజన్‌లో కాకుండా తూప్రాన్ డివిజన్‌లో కలుపుతున్నట్లు పేర్కోనడంతో స్థానికులు ప్రభుత్వం, అధికారులు, నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కౌడిపల్లి మండలంలో 28 గ్రామ పంచాయతీల పరిధిలో 35 రెవెన్యూ గ్రామాలు, 10 మదిర గ్రామాలు, 82 తండాలున్నాయి. మొత్తం మండల జనాభా 55,617 మంది. మండలం తూర్పు పడమరగా 28 కిలోమీటర్లు, ఉత్తర దక్షిణంగా 16 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ప్రస్తుతం నర్సాపూర్ నియోజకవర్గం, మెదక్ రెవెన్యూ డివిజన్‌లో కొనసాగుతోంది.
జిల్లాల పునర్విభజనలో భాగంగా నర్సాపూర్, హత్నూర మండలాలను సంగారెడ్డి జిల్లాలో కలిపారు. కొల్చారం మండలం మెదక్ రెవెన్యూ డివిజన్‌లో, శివ్వంపేట, వెల్దుర్తి, కౌడిపల్లి మండలాలను నూతనంగా ఏర్పాటు చేస్తున్న తూప్రాన్ డివిజన్‌లో కలుపుతున్నట్లు ప్రభుత్వం డ్రాప్ట్‌లో పేర్కొంది.
మిగతా మండలాలకు ఇబ్బంది లేకున్నా కౌడిపల్లి మండల వాసులకు మాత్రం అవస్థలు ఎదురు కానున్నాయి. కౌడిపల్లి మండలంలోని అన్ని గ్రామాల నుంచి మెదక్‌కు 20 నుంచి 32 కిలోమీటర్ల దూరం ఉంది. అసరం నిమిత్తం మెదక్ వెళ్లినవారు రెండు గంటల్లో పనులు ముగించుకుని తిరిగి వస్తారు.
ప్రస్తుతం తూప్రాన్ రెవెన్యూ డివిజన్‌లో కలపడంతో 48 నుంచి 65 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొననుంది. అవసరం నిమిత్తం మండల ప్రజలు ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తేం మూడు బస్సులు ఎక్కాల్సిన దుస్థితి. రోజంతా వృథాకానుంది. అధికారుల ప్రతిపాదనపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్‌కు అభ్యంతరాలు చెప్పనున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ స్పందించి కౌడిపల్లి మండలాన్ని మెదక్‌లోనే కలపాలని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ఉద్యమం చేసేందుకు వివిధ పార్టీలతో పాటు ప్రజలు సన్నద్ధమవుతున్నారు.
దూరం భారం
మండలాన్ని మెదక్ రెవెన్యూ డివిజన్‌లో కాకుండా తూప్రాన్‌లో కలపడం సరైంది కాదు. ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉన్న మెదక్‌ను కాకుండా తూప్రాన్‌లో కలపడంతో దూర భారం పెరుగుతుంది. ప్రజల సౌకర్యం కోసం మెదక్‌లోనే కొనసాగించాలి. - నదరి విఠల్, గౌతాపూర్ యువజన సంఘం నాయకుడు
అనాలోచిత నిర్ణయం
ప్రభుత్వం, అధికారులు అనాలోచిత నిర్ణయంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి. రాజకీయ దురుద్దేశంతో దగ్గరగా ఉన్న మెదక్‌ను కాదని తూప్రాన్‌లో కలపడం సరైంది కాదు. ఎమ్మెల్యే స్పందించి సమస్యను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలి. - ఎంసీ విఠల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు
సమస్యలను సృష్టించడమే
కౌడిపల్లి మండలాన్ని మెదక్‌లో కాకుండా తూప్రాన్‌లో కలపడం ప్రజలకు కొత్త సమస్యలు సృష్టించడమే అవుతుంది. అధికారులు పునరాలోచించాలి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇప్పటికే ఫిర్యాదు చేశాం. యథావిధగా ఉంచాలని మనవి. - సార రామాగౌడ్, మాజీ జెడ్పీటీసీ
ఎమ్మెల్యే దృష్టికి..
మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న తూప్రాన్ రెవెన్యూ డివిజన్‌లో కలుపుతూ ప్రభుత్వం డ్రాప్ట్ విడుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశాం. సమస్యను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు కృషి చేస్తాం. - చిలుముల పద్మ నరసింహారెడ్డి, ఎంపీపీ