Ten days
-
హెచ్‌సీఎల్ టెక్ ఉద్యోగులకు బొనాంజా
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 72,800 కోట్లు) ఆదాయ మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు ప్రత్యేకంగా వన్–టైమ్ బోనస్ ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ. 700 కోట్లు వెచ్చిస్తోంది. 2021 ఫిబ్రవరిలో ఈ స్పెషల్ బోనస్‌ను చెల్లించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఏడాది పైగా సర్వీసులో ఉన్న ఉద్యోగులకు దాదాపు 10 రోజుల వేతనానికి సరిసమానంగా ఇది ఉంటుందని పేర్కొంది. సంస్థలో 1,59,000 పైచిలుకు సిబ్బంది ఉన్నారు. 2020లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 10 బిలియన్ డాలర్ల ఆదాయం మైలురాయిని అధిగమించింది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన తరుణంలోనూ ప్రతీ ఉద్యోగీ ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించి, సంస్థ వృద్ధికి తోడ్పడ్డారని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ అప్పారావు వి.వి. తెలిపారు. డిజిటల్ సర్వీసులు, ఇతర ఉత్పత్తుల ఊతంతో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం 31.1 శాతం పెరిగి రూ. 3,982 కోట్లకు ఎగిసింది. అలాగే ఆదాయం 6.4 శాతం పెరిగి రూ. 19,302 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రస్తుత త్రైమాసికంలో ఆదాయం గైడెన్స్ అంచనాలను 1.5–2.5 శాతం నుంచి 2–3 శాతానికి పెంచింది. సోమవారం బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు సుమారు 1 శాతం పెరిగి రూ. 958 వద్ద ముగిసింది. -
టెన్ డేస్ హెయిర్ ఆయిల్ పేరిట మోసం
విశాఖపట్నం, అల్లిపురం(విశాఖ దక్షిణ): టెన్ డేస్ హెయిర్ ఆయిల్ పేరిట రూ.64వేలు మోసపోయిన ఘటనపై మంగâళవారం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. సైబర్ క్రైం సీఐ వి.గోపినాథ్ తెలిపిన వివరాల ప్రకారం... నగరంలో పాండురంగాపురం ప్రాంతానికి చెందిన జి.దుర్గాప్రసాద్ కొద్ది రోజుల క్రింతం ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాడు. టెన్ డేస్ హెయిర్ ఆయిల్ ప్రొడక్టును క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో కొనుగోలు చేశాడు. కొన్ని రోజుల తరువాత ఆయనకు 9831534208 నంబరు నుంచి ఫోన్‌చేసి... టెన్‌డేస్ హెయిర్ ఆయిల్ కొన్నందుకు రూ.12.80లక్షలు బహుమతి వచ్చిందని, దానిని క్లెయిమ్ చేసుకునేందుకు మీ బ్యాంకు అకౌంట్ నంబరును పంపమని కోరడంతో అతను అకౌంట్ నంబర్‌ను పంపించాడు. తరువాత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారు పంపినట్లు ఒక మెసేజ్ రూ.12.80లక్షలు హోల్డ్‌లో ఉన్నాయని, దానిని క్లెయిమ్ చేసుకునేందుకు కొంత సొమ్ము కట్టాలని చెప్పడంతో దుర్గాప్రసాద్ పలు విడతల్లో రూ.64వేలు డిపాజిట్ చేశాడు. డబ్బులు క్లెయిమ్ చేయాలంటే మరికొంత డబ్బు డిపాజిట్ చేయాలని చెప్పటంతో అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఆన్లైన్లో కనిపించే యాడ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ గోపీనాథ్ సూచించారు. -
శునకానికి పెద్దకర్మ
బుగ్గారం(ధర్మపురి): మానవ సంబంధాలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో జం తువులపై తమకు ఉన్న ప్రేమ అమితమైనదని చాటిచెప్పారు మండలంలోని చందయ్యపల్లె గ్రామానికి చెందిన గాదె శంకరయ్య,చిలుకవ్వ దంపతులు. తమ కన్న బిడ్డలతో సమానంగా పెం చుకు న్న బబ్బి అనే శునకం ఇటీవల చనిపోవడంతో సంప్రదాయబద్ధంగా దశదినకర్మ నిర్వహించారు. శంకరయ్య– చిలుకవ్వ దంపతులకు కొన్నాళ్ల వరకు పిల్లలు కలుగకపోవడంతో పలు ఆలయాలు తిరిగారు. క్రమంలో వారి బంధువుల్లో కొందరు శునకం కూనలకు బారసాల జరిపితే పిల్లలు పుడతారని చెప్పడంతో ఆ తంతు జరిపారు. కొద్దికాలానికి వారికి కుమారుడు నాగరాజు, కుమార్తె పూజిత జన్మించారు. దీంతో వారికి శునకాలపై విశ్వాసం పెరిగింది. అప్పటినుంచి వాటిని తమ పిల్లలతో సమానంగా పెంచుకున్నారు. కొద్దిరోజుల క్రితం వారి పెంపుడు శునకం బబ్బి చనిపోయింది. గత బుధవారం సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. వారం రోజులకు బుధవారం పెద్దకర్మ జరిపించారు. దాదాపు 200 మందికి భోజన ఏర్పాట్లు చేశారు. -
వ్యాధుల పంజా!
బీర్కూరు మండలం దుర్కి గ్రామంలో డయేరియా జడలు విప్పింది. పది రోజులుగా గ్రామస్తులను మంచానికే పరిమితం చేస్తోంది. ఈ 24 గంటల వ్యవధిలో దుర్కిలోనే ఇద్దరు మృత్యువాత పడ్డారు. గతేడాది ఇదే సీజన్లో ఇక్కడి ప్రజలు జ్వరం బారిన పడినా ఇంత ప్రభావం చూపలేదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలు చేపట్టాల్సిన వైద్య ఆరోగ్యశాఖ మిన్నకుండిపోయింది. అంతా అయిపోయాకా అత్యవసర వైద్య సేవల పేరిట శిబిరం ఏర్పటు చేశారు. మెుక్కుబడిగా నిర్వహించడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జ్వరబాధితులను నేలపై పడుకోబెట్టి వైద్యం చేయడంపై విమర్శలకు దారితీస్తోంది. కాగా ఇప్పటికే ఈ గ్రామంలో అతిసారతో ఇద్దరు మృతి చెందగా.. కనీసం ఇంటికొక్కరు చొప్పున జ్వర బాధితులు ఉన్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మొన్న బోధన్‌లోని శక్కర్‌నగర్‌లో డిప్తీరియా(కంఠసర్పి) సోకి ఫాతిమా(9) అనే బాలిక.. నిన్న బీర్కూరు మండలం దుర్కిలో మాపురం గంగవ్వ(50) అతిసారతో.. శుక్రవారం అదే గ్రామంలో మురళి(24) అనే మరో యువకుడు మృత్యువాత పడ్డారు. ఇలా పక్షం రోజుల వ్యవధిలో జిల్లాలో ఏడుగురు మృతి చెందగా.. రెండు నెలల్లో 21 మందికిపైగా వివిధ రకాల వ్యాధులతో తనువు చాలించారు. జూలైలో డెంగీతో ఇద్దరు మృతి చెందారు. నవీపేట, బోధన్, మాచారెడ్డి, దోమకొండ, డిచ్పల్లి, వర్ని, బాన్సువాడ మండలాల్లో మొదలైన సీజనల్ వ్యాధులుఅంటువ్యాధులు ఇప్పుడు జిల్లా అంతటా తాకాయి. 25 రోజుల వ్యవధిలోనే నిజామాబాద్ జిల్లాలో డెంగీ ప్రభావం తీవ్రరూపం దాల్చింది. రోజు రోజుకు జిల్లాలోని ఆయా చోట్ల డెంగీ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. డెంగీకి తోడు డిఫ్తీరియ కూడ నాలుగేళ్ల తర్వాత నలుగురిని బలిగొంది. ఇటీవలే కోరలు చాసిన అతిసార ప్రస్తుతం పల్లె ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుంది. దుర్కిలో 24 గంటల్లో ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. అత్యవసర వైద్యశిబిరం ఏర్పాటు చేసినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ముప్పెట దాడి.. జిల్లాలో ఈ ఏడాది ప్రైవేట్ ఆస్పత్రులు, ఇతర చోట్లలో డయేరియా బాధితులను తీసుకుంటే 200లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇంకా వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్న పల్లెలు, తండాలలో కేసులు అధికంగా నమోదవుతున్నాయని వైద్యశాఖ చెబుతోంది. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు కేవలం 51 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గతేడాది బోధన్‌లో పూర్తి స్థాయిలో డెంగీ వైరస్ వ్యాప్తి చెందింది. వర్ని మండలం మోస్రా, మోర్తాడ్, డిచ్పల్లి, బీర్కూరు, దోమకొండ, మాచారెడ్డి, నవీపేట, రెంజల్ ప్రాంతాల్లో పలువురు డెంగీతో ఆస్పత్రి పాలయ్యారు. అంతేకాకుండా బోధన్‌లోని రాకాసిపేటలోని క్రిస్టియన్ కాలనీలో సుమారు 400 మంది జ్వరపీడితులు నమోదయ్యారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్తలు చేపట్టాల్సిన వైద్య ఆరోగ్యశాఖ నిద్రావస్థకు చేరింది. ఈ సారి డెంగీ ప్రభావం అంతగా లేనప్పటికీ.. బోధన్ ఏరియాలో నాలుగేళ్ల తర్వాత డిప్తీరియా ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. తాజాగా డయేరియా(అతిసార) అందరిని హడలెత్తిస్తుంది. ఒకేసారి జిల్లాపై అతిసార, సీజనల్ వ్యాధులు ముప్పెట దాడి చేస్తుండటంతో సామాన్యుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. పారిశుధ్యంపై చిత్తశుద్ధి ఏది? డెంగీ, మలేరియా తదితర వైరల్ ఫీవర్స్ బారిన పడి మృతి చెందిన సంఘటనలకు ప్రధాన కారణం పారిశుధ్యమేనని చెప్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నిధులున్నా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు పారిశుధ్యంపై దృష్టి సారించడం లేదు. గ్రామ పంచాయతీల్లో తాగునీరు, పారిశుధ్యం కోసం తదితర అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన 13వ ఆర్థిక సంఘం నిధులపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫలితంగా నిజామాబాద్ నగరపాలక సంస్థ, బోధన్, ఆర్మూరు, కామారెడ్డి మున్సిపాలిటీలతోపాటు జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లో పారిశుధ్యం రోజు రోజుకు పేరుకుపోతున్నది. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలుంటే అందులో 27 మేజర్ గ్రామ పంచాయతీలుండగా వివిధ పద్దుల కింద వచ్చిన నిధులను సద్వినియోగం చేయలేకపోతున్నారు. జిల్లాలోని దోమల నియంత్రణకు ప్రత్యేకమైన వ్యవస్థ లేదు. ఉన్న వైద్య సిబ్బందికే నియంత్రణ పనులు అప్పజెప్పారు. వాస్తవానికి ప్రతి గ్రామ పంచాయతీలో ఫాగింగ్ యంత్రాలు లార్వా నియంత్రణ మిషన్లు ఉండాలి. దీనికిగాను ప్రతి గ్రామ పంచాయతీకి దోమల నియంత్రణ మందులను సరఫరా చేస్తు ప్రతి వారం రోజులకు ఒకసారి దోమల నివారణ కొరకు గ్రామంలో మురికికాల్వలు, నీటినిల్వ ప్రాంతాల్లో మందులు చల్లడం, స్ప్రేలు చేపట్టడం జరుగాలి. కానీ.. ఈ విధానం ఎక్కడ కొనసాగడం లేదు. దోమల నివారణకు శానిటేషన్ సిబ్బంది నివారణ మందులు చల్లేందుకు మరో సిబ్బంది బృందాలుగా అందుబాటులో ఉండాలి. వీరు కూడా అందుబాటులో లేరు. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)కు ప్రతి మూడునెలలకోసారి రూ.10 వేల చొప్పున కేవలం క్లోరినేషన్, పారిశుధ్యం కోసమే విడుదల చేస్తుండగా.. గతేడాది 20 పీహెచ్సీలలో నిధులను ఖర్చు చేయక వాపసు వెల్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జిల్లాలో అతిసార, సీజనల్వ్యాధులు విజంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
3 ముళ్లు 7 అడుగులు 10 రోజులు..
మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వాలనుకునే జంటలకు ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మరో పదిరోజులు మాత్రమే మిగిలాయి. ఈ నెలాఖరు వరకు మాత్రమే ముహూర్తాలు ఉండడంతో జిల్లాలో పెళ్లిళ్ల సందడి నెలకొంది. ఈ నెల 21, 22, 24, 29 తేదీల్లో వేల జంటలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటికానున్నాయి. 29వ తేదీ అనంతరం 116 రోజులు వివాహాలు, శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. * నెలాఖరు వరకే వివాహ ముహూర్తాలు * ఏప్రిల్ 30 నుంచి ఆగస్టు 30 వరకు బ్రేక్ * జిల్లా వ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి ద్వారకాతిరుమల/జంగారెడ్డిగూడెం రూరల్ : ఈ నెలాఖరు వరకే వివాహ ముహూర్తాలు ఉండడంతో జిల్లా అంతటా పెళ్లిళ్ల సందడి నెలకొంది. 30వ తేదీ నుంచి మూఢం రావడంతో పాటు దాదాపు 116 రోజుల వరకు వివాహ, శుభకార్యాలలకు విరామం కల గనుంది. దీంతో ఇప్పటికే నిశ్చయ తాంబూలాలు అందుకున్న జంటల తల్లిదండ్రులు ఈ పదిరోజుల్లో ఉన్న ముహూర్తాల్లో పెళ్లిళ్లు జరిపేందుకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ప్రధానంగా ఈనెల 21, 24, 29 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉండటంతో వే లాది జంటలు వివాహ బంధంతో ఒక్కటి కానున్నట్టు పురోహితులు తెలిపారు. ఈ ముహూర్తాలు దాటితే మళ్లీ ఆగస్టు 6 వరకు వేచి ఉండాల్సిందేనని అంటున్నా రు. పుష్కరాలు జరిగే కృష్ణానది పరివాహక ప్రాంతాల వారికైతే ఈ గడువు ఆగస్టు 23 వరకు ఉందని చెబుతున్నారు. శ్రీవారి క్షేత్రంలో సందడి ఈనెలాఖరు వరకు జరుగనున్న వివాహాలకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల (చిన్నతిరుపతి) శ్రీవారి క్షేత్రం వేదిక కానుంది. ఇప్పటికే పెళ్లి బృందాలు క్షేత్రంలోని కల్యాణ మండపాలు, సత్రాలు, కాటేజీలు, గదులను ముందస్తుగా బుక్ చేసుకున్నారు. దీంతో వెనుక వచ్చే వారికి కష్టాలు తప్పనట్టే. శేషాచలకొండపైన, దిగువన ఈనెల 21, 22, 24, 29 తేదీల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి కల్యాణ మండపాలకు విద్యుద్దీపాలంకారాలు, అలాగే పచ్చిపూల మండపాలు వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నెలలో ముహూర్తాలు కొన్నే ఉండటంతో పెళ్లి సామాగ్రి ధరలకు రెక్కలొచ్చాయి. పురోహితులకు, ట్రావెల్స్‌కు డిమాండ్ ఏర్పడింది. వివాహాన్ని అట్టహాసంగా జరుపుకోదలచిన వారు ఖర్చును సైతం లెక్కచేయడం లేదు. ఇప్పటికే చిన్నతిరుపతి క్షేత్రంలో వివాహ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఆగస్టు 6 వరకు వివాహాలకు బ్రేక్ ప్రస్తుతం చైత్రమాసం కొనసాగుతోంది. ఈ నెలాఖరు నుంచి శ్రావణంలో సగభాగం ముగిసే వరకు ముహూర్తాలు లేవు. ఈనెల 30 నుంచి జూలై 13 వరకు శుక్రమౌఢ్యం ఉందని పురోహితులు చెబుతున్నారు. ఆ వెంటనే ఆషాఢమాసం వస్తుందని, దాన్ని శూన్యమాసంగా భావించి వివాహాలు జరపరని పండితులు తెలిపారు. ఆ తర్వాత వచ్చే శ్రావణం శుభప్రదం కావడంతో ఆగస్టు 6 నుంచి వివాహ ముహూర్తాలు ఉన్నాయన్నారు. పురోహితులు.. వివాహ సామగ్రికి డిమాండ్ జిల్లాలో వివాహాలు పెద్ద సంఖ్యలో జరుగుతుండడంతో వివాహ సామగ్రికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కల్యాణ మండపాలు ఇప్పటికే బుక్ కాగా పురోహితులు, షామియానా, లైటింగ్, పూలకు, పూల వేదికలు సెట్టింగ్‌లకు, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లకు గిరాకీ నెలకొంది. నెలల వారీగా ముహూర్తాలు ఇలా ఏప్రిల్ : 20, 21, 22, 24 27, 29 తేదీల్లో ముహూర్తాలు మే : శుక్లమౌడ్యమి కావడంతో ముహుర్తాలు లేవు జూన్ : గురుమౌఢ్యమి కావడంతో ముహుర్తాలు లేవు జూలై : ఆషాడం కావడంతో ముహూర్తాలు లేవు ఆగస్టు : శ్రావణమాసంలో 6 నుంచి 27వ తేదీ వరకు ముహూర్తాలు ఉన్నాయి సెప్టెంబర్ : భాద్రపదం కావడంతో ముహర్తాలు ఉండవు అక్టోబర్ : ఆశ్వీయుజంలో 5 నుంచి 21 వరకు ముహూర్తాలు ఉన్నాయి నవంబర్ : కార్తీకంలో 2 నుంచి 24వ తేదీ వరకు ముహూర్తాలు ఉన్నాయి డిసెంబర్ : మార్గశిరంలో 3 నుంచి 22 వరకు ముహూర్తాలు ఉన్నాయి. -
పది రోజులుగా విషాదంలో టాలీవుడ్
పది రోజుల్లో వరుసగా 5 మరణాలు సంభవించడంతో తెలుగు సినీపరిశ్రమలోని పలువురు ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. గతంలో వరుసగా హాస్యనటుల ఆకస్మిక మరణంతో తల్లడిల్లిన టాలీవుడ్‌ను వరుస మరణాలు మళ్లీ తీవ్ర కలవరానికి గురిచేశాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఐదుగురు మరణించడం కలకలం సృష్టించింది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి మరణంతో ప్రారంభమైన ఈ విషాదం వరుసగా ఐదుగురిని పొట్టన పెట్టుకుంది. అదేరోజు మరో రచయిత శ్రీనివాస్ చక్రవర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ ఇద్దరూ ఒకే రోజు చనిపోవడం బాధ కలిగించిందని ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు సంతాపం తెలిపారు. తర్వాత మరో సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ తల్లి బాత్ రూంలో జారిపడి అపస్మారక స్థితిలోనే ప్రాణాలు విడిచారు. ఇక ఆ తర్వాత నాటకరంగ ప్రముఖుడు, పలువురు అగ్ర హీరోలకు నటనలో శిక్షణ ఇచ్చిన చాట్ల శ్రీరాములు గత శనివారం అనారోగ్యంతో మరణించారు. ఆ విషాదం నుంచి తేరుకునే ముందే.. విలక్షణ నటుడు, హీరో రంగనాథ్ ఆత్మహత్యతో టాలీవుడ్ దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఇలా వరుస మరణాలు సంవత్సరం ఆఖరులో సంభవించడంతో టాలీవుడ్లో విషాదం నెలకొంది. గతంలో 'మా' ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి పూజలు, యాగం గురించి చర్చించుకుంటున్నారు. -
గిన్నిస్ రికార్డ్ కోసం పది రోజుల్లో సినిమా చేయబోతున్నాం : దర్శకుడు నాగేంద్ర ప్రసాద్
రెండు గంటల సినిమాను పది రోజుల్లో తీయడం సాధ్యమా? అది కూడా ‘స్క్రిప్ట్ రాయడం నుంచి స్క్రీన్’కి వెళ్లేంతవరకు. సాధ్యమేనంటున్నారు దర్శకుడు నాగేంద్ర ప్రసాద్. ఈ వినూత్న ప్రయత్నాన్ని ప్రోత్సహించాలనే ఆకాంక్షతో సునీల్, ప్రజ్ఞాధర్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈరోజు (సోమవారం) ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు ఈ ప్రయత్నం మొదలవుతుంది. మొత్తం పది రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన ఈ చిత్రం తీసి, ఆ తర్వాత రోజు ప్రివ్యూ వేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అసలీ ప్రయత్నం కేవలం రికార్డ్ కోసమేనా? వేరే కారణాలున్నాయా? తదితర విశేషాలు దర్శకుడు నాగేంద్ర ప్రసాద్‌నే అడిగి తెలుసుకుందాం... అసలు ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేయాలనుకున్నారు? దాదాపు పదేళ్లు పాత్రికేయుడిగా చేసిన తర్వాత ‘కీ’ ద్వారా దర్శకునిగా మారాను. ఆ చిత్రం తర్వాత పలు కథలతో చాలామంది నిర్మాతలను కలిశాను. అందరూ ‘కథ అద్భుతం.. చేద్దాం’ అన్నారే కానీ, ఆ తర్వాత ముందుకు రాలేదు. అలా రెండేళ్లు గడిచిపోయింది. కొత్త దర్శకులకు, ఒకటి, రెండు చిత్రాల అనుభవం ఉన్న దర్శకులకు అవకాశాలివ్వడానికి నిర్మాతలు వెనుకాడుతున్నారు. చెప్పినదానికన్నా నిర్మాణ వ్యయం పెంచేస్తారనో, చెప్పిన సమయానికి తీయకుండా ఎక్కువ రోజులు తీసుకుంటారేమోననో.. ఇలా అవకాశాలివ్వకపోవడానికి వాళ్ల కారణాలు వాళ్లకుంటాయి. అందుకే, తక్కువ రోజుల్లో, తక్కువ బడ్జెట్లోనూ సినిమా తీయొచ్చని నిరూపించాలనుకున్నాను. అప్పుడీ ఆలోచన వచ్చింది. ఇందుకు ప్రేరణ ఏంటి? సౌత్ ఆఫ్రికన్ సినిమా ‘షాట్‌గన్ గార్ఫంకల్’ని ఆదర్శంగా తీసుకున్నాం. ఆ చిత్రాన్ని 10 రోజుల 10 గంటల 30 నిమిషాల్లో తీశారు. ప్రపంచంలో అత్యంత వేగవంతంగా తీసిన సినిమాగా గిన్నిస్ రికార్డ్ సాధించిన చిత్రం అది. ఆ రికార్డ్‌ని బ్రేక్ చేయాలన్నదే మా పట్టుదల. గిన్నిస్ రికార్డ్ అయితే మంచి గుర్తింపు వస్తుందనా.. దాన్నే టార్గెట్ చేశారు? తక్కువ పని గంటల్లో సినిమా తీసి నిరూపించుకోవాలన్నది ప్రధాన కారణం. గిన్నిస్ రికార్డ్ సాధించడం అంటే అంత సులువు కాదు. ఆ రికార్డ్ ద్వారా తప్పకుండా నలుగురిలో గుర్తింపు వస్తుందన్నది మా నమ్మకం. సోమవారం ఉదయం ఎన్ని గంటలకు మీ ప్రయత్నాన్ని మొదలుపెట్టనున్నారు? సరిగ్గా తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు మొదలుపెడతాం. కథ నుంచే మొదలుపెట్టాలనుకుంటున్నాం. ప్రస్తుతానికి మా దగ్గర స్టోరీ లైన్ మాత్రమే ఉంది. దాన్ని కథగా మలచడం నుంచి మా పని మొదలవుతుంది. ఈ నెల 22కి ఈ సినిమా పూర్తి చేసేస్తాం. ఆ తర్వాత మా సన్నిహితులకు, మీడియావారికి ప్రివ్యూ చూపిస్తాం. మరి.. నటీనటులు, సాంకేతిక నిపుణుల సంగతేంటి? కథ పూర్తయ్యాక వాళ్ల ఎంపిక మొదలుపెడతాం. సోషల్ మీడియా సహకారంతో మాక్కావాల్సినవారిని యుద్ధ ప్రాతిపదికన ఎంపిక చేసుకుంటాం. గిన్నిస్ రికార్డ్ సాధించిన ‘షాట్‌గన్ గార్ఫంకల్’ నిడివి ఎంత? మరి... మీ చిత్రం నిడివి ఎంత ఉంటుంది? ఆ చిత్రం నిడివి 75 నిమిషాలు. మా చిత్రం నిడివి 120 నిమిషాలు. అయినా ఫర్వాలేదు.. తక్కువ సమయంలో.. అనుకున్నది సాధిస్తాం. మీ ప్రయత్నాన్ని గమనించడానికి గిన్నిస్ రికార్డ్ నిర్వాహకుల్లో ఎవరైనా వస్తారా? మీరిచ్చే వివరాలు సరైనవనే అభిప్రాయానికి వాళ్లెలా వస్తారు? మామూలుగా అయితే వాళ్లని ఇక్కడికి రప్పించవచ్చు. కాకపోతే, అదనంగా ఖర్చుపెట్టాలి. అందుకే, ఆ అభిప్రాయాన్ని విరమించుకున్నాం. మేం సోమవారం ఉదయం ఈ చిత్రాన్ని ప్రారంభించినప్పట్నుంచీ ముగించే వరకు మొత్తం వీడియో షూట్ చేస్తాం. దాన్ని సబ్మిట్ చేస్తాం. ఈ చిత్రంలో పాటలు ఉంటాయా? ఓ రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలో ఉండే అంశాలన్నీ ఇందులో ఉంటాయి. కాకపోతే పాటల గురించి కథ పూర్తిగా సిద్ధమైన తర్వాత ఆలోచిస్తాం. ఏ కెమెరాతో సినిమా తీయబోతున్నారు? సౌత్ ఆఫ్రికన్ చిత్రాన్ని సోనీ కామ్ హెచ్డి ఫార్మాట్లో తీశారు. కానీ, మేం మాత్రం రెగుల్యర్ కమర్షియల్ చిత్రాలకు వాడే రెడ్ కెమెరానే వాడనున్నాం. నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ఫైనల్‌గా నిర్మాతల గురించి? సునీల్, ప్రజ్ఞాధర్ నిర్మించడానికి ముందుకు రావడం గొప్ప విషయం. అలాగే, ఐడర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శివకుమార్‌గారు ‘ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధం’ అని ముందుకు రావడం మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం ‘స్క్రిప్ట్ టు స్క్రీన్’ కాన్సెప్ట్‌తో నాగేంద్ర ప్రసాద్ చేస్తున్న ఈ బృహత్తర ప్రయత్నం తాలూకు విశేషాలను ప్రతిరోజూ ‘సాక్షి’ ప్రత్యేకంగా అందించనుంది. గమనించగలరు. డి.జి. భవాని