డిజిటల్ సేవలతో ఆక్వాలో సిరులు
డిజిటల్ సేవలతో ఆక్వాలో సిరులు
Published Tue, Apr 11 2017 7:08 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
భీమవరం: ఆక్వా రంగం మరింత అభివృద్ధి సాధించాల్సి ఉందని, ఇందుకు చైనా మాదిరిగా ఇక్కడి రైతులు డిజిటల్ సేవలు ఉపయోగించుకోవాలని కలెక్టర్ కె.భాస్కర్ అన్నారు. భీమవరంలో మంగళవారం ఏర్పాటుచేసిన మత్స్య రంగంలో ఏకీకృత డిజిటల్ సేవల ఏర్పాటుపై వర్క్‌షాపులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. డిజిటల్ సేవల వాడకం వల్ల ఐదు శాతం ఖర్చు పెరిగినా 25 శాతం వరకూ ఆదాయం పెరుగుతుందని చెప్పారు. డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మత్స్యశాఖ వద్ద నిధులు ఉన్నాయన్నారు. అధికారులు, ఆక్వా రైతులు దీనిపై ప్రత్యేక దృష్టిపెడితే సాగును లాభదాయకంగా చేసుకోవచ్చని చెప్పారు. ఆక్వా రైతులకు డిజిటల్ సేవలందించడానికి రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాను ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారన్నారు. డిజిటల్ సేవల ద్వారా చెరువుల తవ్వకాల నుంచి ధరల వరకూ రైతులు సులభంగా తెలుసుకోవచ్చన్నారు. దీనిలో భాగంగానే ప్రభుత్వం వెబ్‌పోర్టల్, యాప్‌లను రూపొందిస్తోందని చెప్పారు.
బీమా వర్తింపుతో లాభాలు..వరి మాదిరిగా ఆక్వాకు బీమా పథకం వర్తింపజేస్తే రైతులు నాణ్యమైన సీడ్, ఫీడ్ వాడి మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు. బీమా కంపెనీలు రైతులు ఏ విధమైన మేతలు, సీడ్ వాడుతున్నారని పరిశీలిస్తారని, దీంతో రైతులు తప్పనిసరిగా నాణ్యమైన రొయ్య పిల్లలు, మేతలు వాడాల్సి ఉంటుందన్నారు. తద్వారా దిగుబడులు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రైతుల వినతులు..వనీమా సాగుకు చట్టబద్ధత కల్పించాలని, ఆక్వా సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటుచేయాలని రైతులు కోరారు. సీడ్, ఫీడ్, తల్లి రొయ్యల పెంపకం, సింగిల్ విండో విధానం అమలు చేయాలన్నారు. మార్కెట్ సెస్‌ను రద్దుచేయాలని, ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. మత్స్యశాఖ డీడీ యాకూబ్ బాష, ఎఫ్‌డీఓ రామలింగాచారి, ఎంపెడా అసిస్టెంట్ డైరెక్టర్ బ్రహ్మేశ్వరరావు, గాదిరాజు సుబ్బరాజు, యిర్రింకి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement