వారంరోజులుగా అవే బాధలు.. అవే ఆవేదనలు.. మరింతగా పెరుగుతున్న అవస్థలు.. రాత్రి లేదు, పగలు లేదు ఎప్పుడు చూసినా జనమంతా బ్యాంకులు, ఏటీఎంల వద్దే గడుపుతున్నారు.. హైదరాబాద్‌లో అయితే అర్ధరాత్రి 2 గంటలకు చూసినా ఏటీఎంల వద్ద క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఎస్‌బీఐ ఆధ్వర్యంలో అబిడ్స్, సికింద్రాబాద్‌లలో మొబైల్ ఏటీఎంలను ప్రారంభించినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. పరిమితంగా ఏర్పాటు చేసిన మొబైల్ కేంద్రాలు ప్రజలకు పెద్దగా ఊరటనివ్వలేకపోయాయి. మరోవైపు వారం గడిచినా కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో రూ.2000 నోట్లతో చిల్లర కోసం బాధలు తప్పడం లేదు. కొన్ని చోట్ల ఏటీఎంలలో డబ్బు నింపిన కొద్దిసేపటికే ఖాళీ అవుతున్నాయి. దీంతో అప్పటివరకు గంటల తరబడి క్యూలలో పడిగాపులు కాసిన జనం నిరాశగా వెనుదిరుగుతున్నారు.