హైటెక్ మోసం
ఫోన్ తో సమాచారం తెలుసుకుని ఖాతాదారుని అకౌంట్ నుంచి రూ.94,990నగదును అపహరించిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా పాన్‌గల్ మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది.టైర్ పంక్ఛర్ చేస్తూ జీవనం సాగిస్తున్నా సయ్యద్ మహబూబ్ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 3న 9135310570 నెంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తాము ముంబాయికి చెందిన ఎస్‌బిహెచ్ హెడ్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నామని మీ ఏటీఎం కార్డు బ్లాక్ అవుతుందని నమ్మబలికాడు.
కార్డు బ్లాక్ కాకుండా ఉండేందుకు ఏటీఎంపై ఉన్న 16 అంకెల సంఖ్యను చెప్పాలని అడిగాడు. నంబర్ సహాయంతో సదరు వ్యక్తి ఖతాదారుని ఆధార్ నంబర్, పూర్తి చిరునామా చెప్పాడు. తర్వాత ఫోన్ కు సమాచారం వస్తుందని.. అందులో ఉండే అంకెలను చెప్పాలని సూచించాడు. అగంతకుని మాటలు నమ్మిన సయ్యద్ తన ఫోన్ కు వచ్చిన నంబర్ చెప్పాడు.
మరుసటి రోజు సైతం ఇదే విధంగా ఫోన్ చేసి సమాచారం తెలుసుకుని డబ్బులు డ్రా చేశాడు. మూడో సారి కూడా ఫోన్ రావడంతో అనుమానించి.. బ్యాంక్ కు వెళ్లి వాకబు చేయగా..రూ. 50 వేలు, రూ. 44, 990 డ్రా చేసినట్లు తెలిసింది. దీంతో కార్డు బ్లాక్ చేయించడంతో పాటు.. విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్బంగా బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలు, ఏటీఎంలకు సంబంధించిన వివరాలను ఎవరు అడిగినా చెప్పవద్దని సూచించారు. ఖాతాకు సంబంధించి ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే బ్యాంకులో సంప్రదించాలని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.