విజయవాడలో రాష్ట్ర పశుసంవర్ధక కార్యాలయం
విజయవాడ (లబ్బీపేట) : రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కార్యాలయం పూర్తిస్థాయిలో నగరానికి తరలివచ్చింది. నెల రోజుల కిందట లబ్బీపేటలోని సూపర్‌స్పెషాలిటీ పశుశుల ఆస్పత్రిలో వెటర్నరీ డైరెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించినప్పటికీ, హైదరాబాద్ నుంచే విధులు నిర్వహించారు. గురువారం అక్కడి నుంచి ఫైళ్లతో సహా పూర్తిస్థాయిలో ఉద్యోగులు నగరానికి తరలివచ్చారు. వారిని ఏపీ ఎన్జీవో సంఘ నాయకుడు ఎ.విద్యాసాగర్‌తో పాటు, ఏపీ పశువైద్యుల సంఘం ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. వారికి పూలు ఇస్తూ, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పశుసంవర్ధకశాఖ సంచాలకుడు డాక్టర్ జి.సోమశేఖరమ్ మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధానికి కార్యాలయం తరలిరావడం సంతోషకంగా ఉందన్నారు. రాష్ట్రంలో పశు సంవర్ధకశాఖలో సేవలు మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అదనపు సంచాలకుడు డాక్టర్ కె.కృష్ణమూర్తి సహా సుమారు 50 మందికిపైగా ఉద్యోగులు తరలివచ్చారు. వెటర్నరీ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తుమ్మల సాయిగోపాల్, గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘ ప్రతినిధి డాక్టర్‌కె నగేష్‌బాబు, డాక్టర్ పద్మ పాల్గొన్నారు.