cash draw
-
నోట్ల వేట
సిరిసిల్ల : కొత్త సంవత్సరంలోనూ జనాలకు నోట్ల తిప్పలు తప్పలేదు. ఆదివారం బ్యాంకులకు సెలవ కావడంతో నగదు కోసం ఖాతాదారులకు ఏటీఎంలు తప్ప మరో మార్గం లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలో 16 ఏటీఎంలు ఉండగా.. ఎస్బీహెచ్, గాయత్రీ బ్యాంకుల ఏటీఎం మాత్రమే పని చేశాయి. మిగతా వాటి ఎదుట ‘నో క్యాష్’ బోర్డులు తగిలించారు. నెలమొదటి రోజు కావడంతో బ్యాలెన్స్ పరిశీలించేందుకు, నగదు డ్రా చేసుకునేందుకు ఖాతాదారులు ఏటీఎంల ఎదుట బారులు తీరా రు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల డబ్బులు ఖాతాల్లో పడడంతో వారు సైతం నగదు కోసం ఏటీఎంలను ఆశ్రయించారు. అయితే, ఆర్బీఐ తాజా నిర్ణయంతో పనిచేసే రెండు ఏటీఎంల నుంచి రూ.4500 విత్‌డ్రా చేసుకున్న ఖాతాదారులు కాస్త ఊపిరి తీల్చుకున్నారు. మొన్నటి వరకు రోజుకు రూ.2000, ఆ తర్వాత రూ.2,500 తీసుకునే వెసులుబాటు ఉండేది. తాజాగా రూ.4,500 తీసుకున్నారు. ఇందులో రూ.రెండువేల నోట్లు రెండు, ఐదు వం దల నోట్లు అందాయి. కొత్త సంవత్సరం వేళ సిరిసిల్లలో పాత సమస్యనే జనాన్ని వెంటాడింది. అన్ని బ్యాంకులు ఏటీఎంల్లో డబ్బులను అందుబాటులో ఉంచితే.. బ్యాంకుల్లో జనం రద్దీ తగ్గే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు కోరుతున్నారు. నేటి నుంచి రద్దీ.. ఉద్యోగులకు సోమవారం వేతనాలు తమ బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. దీంతో వేతనాలు డ్రా చేసుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంలలో రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీనిని అధిగమిం చేందుకు బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలి ఉంది. -
‘డిజిటల్’ మోసం
గుండేపల్లి (నల్లజర్ల) : హలో.. మేం బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ బ్యాంక్ ఖాతా పిన్ నంబరులో తేడా వచ్చింది. ఖాతా ఓపెన్ కావడం లేదు. కాస్త చెబుతారా అంటూ నల్లజర్ల మండలం గుండేపల్లికి చెందిన ఉన్నమట్ల దుర్గాలక్ష్మికి ఆదివారం ఓ వ్యక్తి ఫోన్ చేశారు. దీంతో ఆమె తన భర్త వేణుగోపాలరావుకు ఫోన్ ఇచ్చారు. ఆయన విషయం తెలుసుకోకుండానే వివరాలన్నీ అవతలి వ్యక్తికి చెప్పేశాడు. ఆనక మళ్లీ ఫోన్ చేసి ఓటీపీ అడిగి తెలుసుకున్నాడు. అదే రోజు రాత్రి నుంచి ఆయన ఫోన్‌కు మెసెజ్‌లు రావడం ప్రారంభించాయి. రాత్రి చూసుకోలేదు. సోమవారం ఉదయం చూసేసరికి దుర్గాలక్ష్మి ఖాతాలో ఉండాల్సిన రూ.లక్షా 90వేలలో రూ.82వేల 500 విత్‌డ్రా చేసినట్టు ఉంది. ఏటీఎం కార్డు పంజాబ్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న ఆయన కుమారుడు నాగశివ వద్ద ఉంది. అతనుగానీ కళాశాల ఫీజుల నిమిత్తం తీశాడేమోనని వేణుగోపాలరావు దంపతులు అనుకున్నారు. పలుమార్లు అతనికి ఫోన్ చేశారు. అతను పరీక్ష హాలులో ఉండడంతో సాయంత్రానికి గానీ తీయలేదు. సాయంత్రం అతనికి విషయం చెప్పడంతో ఈసైబర్ నేరం బయటపడింది. వెంటనే అనంతపల్లి ఆంధ్రాబ్యాంకు మేనేజరు శివాజీతో మాట్లాడి అప్పటికప్పుడు ఖాతా లావాదేవీలు నిలుపుదల చేయించారు. లావాదేవీల వివరాలను పరిశీలిస్తే.. మొత్తం 11 సార్లు ఆ ఓటీపీ నంబరుతో రూ.82వేల 500 వినియోగించినట్టు ఉంది. ఈ సొమ్ము వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్టుగా ఉంది. దీనిపై బాధితుడు అనంతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఎస్బీఐ మొబైల్ ఏటీఎంలు ప్రారంభం
నగరంలోని పలు బస్తీలకు ఏటీఎం వాహనాలు గన్‌ఫౌండ్రీ: ఎస్బీఐ ఖాతాదారులకు నగదు డ్రా చేసుకునేందుకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో మొబైల్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ హర్దయాళ్ ప్రసాద్ తెలిపారు. బుధవారం కోఠిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో మొబైల్ పాస్ మిషన్ కలిగిన పది వాహనాలను ఆయన జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ వాహనాలు నగరంలోని బస్తీలు, కాలనీలలో సంచరిస్తాయని పేర్కొన్నారు. ఖాతాదారులు తమ ఏటీఎం కార్డుతో రూ.2500 డ్రా చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతానికి ఈ సేవలను బ్యాంకింగ్ సమయంలో కల్పిస్తున్నామని, ప్రజల ఆదరణ, వినియోగాన్ని బట్టి భవిష్యత్‌లో సేవలను విసృ్తత పరిచేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ జనరల్ మేనేజర్లు వి.వి.భయ్యా, గిరిధర్ కినీలతో పాటు పలువురు ఏజీఎంలు, బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఖాతాదారులకు సిరా చుక్క... రద్దు చేసిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు కల్పించిన వెసులుబాటు దుర్వినియోగం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బుధవారం నుంచి ఎస్బీఐ ఖాతాదారులకు సిరా చుక్కను ఎడమ చేతివేలుకు పెట్టి నగదును అందజేశారు. పదే పదే నోట్ల మార్పిడికై వస్తున్న నకిలీ వ్యక్తులను ఈ విధానంతో అరికట్టే అవకాశం ఉంటుంది. దీంతో నిజమైన ఖాతాదారులకు త్వరితగతిన నోట్ల మార్పిడి(చిల్లర) జరిగే అవకాశం ఉంది. -
హైటెక్ మోసం
ఫోన్ తో సమాచారం తెలుసుకుని ఖాతాదారుని అకౌంట్ నుంచి రూ.94,990నగదును అపహరించిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా పాన్‌గల్ మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది.టైర్ పంక్ఛర్ చేస్తూ జీవనం సాగిస్తున్నా సయ్యద్ మహబూబ్ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 3న 9135310570 నెంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తాము ముంబాయికి చెందిన ఎస్‌బిహెచ్ హెడ్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నామని మీ ఏటీఎం కార్డు బ్లాక్ అవుతుందని నమ్మబలికాడు. కార్డు బ్లాక్ కాకుండా ఉండేందుకు ఏటీఎంపై ఉన్న 16 అంకెల సంఖ్యను చెప్పాలని అడిగాడు. నంబర్ సహాయంతో సదరు వ్యక్తి ఖతాదారుని ఆధార్ నంబర్, పూర్తి చిరునామా చెప్పాడు. తర్వాత ఫోన్ కు సమాచారం వస్తుందని.. అందులో ఉండే అంకెలను చెప్పాలని సూచించాడు. అగంతకుని మాటలు నమ్మిన సయ్యద్ తన ఫోన్ కు వచ్చిన నంబర్ చెప్పాడు. మరుసటి రోజు సైతం ఇదే విధంగా ఫోన్ చేసి సమాచారం తెలుసుకుని డబ్బులు డ్రా చేశాడు. మూడో సారి కూడా ఫోన్ రావడంతో అనుమానించి.. బ్యాంక్ కు వెళ్లి వాకబు చేయగా..రూ. 50 వేలు, రూ. 44, 990 డ్రా చేసినట్లు తెలిసింది. దీంతో కార్డు బ్లాక్ చేయించడంతో పాటు.. విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్బంగా బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలు, ఏటీఎంలకు సంబంధించిన వివరాలను ఎవరు అడిగినా చెప్పవద్దని సూచించారు. ఖాతాకు సంబంధించి ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే బ్యాంకులో సంప్రదించాలని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
200 డ్రా చేస్తే 24 లక్షలు వచ్చాయి
హైదరాబాద్: లక్షల రూపాయిలు చేతి దాకా వచ్చినా ఆ డబ్బు తమది కాదంటూ పోలీసులకు అప్పగించారు ముగ్గురు యువకులు. ఉద్యోగ వేటలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా నిజాయితీతో పలువురికి ఆదర్శంగా నిలిచారు. నగరంలోని ఎస్ఆర్నగర్లో ఓ హాస్టల్లో ఉంటున్న లతీఫ్, హరిప్రసాద్, శివ దుర్గాప్రసాద్‌లు శుక్రవారం రాత్రి డబ్బులు డ్రా చేసేందుకు సమీపంలోని ఎస్బీహెచ్ ఏటీఎంకు వెళ్లారు. లతీఫ్ తన కార్డు నుంచి రూ. 200 డ్రా చేసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా డబ్బుల ప్రవాహం పోటెత్తింది. క్యాష్డోర్ ఆటోమెటిక్‌గా తెరుచుకొని రూ. 24 లక్షలు బయటకొచ్చాయి. ఇది చూసి అవాక్కైన ఆ ముగ్గురూ వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చేంత వరకు ఏటీఎం వద్దే డబ్బులకు కాపలా ఉన్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఏటీఎంలో డబ్బులు పెట్టిన అధికారులు క్యాష్ డోర్‌కు లాక్ వేయడం మరిచిపోయినట్లు గుర్తించారు. యువకులు సమాచారం ఇవ్వడం వల్లే లక్షల రూపాయలు కాపాడగలిగామని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని నగర కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి విద్యార్థులకు అవార్డులు ఇప్పిస్తామన్నారు. నిరుద్యోగంలోనూ నిజాయితీగా .. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడే నికి చెందిన లతీఫ్ (22), మహబూబ్‌నగర్‌కు చెందిన హరిప్రసాద్ బీటెక్ గ్రాడ్యుయేట్లు. ఇక శివ దుర్గాప్రసాద్ సీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ముగ్గురూ ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా ఎస్ఆర్నగర్లోని ఓ హాస్టల్లో ఉంటున్నారు. అక్కడే స్నేహితులయ్యారు. లతీఫ్, హరిప్రసాద్‌ల తండ్రులిద్దరూ టీచర్లు. శివ దుర్గాప్రసాద్ కుటుంబం మహబూబ్‌నగర్‌లో చిన్న హోటల్ నిర్వహిస్తోంది. తల్లిదండ్రులకు అండగా ఉండాలనే తపనతో ఈ ముగ్గురు చదువుకుంటూనే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఏటీఎం సెంటర్లో లక్షల రూపాయలు కనిపించి, తీసుకునేందుకు అవకాశాలున్నా నిజాయతీతో మెలిగారు. తాము చేసిన పనికి పోలీసులు, స్థానికులు అభినందిస్తుంటే అదే కోట్ల రూపాయలు సంపాదించినంత ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు.