
అదే అవస్థ.. అదే ఆవేదన
నగదు కోసం జనం పాట్లు
♦ బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల కొద్దీ పడిగాపులు
♦ పొద్దున 7 గంటల నుంచే క్యూలైన్లు.. ఏటీఎంలలో నగదు కొరత
♦ ఇంకా రాని కొత్త రూ.500 నోట్లు.. పలుచోట్ల రూ.2,000 వరకే మార్పిడి
♦ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన మొబైల్ ఏటీఎంలు
సాక్షి నెట్‌వర్క్: వారంరోజులుగా అవే బాధలు.. అవే ఆవేదనలు.. మరింతగా పెరుగుతున్న అవస్థలు.. రాత్రి లేదు, పగలు లేదు ఎప్పుడు చూసినా జనమంతా బ్యాంకులు, ఏటీఎంల వద్దే గడుపుతున్నారు.. హైదరాబాద్‌లో అయితే అర్ధరాత్రి 2 గంటలకు చూసినా ఏటీఎంల వద్ద క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఎస్‌బీఐ ఆధ్వర్యంలో అబిడ్స్, సికింద్రాబాద్‌లలో మొబైల్ ఏటీఎంలను ప్రారంభించినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. పరిమితంగా ఏర్పాటు చేసిన మొబైల్ కేంద్రాలు ప్రజలకు పెద్దగా ఊరటనివ్వలేకపోయాయి. మరోవైపు వారం గడిచినా కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో రూ.2000 నోట్లతో చిల్లర కోసం బాధలు తప్పడం లేదు. కొన్ని చోట్ల ఏటీఎంలలో డబ్బు నింపిన కొద్దిసేపటికే ఖాళీ అవుతున్నాయి. దీంతో అప్పటివరకు గంటల తరబడి క్యూలలో పడిగాపులు కాసిన జనం నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఇక చిల్లర కొరత కారణంగా అన్ని రకాల వ్యాపార లావాదేవీలు బాగా తగ్గిపోయాయి.
తెల్లవారగానే..
రద్దీ బాగా ఉంటుండడంతో బుధవారం చాలా చోట్ల జనం ఉదయం 7 గంటల వరకే బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, కోఠి, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, కేపీహెచ్‌బీ, అంబర్‌పేట్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ తదితర అన్ని చోట్లా చాంతాడంత క్యూలైన్లు దర్శనమిచ్చాయి. వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నోట్ల మార్పిడి పరిమితిని రూ.4,000 నుంచి రూ.4,500కు పెంచినట్లు ప్రకటించినప్పటికీ.. ఇంకా కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో బ్యాంకుల్లో రూ.2వేలు మాత్రమే మార్పడి చేశారు. నోట్ల మార్పిడి కోసం వచ్చే వృద్ధులు, వికలాంగుల కోసం బ్యాంకులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా బుధవారం నోట్ల మార్పిడి కోసం నాంపల్లి సమీపంలోని మల్లేపల్లి ఎస్‌బీహెచ్ క్యూలైన్లలో ఉన్న జనానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అరటిపండ్లు, కూల్‌డ్రింక్స్ పంపిణీ చేశారు. ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా, వంద నోట్లను అందుబాటులోకి తేకుండా పెద్ద నోట్లు రద్దు చేయడం దారుణమని ఈ సందర్భంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్దెర మీద తెచ్చి పెళ్లి..
పెద్ద నోట్ల రద్దుతో శుభకార్యాలు జరుపుకొనే వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఖర్చులకు సరిపడా చిల్లర లేక దుకాణదారుల వద్ద అప్పులు పెట్టి, సామగ్రి తీసుకుంటున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గోపాల్‌నగర్‌కు చెందిన పస్తం ఉప్పలయ్య కుమార్తెకు కొద్ది రోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది. బుధవారం ఉదయం వివాహం జరిగింది. పెద్ద నోట్ల రద్దు కారణంగా పెళ్లికి కావాల్సిన సామగ్రి మొత్తం దుకాణదారులను బతిమాలి ఉద్దెరపై తెచ్చుకున్నారు. పెళ్లి పనులు ఉండడంతో బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడలేని పరిస్థితి మరి. తన పెళ్లి పెట్టుకున్న వారంలోనే నోట్ల రద్దు ప్రకటన రావడంతో తన తండ్రి చాలా ఇబ్బంది పడ్డారని, పెళ్లి ఎలా అవుతుందోనని చాలా ఆవేదన చెందాడని ఉప్పలయ్య కుమార్తె భారతి చెప్పారు.
బాబ్బాబూ చిల్లరివ్వండి..
ఈ చిత్రం లో ఉన్నది వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం క్యాద్గిరాకు చెందిన రైతు సత్తయ్య. తాను సాగు చేస్తున్న కందిపంటకు పురుగుల మందు చల్లాలి. చేతిలో ఉన్నది నాలుగు పాత రూ.500 నోట్లు. ఎలాగోలా ఆ నోట్లు తెలిసిన వారికిచ్చి కొత్త రూ.2 వేల నోటు సంపాదించాడు. బుధవారం మండల కేంద్రానికి వెళ్లాడు. సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళితే చిల్లర లేదన్నారు. ఫెర్టిలైజర్ షాపు వద్దకు వెళ్లినా అదే సమాధానం. ఊరంతా తిరిగినా.. చిల్లర పుట్టలేదు. చివరికి ఫెర్టిలైజర్ షాపు దగ్గరికి వచ్చాడు. ‘రూ.2 వేల నోటు మీ దగ్గరే ఉంచుకుని పురుగుల మందు డబ్బాలు (రూ.800కు) ఇవ్వండి. చిల్లర వచ్చాక వచ్చి తీసుకెళ్తా.. ఖర్చులకు మాత్రం రూ.200 ఇవ్వండి..’ అని బతిమాలి పట్టుకెళ్లాడు.
పురుగు చేరి పంట నాశనమవుతోంది..
‘‘పొట్ట దశకు వచ్చిన వరి చేనుకు పురుగు సోకింది. పురుగుల మందు కొట్టాలంటే చేతిలో పైసలు లేవు. నా ఖాతాలో ఉన్న పైసల కోసం బ్యాంకుకు వచ్చిన. పొద్దున 8 గంటల నుంచి 11 గంటల దాకా లైన్ల నిలుచున్న. కానీ బ్యాంకు లోపలికి వెళ్తే పైసలు అయిపోయినయన్నరు. ఏం జేయాలో తెల్వడం లేదు..’’
– మాచెర్ల సమ్మయ్య, భూపాలపల్లి జిల్లా దేవరాంపల్లి
దవాఖానా ఖర్చులకు కావాలె..
‘‘నా మనవరాలు వర్షిణికి పదకొండు నెలలు. ఫిట్స్ వస్తున్నయి. ఇప్పటికే రెండు లక్షల దాక ఖర్చయినయి. ఇప్పుడు మళ్లీ దవాఖానాకు పోవాలె. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.17 వేలు తీసుకునేందుకు తిప్పలవుతోంది..’’
– పెగడ రాజవ్వ,
పెద్దపల్లి జిల్లా చీకురాయి