పది రోజులుగా విషాదంలో టాలీవుడ్
పదిరోజుల్లో వరుసగా 5 మరణాలు సంభవించడంతో తెలుగు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు.
పది రోజుల్లో వరుసగా 5 మరణాలు సంభవించడంతో తెలుగు సినీపరిశ్రమలోని పలువురు ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. గతంలో వరుసగా హాస్యనటుల ఆకస్మిక మరణంతో తల్లడిల్లిన టాలీవుడ్‌ను వరుస మరణాలు మళ్లీ తీవ్ర కలవరానికి గురిచేశాయి.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఐదుగురు మరణించడం కలకలం సృష్టించింది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి మరణంతో ప్రారంభమైన ఈ విషాదం వరుసగా ఐదుగురిని పొట్టన పెట్టుకుంది. అదేరోజు మరో రచయిత శ్రీనివాస్ చక్రవర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ ఇద్దరూ ఒకే రోజు చనిపోవడం బాధ కలిగించిందని ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు సంతాపం తెలిపారు.
తర్వాత మరో సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ తల్లి బాత్ రూంలో జారిపడి అపస్మారక స్థితిలోనే ప్రాణాలు విడిచారు. ఇక ఆ తర్వాత నాటకరంగ ప్రముఖుడు, పలువురు అగ్ర హీరోలకు నటనలో శిక్షణ ఇచ్చిన చాట్ల శ్రీరాములు గత శనివారం అనారోగ్యంతో మరణించారు. ఆ విషాదం నుంచి తేరుకునే ముందే.. విలక్షణ నటుడు, హీరో రంగనాథ్ ఆత్మహత్యతో టాలీవుడ్ దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఇలా వరుస మరణాలు సంవత్సరం ఆఖరులో సంభవించడంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. గతంలో 'మా' ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి పూజలు, యాగం గురించి చర్చించుకుంటున్నారు.