వ్యాధుల పంజా! | diseases! | Sakshi
Sakshi News home page

వ్యాధుల పంజా!

Published Sat, Aug 13 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

వ్యాధుల పంజా!

వ్యాధుల పంజా!

బీర్కూరు మండలం దుర్కి గ్రామంలో డయేరియా జడలు విప్పింది. పది రోజులుగా గ్రామస్తులను మంచానికే పరిమితం చేస్తోంది. ఈ 24 గంటల వ్యవధిలో దుర్కిలోనే ఇద్దరు మృత్యువాత పడ్డారు. గతేడాది ఇదే సీజన్‌లో ఇక్కడి ప్రజలు జ్వరం బారిన పడినా ఇంత ప్రభావం చూపలేదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలు చేపట్టాల్సిన వైద్య ఆరోగ్యశాఖ మిన్నకుండిపోయింది. అంతా అయిపోయాకా అత్యవసర వైద్య సేవల పేరిట శిబిరం ఏర్పటు చేశారు. మెుక్కుబడిగా నిర్వహించడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జ్వరబాధితులను నేలపై పడుకోబెట్టి వైద్యం చేయడంపై విమర్శలకు దారితీస్తోంది. కాగా ఇప్పటికే ఈ గ్రామంలో అతిసారతో ఇద్దరు మృతి చెందగా.. కనీసం ఇంటికొక్కరు చొప్పున జ్వర బాధితులు ఉన్నారు.
 
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : మొన్న బోధన్‌లోని శక్కర్‌నగర్‌లో డిప్తీరియా(కంఠసర్పి) సోకి ఫాతిమా(9) అనే బాలిక.. నిన్న బీర్కూరు మండలం దుర్కిలో మాపురం గంగవ్వ(50) అతిసారతో.. శుక్రవారం అదే గ్రామంలో మురళి(24) అనే మరో యువకుడు మృత్యువాత పడ్డారు. ఇలా పక్షం రోజుల వ్యవధిలో జిల్లాలో ఏడుగురు మృతి చెందగా.. రెండు నెలల్లో 21 మందికిపైగా వివిధ రకాల వ్యాధులతో తనువు చాలించారు. జూలైలో డెంగీతో ఇద్దరు మృతి చెందారు. నవీపేట, బోధన్, మాచారెడ్డి, దోమకొండ, డిచ్‌పల్లి, వర్ని, బాన్సువాడ మండలాల్లో మొదలైన సీజనల్‌ వ్యాధులుఅంటువ్యాధులు ఇప్పుడు జిల్లా అంతటా తాకాయి. 25 రోజుల వ్యవధిలోనే నిజామాబాద్‌ జిల్లాలో డెంగీ ప్రభావం తీవ్రరూపం దాల్చింది. రోజు రోజుకు జిల్లాలోని ఆయా చోట్ల డెంగీ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. డెంగీకి తోడు డిఫ్తీరియ కూడ నాలుగేళ్ల తర్వాత నలుగురిని బలిగొంది. ఇటీవలే కోరలు చాసిన అతిసార ప్రస్తుతం పల్లె ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుంది. దుర్కిలో 24 గంటల్లో ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. అత్యవసర వైద్యశిబిరం ఏర్పాటు చేసినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు.
ముప్పెట దాడి..
జిల్లాలో ఈ ఏడాది ప్రైవేట్‌ ఆస్పత్రులు, ఇతర చోట్లలో డయేరియా బాధితులను తీసుకుంటే 200లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇంకా వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్న పల్లెలు, తండాలలో కేసులు అధికంగా నమోదవుతున్నాయని వైద్యశాఖ చెబుతోంది.  గతేడాది జనవరి నుంచి డిసెంబర్‌ వరకు కేవలం 51 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గతేడాది బోధన్‌లో పూర్తి స్థాయిలో డెంగీ వైరస్‌ వ్యాప్తి చెందింది. వర్ని మండలం మోస్రా, మోర్తాడ్, డిచ్‌పల్లి, బీర్కూరు, దోమకొండ, మాచారెడ్డి, నవీపేట, రెంజల్‌ ప్రాంతాల్లో పలువురు డెంగీతో ఆస్పత్రి పాలయ్యారు. అంతేకాకుండా బోధన్‌లోని రాకాసిపేటలోని క్రిస్టియన్‌ కాలనీలో సుమారు 400 మంది జ్వరపీడితులు నమోదయ్యారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్తలు చేపట్టాల్సిన వైద్య ఆరోగ్యశాఖ నిద్రావస్థకు చేరింది. ఈ సారి డెంగీ ప్రభావం అంతగా లేనప్పటికీ.. బోధన్‌ ఏరియాలో నాలుగేళ్ల తర్వాత డిప్తీరియా ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. తాజాగా డయేరియా(అతిసార) అందరిని హడలెత్తిస్తుంది. ఒకేసారి జిల్లాపై అతిసార, సీజనల్‌ వ్యాధులు ముప్పెట దాడి చేస్తుండటంతో సామాన్యుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.
పారిశుధ్యంపై చిత్తశుద్ధి ఏది?
డెంగీ, మలేరియా తదితర వైరల్‌ ఫీవర్స్‌ బారిన పడి మృతి చెందిన సంఘటనలకు ప్రధాన కారణం పారిశుధ్యమేనని చెప్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నిధులున్నా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు పారిశుధ్యంపై దృష్టి సారించడం లేదు. గ్రామ పంచాయతీల్లో తాగునీరు, పారిశుధ్యం కోసం తదితర అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన 13వ ఆర్థిక సంఘం నిధులపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫలితంగా నిజామాబాద్‌ నగరపాలక సంస్థ, బోధన్, ఆర్మూరు, కామారెడ్డి మున్సిపాలిటీలతోపాటు జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లో పారిశుధ్యం రోజు రోజుకు పేరుకుపోతున్నది. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలుంటే అందులో 27 మేజర్‌ గ్రామ పంచాయతీలుండగా వివిధ పద్దుల కింద వచ్చిన నిధులను సద్వినియోగం చేయలేకపోతున్నారు. జిల్లాలోని దోమల నియంత్రణకు ప్రత్యేకమైన వ్యవస్థ లేదు. ఉన్న వైద్య సిబ్బందికే నియంత్రణ పనులు అప్పజెప్పారు. వాస్తవానికి ప్రతి గ్రామ పంచాయతీలో ఫాగింగ్‌ యంత్రాలు లార్వా నియంత్రణ మిషన్లు ఉండాలి. దీనికిగాను ప్రతి గ్రామ పంచాయతీకి దోమల నియంత్రణ మందులను సరఫరా చేస్తు ప్రతి వారం రోజులకు ఒకసారి దోమల నివారణ కొరకు గ్రామంలో మురికికాల్వలు, నీటినిల్వ ప్రాంతాల్లో మందులు చల్లడం, స్ప్రేలు చేపట్టడం జరుగాలి. కానీ.. ఈ విధానం ఎక్కడ కొనసాగడం లేదు. దోమల నివారణకు శానిటేషన్‌ సిబ్బంది నివారణ మందులు చల్లేందుకు మరో సిబ్బంది బృందాలుగా అందుబాటులో ఉండాలి.  వీరు కూడా అందుబాటులో లేరు. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)కు ప్రతి మూడునెలలకోసారి రూ.10 వేల చొప్పున కేవలం క్లోరినేషన్, పారిశుధ్యం కోసమే విడుదల చేస్తుండగా.. గతేడాది 20 పీహెచ్‌సీలలో నిధులను ఖర్చు చేయక వాపసు వెల్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జిల్లాలో అతిసార, సీజనల్‌వ్యాధులు విజంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement