‘చిల్లర’ చంపేస్తోంది! | two dies as stays more time in que lines new currancy notes | Sakshi
Sakshi News home page

‘చిల్లర’ చంపేస్తోంది!

Published Wed, Nov 16 2016 2:47 AM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM

క్యూలైన్లోనే మృతిచెందిన లక్ష్మినారాయణ - Sakshi

క్యూలైన్లోనే మృతిచెందిన లక్ష్మినారాయణ

పెద్ద నోట్ల మార్పిడి ఆందోళనతో ఇద్దరు మృతి
♦ క్యూలైన్లలో నిలబడి గుండెపోటుతో మరణం
♦ నోట్లు చెల్లక.. వైద్యం అందక ఓ యువతి బలి
♦ రూ. 2,000 నోటుకు చిల్లర దొరకక ఆవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య
♦ నోట్లు మార్పించుకునేందుకు వెళుతూ ప్రమాదంలో మరణించిన ఆర్టీసీ మాజీ ఉద్యోగి  


సాక్షి నెట్‌వర్క్‌: ‘చిల్లర’ సమస్య ప్రాణాల మీదికి తెస్తోంది.. ‘నోట్ల’ ఆందోళన జీవితాలను బలిగొంటోంది.. నోట్ల రద్దు వ్యవహారం సామాన్యులను నరక యాతన పెడుతోంది.. బ్యాంకుల ముందు క్యూలలో నిల్చున్న ఇద్దరు రిటైర్డ్‌ ఉద్యోగులు గుండెపోటుతో మరణించగా... నోట్లు చెల్లక, వైద్యం అందక ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మరో ఘటనలో బ్యాంకులో ఇచ్చిన రూ.2,000 కొత్త నోటుకు చిల్లర దొరకక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఒక్కసారిగా కుప్పకూలి..
తమ వద్ద ఉన్న పాత పెద్ద నోట్లను డిపాజిట్‌ చేయడానికి... కొత్త నోట్లు, చిల్లర నోట్లు తీసుకోవడానికి బ్యాంకుల వద్దకు వచ్చిన లక్ష్మీనారాయణ (77), పోలంకి ఇన్నయ్య (70) అనే రిటైర్డ్‌ ఉద్యోగులు క్యూలైన్లోనే ప్రాణాలు వదిలారు. లక్ష్మీనారాయణ స్వస్థలం అనంతపురం జిల్లా. ఆయన పంచాయతీరాజ్‌ విభాగంలో పనిచేసి 22 ఏళ్ల కింద రిటైర్మెంట్‌ తీసుకున్నారు. కొంతకాలంగా లక్ష్మీనారాయణ వెస్ట్‌మారేడుపల్లి రైల్వే కాలనీ షరోన్ రెసిడెన్సీలో పెద్ద కుమార్తె సుధారాణి, అల్లుడు భగవత్‌లతో కలసి ఉంటున్నారు. ఇటీవలే పొద్దుటూరులోని మరో కుమార్తె ఇంటికి వెళ్లి సోమవారమే తిరిగి వచ్చారు. మంగళవారం ఉదయమే ఇక్కడి ఆంధ్రాబ్యాంకులో డబ్బులు డిపాజిట్‌ చేయడానికి అల్లుడు భగవత్‌తో కలసి వచ్చారు. లక్ష్మినారాయణ క్యూలైన్లో ఉండగా.. భగవత్‌ ఏదో పని మీద మరో చోటికు వెళ్లారు. అయితే లక్ష్మినారాయణ ఉదయం 10.30 గంటల సమయంలో ఆంధ్రాబ్యాంకు మెట్ల వద్ద క్యూలోనే గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఖాతాదారులు అక్కడే ఉన్న ఓ డాక్టర్‌ సహాయంతో ప్రథమ చికిత్స అందించారు. వెంటనే సమీపంలోని ఓ నర్సింగ్‌ హోమ్‌కు తీసుకెళ్లగా.. అప్పటికే లక్ష్మినారాయణ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇక పోలంకి ఇన్నయ్య ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొత్తపేటకు చెందినవారు. ఆయన ఫైర్‌ ఆఫీసర్‌గా పనిచేసి 2004లో రిటైరయ్యారు. నోట్ల రద్దు నేపథ్యంలో కొత్త నోట్లు, చిల్లర నోట్లు తీసుకునేందుకు మంగళవారం ఉదయం ఫిరంగిపురంలోని ఆంధ్రా బ్యాంకు వద్దకు వచ్చారు. క్యూలైన్లో నిలబడి ఉండగానే గుండెపోటుతో కుప్పకూలిపోయారు.

నోట్లు చెల్లక యువతి బలి
పాత పెద్ద నోట్లను ఆస్పత్రి నిర్వాహకులు తీసుకోకపోవడంతో.. సరైన సమయంలో వైద్యం అందక కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో ఓ యువతి మృతి చెందింది. ఇక్కడి సర్దార్‌బస్తీకి చెందిన నాగులపల్లి మల్లయ్య–సుగుణల కుమార్తె మౌనిక (18). ఆమె కొంతకాలంగా షుగర్‌ వ్యాధితో బాధపడుతోంది. ఆదివారం జ్వరంతోపాటు కడుపునొప్పి రావడంతో కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం సోమవారం కరీంనగర్‌లోని ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. మల్లయ్య పలువురి వద్ద బదులు అడిగి రూ.10 వేలు సేకరించారు. అవన్నీ రూ.500, రూ.1,000 పాత నోట్లుకావడంతో ఆస్పత్రిలో తీసుకోలేదు. దాంతో ఆ నోట్లను మార్చుకునేందుకు కాగజ్‌నగర్‌లో అంతటా తిరిగారు. సోమవారం బ్యాంకులకు సెలవుకావడంతో మార్పిడి కాలేదు. దీంతో సరైన సమయంలో పెద్దాస్పత్రికి బయలుదేరకపోవడంతో మౌనిక మరణించింది. పెద్ద నోట్ల సమస్య లేకుంటే తమ బిడ్డ బతికేదని మల్లయ్య–సుగుణ ఆవేదన వ్యక్తం చేశారు.

తాగడానికి చిల్లర దొరకలేదని..
మద్యానికి బానిసైన ఓ కూలీ.. తాగేందుకు రూ.2,000 నోటుకు చిల్లర దొరకలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏపీలోని గుంటూరు నగరం ఐపీడీ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఐపీడీ కాలనీలో నివాసముండే వి.శ్రీనివాసరావు (40), లక్ష్మి కూలీ పనులు చేస్తూ జీవిస్తుంటారు. వారికి ఇద్దరు కుమార్తెలు. శ్రీనివాసరావు కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. రెండు రోజుల కిందట పాత పెద్ద నోట్లు మార్పిడి చేసుకోగా.. బ్యాంకు అధికారులు రూ. 2,000 నోటు ఇచ్చారు. దానిని తీసుకుని మద్యం షాపునకు వెళ్లగా వారు చిల్లర లేదన్నారు. పలు చోట్ల చిల్లర కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ ఆగ్రహంతోనే ఇంటికి వచ్చి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆమె వద్ద ఉన్న చిల్లర నోట్లు ఇవ్వడంతో మంగళవారం ఉదయం కొంత మద్యం తాగాడు. మళ్లీ ఇంటికి వచ్చి మరిన్ని డబ్బులు కావాలన్నాడు. ఆమె లేవనడంతో ఉరి వేసుకుని చనిపోతానని బెదిరించాడు. దాంతో లక్ష్మి రూ.2,000 నోటు పట్టుకుని చిల్లర కోసం బయటకు వెళ్లింది. కానీ కొద్దిసేపటికే శ్రీనివాసరావు ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరివేసుకున్నాడు.

నోట్లు మార్పించుకునేందుకు వెళుతూ..
నిజామాబాద్‌ నగరంలోని కంఠేశ్వర్‌ సీఎస్‌ఐ చర్చి కాంపౌండ్‌ ప్రాంతానికి చెందిన అనంతరావు (69) ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పనిచేసి రిటైరయ్యారు. మంగళవారం పాత నోట్లను మార్చుకునేందుకు కంఠేశ్వర్‌లోని ఎస్‌బీఐకి స్కూటీపై బయలుదేరాడు. దారిలోనే ఇక్కడి టూటౌన్ పోలీస్‌స్టేషన్ చెందిన బొలెరో వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అనంతరావు తలకు తీవ్రగాయాలై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement