Mobile ATMs
-
కరోనా టెర్రర్: హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం
ముంబై: కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్ల సౌకర్యార్థం ప్రైవేటు రంగ బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొబైల్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్‌ను (ఏటీఎం) రంగంలోకి దింపింది. హైదరాబాద్‌సహా 19 నగరాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో మొబైల్ ఏటీఎం ప్రతిరోజు మూడు నాలుగు ప్రాంతాలను కవర్ చేస్తుంది. వీటి ద్వారా 15 రకాల లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు. వినియోగదార్లు నగదు స్వీకరణకు తమ ప్రాంతం దాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ సౌకర్యం కల్పించినట్టు బ్యాంకు తెలిపింది. ఉద్యోగులు, కస్టమర్ల భద్రత కోసం సామాజిక దూరం, శానిటైజేషన్ ఏర్పాట్లు ఉన్నాయని వివ రించింది. గతేడాది లాక్డౌన్ సమయంలో 50 నగరాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు చెందిన మొబైల్ ఏటీఎంలను లక్షలాది మంది వినియోగించుకున్నారు -
‘ఆర్థిక ప్రోత్సాహానికి మొబైల్ ఏటీఎంలు’
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతను ప్రొత్సహించేందుకు నాబార్డు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఫండ్ (ఎఫ్ఐఎఫ్) ద్వారా మొబైల్ ఏటీఎం వ్యాన్లు కొనుగోలు చేశామని టీస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టీఎస్ఎస్సీఏబీ) ఉన్నతాధికారులు వ్యాన్ల తాళాలను డీసీసీబీల ముఖ్య కార్యనిర్వహణ అధికారులకు అందజేశారు. ఈ వ్యాన్లు హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో సంచరిస్తాయన్నారు. సమావేశంలో నాబార్డ్ సీజీఎం రాధాకృష్ణ, టీస్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్, టీ స్కాబ్ సీబీఎం జ్యోతి పాల్గొన్నారు. -
అమ్మో... ఒకటో తారీఖు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇదొక్క చోటే కాదు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎంలో సేవలు నాలుగు రోజులకే పరిమితమయ్యాయి. జిల్లా కేంద్రంలోనే వీటి పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో నగదు సమస్యను ఊహించుకోవచ్చు. ఈ నెల 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేసింది మొదలు ఇప్పటివరకూ ప్రత్యామ్నాయ ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పకతప్పదు. ఇకపై ఈ నగదు కష్టాలు ప్రజలకు రెట్టింపు కానున్నాయి. ఒకటో తేదీ వచ్చేసింది... ఇక జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరాల్సిన పరిస్థితి. మరోవైపు జిల్లాలోని అన్ని బ్యాంకుల్లోనూ నగదు కొరత తీరలేదు. రూ.500, రూ.100 డినామినేషన్ నోట్లు తొలివిడతలో రూ.150 కోట్లు నగదు వస్తుందని జిల్లా ఉన్నతాధికారులు పది రోజులుగా చెబుతున్నా ఒక్క నోట్ల కట్ట కూడా జిల్లాకు రాలేదు. కొన్నిచోట్ల ఎస్బీఐ ఏటీఎంలు పనిచేస్తున్నా రూ.2000 నోట్లు తప్ప మరో నోటు కనిపించట్లేదు. ఇవి చేతికొచ్చినా చిల్లర నోట్లు లేక అవసరానికి అక్కరకురాని పరిస్థితి. ఇక పింఛనుదారులకూ కష్టాలు తప్పేట్లు లేవు. నగదురహిత లావాదేవీలు సాధ్యమేనా? రేషన్ మొదలుకొని పింఛను వరకూ, కూరగాయలు మొదలు కిరాణా వరకూ, చిల్లర కొట్టు నుంచి సూపర్ మార్కెట్ల వరకూ... ఇలా ప్రతి లావాదేవీని నగదు రహితంగా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అందుకనుగుణంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను అధికారులు ముమ్మరం చేశారు. అంతవరకూ బాగానే ఉన్నా నగదు లావాదేవీలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఆర్థిక లావాదేవీలు సక్రమంగా సాగాలంటే కనీసం 5 వేల స్వైప్ మిషన్లు అవసరం ఉంటుందని అధికారులే అంచనా వేస్తున్నారు. కానీ ప్రస్తుతం వినియోగంలో ఉన్నవి ఆరొందలకు మించవు. అవీ పెద్ద నోట్ల రద్దు ప్రకటనకు ముందు వచ్చినవే. ఇటీవల 150 వరకూ వచ్చినా అవి సరిగా పనిచేయట్లేదు. కాగితం మీదే వేతనం... జిల్లాలో టీచర్లు 17 వేల మంది వరకూ ఉన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు ఎనిమిది వేల మంది ఉన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు 20 వేల మంది వరకూ ఉన్నారు. చిరుద్యోగులు మరో ఐదు వేల మంది ఉన్నారు. వీరందరికీ బ్యాంకు ఖాతాల ద్వారానే జీతాలు, వేతనాల చెల్లింపు జరుగుతోంది. వీరందరూ నెల ప్రారంభ వారంలోనే ఏటీఎంలు, బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేయడం అలవాటు. అందుకే ఆ వారం రోజులు జిల్లాలోని ఏటీఎంలన్నీ కిటకిటలాడేవి. ఈనెల 8వ తేదీన పెద్ద నోట్ల రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొనేటప్పటికే వారిలో చాలామంది నగదు విత్‌డ్రా చేశారు. అప్పటికే వివిధ చెల్లింపులకు నగదు పోను మిగిలిన రూ.1000, రూ.500 నోట్లు తమ ఖాతాల్లో జమ చేసుకున్నారు. కొంతమంది మార్పిడి చేసుకున్నారు. అయితే ఈసారి జీతాలు ఆన్లైన్లోనే చెల్లింపు ఉంటుందని ఆర్థిక శాఖ ప్రకటించింది. అంటే ఒకటో తేదీన కాగితం (ఖాతాలో) మీద జీతం పడినట్లు కనిపిస్తున్నా చేతికి నగదు చెల్లింపులు ఉండవు. ఒకవైపు నగదు చేతిరాకపోగా, చెల్లింపు అవసరాలకు తగినట్లు స్వైప్ మిషన్లు లేవు. దీంతో 1వ తేదీ నుంచి ఏటీఎంలు, బ్యాంకుల ముందు బారులు తీరినా నగదు చేతికొస్తుందో లేదోనని అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయి. పెద్ద నోట్లు ‘పని’కి రావట్లేదు:బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఎక్కువగా రూ.2000 నోట్లే ఇస్తున్నారు. అక్కడక్కడా రూ.100 నోట్లు ఇస్తున్నా అవన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోతున్నాయి. మిగతా రూ.50, రూ.20 నోట్లు పరిస్థితీ అంతే. చిల్లర లభ్యత పూర్తిగా తగ్గిపోవడంతో జిల్లాలో వ్యాపారాల పరిస్థితి రోజురోజుకు దీనావస్థకు చేరుతోంది. రూ.2000 నోట్లు తీసుకోవడానికి చిల్లర సమస్య కారణంగా వ్యాపారులు నిరాకరిస్తున్నారు. ఈ సమస్య దృష్ట్యా ఎవ్వరికివారు రూ.100, రూ.50 నోట్లను తమవద్దే ఉంచేసుకుంటున్నారు. పింఛనుదారులకు ఇక్కట్లే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులు జిల్లాలో 14వేల మంది ఉన్నారు. వారందరికీ 1వ తేదీనే బ్యాంకు ఖాతాల్లో పింఛను పడుతోంది. నిత్యావసర సరుకులు, మందులు, ఆసుపత్రికి వెళ్లడానికి ఈ డబ్బే ఎక్కువ మందికి ఆధారం. వారిపై ఆధారపడినవారూ కుటుంబాల్లో ఉంటారు. ఇప్పుడు పింఛను నగదు చేతికొచ్చే అవకాశం లేకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కోనున్నారు. -
పునరుద్ధరుణం దిశగా..
జంగారెడ్డిగూడెం : పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో 15 రోజులపాటు పరిమితులకు లోబడి నగదు మార్పిడి, పాతనోట్ల డిపాజిట్లకు మాత్రమే పరిమితమైన బ్యాంకులు.. ఇకపై సాధారణ సేవలపైనా దృష్టి సారించబోతున్నాయి. రోజువారీ నిర్వహించే అన్నిరకాల లావాదేవీలను పునరుద్ధరించాలని బ్యాంకు లకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీంతో జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో గురువారం నుంచి సాధారణ సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పాత నోట్లను నేరుగా బ్యాంకుల్లో ఇచ్చి చిల్లర నోట్లు తీసుకునే కార్యక్రమానికి శుక్రవారం నుంచి ఫుల్స్టాప్ పడుతోంది. ఎవరి వద్దనైనా పాతనోట్లు ఉంటే.. శుక్రవారం నుంచి వారి అకౌంట్లలో జమ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల నోట్లకోసం వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ దృష్ట్యా గురువారం నుంచి పంట రుణాలు, బంగారాన్ని కుదువపెట్టుకుని ఇచ్చే రుణాలతోపాటు ఇతర కార్యాకలాపాలను యథావిధిగా చేపట్టనున్నారు. రుణాల వసూళ్లు, మొండి బకాయిల రికవరీ వంటి కార్యకలాపాలు సైతం మొదలు పెట్టాలని బ్యాంకులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. రుణాల మంజూరుకు ప్రత్యేక ఏర్పాట్లు బ్యాంకుల్లో 15 రోజులపాటు నిలిచిపోయిన రోజువారీ విధుల పునరుద్ధరణతో రుణాల మంజూరు, బకాయిల వసూళ్లపై బ్యాంకులు దృష్టి సారిస్తున్నాయి. రబీ సీజన్ కు సంబంధించి రైతులకు పంట రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రుణం పొందిన రైతులు వారానికి రూ.50 వేల వరకు ఖాతా నుంచి విత్ డ్రా చేసుకోవచ్చని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. వ్యక్తుల ఖాతాలో ఉన్న నగదును డ్రా చేసుకునేందుకు వారానికి రూ.24వేలు పరిమితి అలానే ఉంది. ప్రజల చెంతకు మొబైల్ ఏటీఎంలు చిల్లర నోట్ల కొరతను తీర్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. మొబైల్ ఏటీఎంలను రంగంలోకి దింపింది. జిల్లాలో పలుచోట్ల మొబైల్ ఏటీఎంలు ప్రజల ముంగిటకు వెళ్లాయి. బ్యాంక్ సిబ్బంది వాహనాల్లో నగదు తీసుకెళ్లి క్యాష్ యాక్ట్ పోస్ మెషిన్ల ద్వారా ఖాతాదారులకు సొమ్ము పంపిణీ చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డు కలిగిన వారంతా రూ.2000 తీసుకునే అవకాశాన్ని కల్పించారు. వీటిద్వారా పూర్తిగా రూ.100 నోట్లు ఇస్తున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా సేవలందిస్తాం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలందించేందుకు ఏర్పాట్లు చేశాం. బంగారంపై రుణాలతోపాటు రబీకి సంబంధించి పంట రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటర్లు తెరిచాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోజువారీ సాధారణ సేవలను పునరుద్ధరించాం. బ్యాంకుల్లో చాలావరకు రద్దీ తగ్గింది. అన్ని ఏటీఎంలను పునరుద్ధరించాం. ఇకపై మా బ్యాంకులో అన్ని రకాల సేవలు పొందవచ్చు. – కె.త్రినాథరావు, చీఫ్ మేనేజర్, ఆంధ్రాబ్యాంక్, జంగారెడ్డిగూడెం -
నగదు కోసం అదే అవస్థ..అదే ఆవేదన
-
అదే అవస్థ.. అదే ఆవేదన
నగదు కోసం జనం పాట్లు ♦ బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల కొద్దీ పడిగాపులు ♦ పొద్దున 7 గంటల నుంచే క్యూలైన్లు.. ఏటీఎంలలో నగదు కొరత ♦ ఇంకా రాని కొత్త రూ.500 నోట్లు.. పలుచోట్ల రూ.2,000 వరకే మార్పిడి ♦ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన మొబైల్ ఏటీఎంలు సాక్షి నెట్వర్క్: వారంరోజులుగా అవే బాధలు.. అవే ఆవేదనలు.. మరింతగా పెరుగుతున్న అవస్థలు.. రాత్రి లేదు, పగలు లేదు ఎప్పుడు చూసినా జనమంతా బ్యాంకులు, ఏటీఎంల వద్దే గడుపుతున్నారు.. హైదరాబాద్‌లో అయితే అర్ధరాత్రి 2 గంటలకు చూసినా ఏటీఎంల వద్ద క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఎస్బీఐ ఆధ్వర్యంలో అబిడ్స్, సికింద్రాబాద్‌లలో మొబైల్ ఏటీఎంలను ప్రారంభించినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. పరిమితంగా ఏర్పాటు చేసిన మొబైల్ కేంద్రాలు ప్రజలకు పెద్దగా ఊరటనివ్వలేకపోయాయి. మరోవైపు వారం గడిచినా కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో రూ.2000 నోట్లతో చిల్లర కోసం బాధలు తప్పడం లేదు. కొన్ని చోట్ల ఏటీఎంలలో డబ్బు నింపిన కొద్దిసేపటికే ఖాళీ అవుతున్నాయి. దీంతో అప్పటివరకు గంటల తరబడి క్యూలలో పడిగాపులు కాసిన జనం నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఇక చిల్లర కొరత కారణంగా అన్ని రకాల వ్యాపార లావాదేవీలు బాగా తగ్గిపోయాయి. తెల్లవారగానే.. రద్దీ బాగా ఉంటుండడంతో బుధవారం చాలా చోట్ల జనం ఉదయం 7 గంటల వరకే బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, కోఠి, అబిడ్స్, దిల్సుఖ్నగర్, కేపీహెచ్‌బీ, అంబర్పేట్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ తదితర అన్ని చోట్లా చాంతాడంత క్యూలైన్లు దర్శనమిచ్చాయి. వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నోట్ల మార్పిడి పరిమితిని రూ.4,000 నుంచి రూ.4,500కు పెంచినట్లు ప్రకటించినప్పటికీ.. ఇంకా కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో బ్యాంకుల్లో రూ.2వేలు మాత్రమే మార్పడి చేశారు. నోట్ల మార్పిడి కోసం వచ్చే వృద్ధులు, వికలాంగుల కోసం బ్యాంకులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా బుధవారం నోట్ల మార్పిడి కోసం నాంపల్లి సమీపంలోని మల్లేపల్లి ఎస్బీహెచ్ క్యూలైన్లలో ఉన్న జనానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అరటిపండ్లు, కూల్‌డ్రింక్స్ పంపిణీ చేశారు. ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా, వంద నోట్లను అందుబాటులోకి తేకుండా పెద్ద నోట్లు రద్దు చేయడం దారుణమని ఈ సందర్భంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్దెర మీద తెచ్చి పెళ్లి.. పెద్ద నోట్ల రద్దుతో శుభకార్యాలు జరుపుకొనే వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఖర్చులకు సరిపడా చిల్లర లేక దుకాణదారుల వద్ద అప్పులు పెట్టి, సామగ్రి తీసుకుంటున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గోపాల్‌నగర్‌కు చెందిన పస్తం ఉప్పలయ్య కుమార్తెకు కొద్ది రోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది. బుధవారం ఉదయం వివాహం జరిగింది. పెద్ద నోట్ల రద్దు కారణంగా పెళ్లికి కావాల్సిన సామగ్రి మొత్తం దుకాణదారులను బతిమాలి ఉద్దెరపై తెచ్చుకున్నారు. పెళ్లి పనులు ఉండడంతో బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడలేని పరిస్థితి మరి. తన పెళ్లి పెట్టుకున్న వారంలోనే నోట్ల రద్దు ప్రకటన రావడంతో తన తండ్రి చాలా ఇబ్బంది పడ్డారని, పెళ్లి ఎలా అవుతుందోనని చాలా ఆవేదన చెందాడని ఉప్పలయ్య కుమార్తె భారతి చెప్పారు. బాబ్బాబూ చిల్లరివ్వండి.. ఈ చిత్రం లో ఉన్నది వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం క్యాద్గిరాకు చెందిన రైతు సత్తయ్య. తాను సాగు చేస్తున్న కందిపంటకు పురుగుల మందు చల్లాలి. చేతిలో ఉన్నది నాలుగు పాత రూ.500 నోట్లు. ఎలాగోలా ఆ నోట్లు తెలిసిన వారికిచ్చి కొత్త రూ.2 వేల నోటు సంపాదించాడు. బుధవారం మండల కేంద్రానికి వెళ్లాడు. సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళితే చిల్లర లేదన్నారు. ఫెర్టిలైజర్ షాపు వద్దకు వెళ్లినా అదే సమాధానం. ఊరంతా తిరిగినా.. చిల్లర పుట్టలేదు. చివరికి ఫెర్టిలైజర్ షాపు దగ్గరికి వచ్చాడు. ‘రూ.2 వేల నోటు మీ దగ్గరే ఉంచుకుని పురుగుల మందు డబ్బాలు (రూ.800కు) ఇవ్వండి. చిల్లర వచ్చాక వచ్చి తీసుకెళ్తా.. ఖర్చులకు మాత్రం రూ.200 ఇవ్వండి..’ అని బతిమాలి పట్టుకెళ్లాడు. పురుగు చేరి పంట నాశనమవుతోంది.. ‘‘పొట్ట దశకు వచ్చిన వరి చేనుకు పురుగు సోకింది. పురుగుల మందు కొట్టాలంటే చేతిలో పైసలు లేవు. నా ఖాతాలో ఉన్న పైసల కోసం బ్యాంకుకు వచ్చిన. పొద్దున 8 గంటల నుంచి 11 గంటల దాకా లైన్ల నిలుచున్న. కానీ బ్యాంకు లోపలికి వెళ్తే పైసలు అయిపోయినయన్నరు. ఏం జేయాలో తెల్వడం లేదు..’’ – మాచెర్ల సమ్మయ్య, భూపాలపల్లి జిల్లా దేవరాంపల్లి దవాఖానా ఖర్చులకు కావాలె.. ‘‘నా మనవరాలు వర్షిణికి పదకొండు నెలలు. ఫిట్స్ వస్తున్నయి. ఇప్పటికే రెండు లక్షల దాక ఖర్చయినయి. ఇప్పుడు మళ్లీ దవాఖానాకు పోవాలె. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.17 వేలు తీసుకునేందుకు తిప్పలవుతోంది..’’ – పెగడ రాజవ్వ, పెద్దపల్లి జిల్లా చీకురాయి -
ఎస్బీఐ మొబైల్ ఏటీఎంలు ప్రారంభం
నగరంలోని పలు బస్తీలకు ఏటీఎం వాహనాలు గన్‌ఫౌండ్రీ: ఎస్బీఐ ఖాతాదారులకు నగదు డ్రా చేసుకునేందుకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో మొబైల్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ హర్దయాళ్ ప్రసాద్ తెలిపారు. బుధవారం కోఠిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో మొబైల్ పాస్ మిషన్ కలిగిన పది వాహనాలను ఆయన జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ వాహనాలు నగరంలోని బస్తీలు, కాలనీలలో సంచరిస్తాయని పేర్కొన్నారు. ఖాతాదారులు తమ ఏటీఎం కార్డుతో రూ.2500 డ్రా చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతానికి ఈ సేవలను బ్యాంకింగ్ సమయంలో కల్పిస్తున్నామని, ప్రజల ఆదరణ, వినియోగాన్ని బట్టి భవిష్యత్‌లో సేవలను విసృ్తత పరిచేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ జనరల్ మేనేజర్లు వి.వి.భయ్యా, గిరిధర్ కినీలతో పాటు పలువురు ఏజీఎంలు, బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఖాతాదారులకు సిరా చుక్క... రద్దు చేసిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు కల్పించిన వెసులుబాటు దుర్వినియోగం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బుధవారం నుంచి ఎస్బీఐ ఖాతాదారులకు సిరా చుక్కను ఎడమ చేతివేలుకు పెట్టి నగదును అందజేశారు. పదే పదే నోట్ల మార్పిడికై వస్తున్న నకిలీ వ్యక్తులను ఈ విధానంతో అరికట్టే అవకాశం ఉంటుంది. దీంతో నిజమైన ఖాతాదారులకు త్వరితగతిన నోట్ల మార్పిడి(చిల్లర) జరిగే అవకాశం ఉంది.