‘డిజిటల్’ మోసం
‘డిజిటల్’ మోసం
Published Tue, Dec 13 2016 8:15 PM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM
గుండేపల్లి (నల్లజర్ల) : హలో.. మేం బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ బ్యాంక్ ఖాతా పిన్ నంబరులో తేడా వచ్చింది. ఖాతా ఓపెన్ కావడం లేదు. కాస్త చెబుతారా అంటూ నల్లజర్ల మండలం గుండేపల్లికి చెందిన ఉన్నమట్ల దుర్గాలక్ష్మికి ఆదివారం ఓ వ్యక్తి ఫోన్ చేశారు. దీంతో ఆమె తన భర్త వేణుగోపాలరావుకు ఫోన్ ఇచ్చారు. ఆయన విషయం తెలుసుకోకుండానే వివరాలన్నీ అవతలి వ్యక్తికి చెప్పేశాడు. ఆనక మళ్లీ ఫోన్ చేసి ఓటీపీ అడిగి తెలుసుకున్నాడు. అదే రోజు రాత్రి నుంచి ఆయన ఫోన్‌కు మెసెజ్‌లు రావడం ప్రారంభించాయి. రాత్రి చూసుకోలేదు. సోమవారం ఉదయం చూసేసరికి దుర్గాలక్ష్మి ఖాతాలో ఉండాల్సిన రూ.లక్షా 90వేలలో రూ.82వేల 500 విత్‌డ్రా చేసినట్టు ఉంది. ఏటీఎం కార్డు పంజాబ్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న ఆయన కుమారుడు నాగశివ వద్ద ఉంది. అతనుగానీ కళాశాల ఫీజుల నిమిత్తం తీశాడేమోనని వేణుగోపాలరావు దంపతులు అనుకున్నారు. పలుమార్లు అతనికి ఫోన్ చేశారు. అతను పరీక్ష హాలులో ఉండడంతో సాయంత్రానికి గానీ తీయలేదు. సాయంత్రం అతనికి విషయం చెప్పడంతో ఈసైబర్ నేరం బయటపడింది. వెంటనే అనంతపల్లి ఆంధ్రాబ్యాంకు మేనేజరు శివాజీతో మాట్లాడి అప్పటికప్పుడు ఖాతా లావాదేవీలు నిలుపుదల చేయించారు. లావాదేవీల వివరాలను పరిశీలిస్తే.. మొత్తం 11 సార్లు ఆ ఓటీపీ నంబరుతో రూ.82వేల 500 వినియోగించినట్టు ఉంది. ఈ సొమ్ము వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్టుగా ఉంది. దీనిపై బాధితుడు అనంతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Advertisement