ఎస్‌బీఐ మొబైల్ ఏటీఎంలు ప్రారంభం
నగరంలోని పలు బస్తీలకు ఏటీఎం వాహనాలు
గన్‌ఫౌండ్రీ: ఎస్‌బీఐ ఖాతాదారులకు నగదు డ్రా చేసుకునేందుకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో మొబైల్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ హర్‌దయాళ్ ప్రసాద్ తెలిపారు. బుధవారం కోఠిలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలో మొబైల్ పాస్ మిషన్ కలిగిన పది వాహనాలను ఆయన జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ వాహనాలు నగరంలోని బస్తీలు, కాలనీలలో సంచరిస్తాయని పేర్కొన్నారు. ఖాతాదారులు తమ ఏటీఎం కార్డుతో రూ.2500 డ్రా చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతానికి ఈ సేవలను బ్యాంకింగ్ సమయంలో కల్పిస్తున్నామని, ప్రజల ఆదరణ, వినియోగాన్ని బట్టి భవిష్యత్‌లో సేవలను విసృ్తత పరిచేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ జనరల్ మేనేజర్‌లు వి.వి.భయ్యా, గిరిధర్ కినీలతో పాటు పలువురు ఏజీఎంలు, బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఖాతాదారులకు సిరా చుక్క...
రద్దు చేసిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు కల్పించిన వెసులుబాటు దుర్వినియోగం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బుధవారం నుంచి ఎస్‌బీఐ ఖాతాదారులకు సిరా చుక్కను ఎడమ చేతివేలుకు పెట్టి నగదును అందజేశారు. పదే పదే నోట్ల మార్పిడికై వస్తున్న నకిలీ వ్యక్తులను ఈ విధానంతో అరికట్టే అవకాశం ఉంటుంది. దీంతో నిజమైన ఖాతాదారులకు త్వరితగతిన నోట్ల మార్పిడి(చిల్లర) జరిగే అవకాశం ఉంది.