గిన్నిస్ రికార్డ్ కోసం పది రోజుల్లో సినిమా చేయబోతున్నాం : దర్శకుడు నాగేంద్ర ప్రసాద్ | Ten days film is completed for Guinness record | Sakshi
Sakshi News home page

గిన్నిస్ రికార్డ్ కోసం పది రోజుల్లో సినిమా చేయబోతున్నాం : దర్శకుడు నాగేంద్ర ప్రసాద్

Published Sun, Oct 12 2014 11:35 PM | Last Updated on Thu, Sep 27 2018 8:49 PM

గిన్నిస్ రికార్డ్ కోసం పది రోజుల్లో సినిమా చేయబోతున్నాం : దర్శకుడు నాగేంద్ర ప్రసాద్ - Sakshi

గిన్నిస్ రికార్డ్ కోసం పది రోజుల్లో సినిమా చేయబోతున్నాం : దర్శకుడు నాగేంద్ర ప్రసాద్

 రెండు గంటల సినిమాను పది రోజుల్లో తీయడం సాధ్యమా? అది కూడా ‘స్క్రిప్ట్ రాయడం నుంచి స్క్రీన్’కి వెళ్లేంతవరకు. సాధ్యమేనంటున్నారు దర్శకుడు నాగేంద్ర ప్రసాద్. ఈ వినూత్న ప్రయత్నాన్ని ప్రోత్సహించాలనే ఆకాంక్షతో సునీల్, ప్రజ్ఞాధర్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈరోజు (సోమవారం) ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు ఈ ప్రయత్నం మొదలవుతుంది. మొత్తం పది రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన ఈ చిత్రం తీసి, ఆ తర్వాత రోజు ప్రివ్యూ వేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అసలీ ప్రయత్నం కేవలం రికార్డ్ కోసమేనా? వేరే కారణాలున్నాయా? తదితర విశేషాలు దర్శకుడు నాగేంద్ర ప్రసాద్‌నే అడిగి తెలుసుకుందాం...
 
 అసలు ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేయాలనుకున్నారు?
 దాదాపు పదేళ్లు పాత్రికేయుడిగా చేసిన తర్వాత ‘కీ’ ద్వారా దర్శకునిగా మారాను. ఆ చిత్రం తర్వాత పలు కథలతో చాలామంది నిర్మాతలను కలిశాను. అందరూ ‘కథ అద్భుతం.. చేద్దాం’ అన్నారే కానీ, ఆ తర్వాత ముందుకు రాలేదు. అలా రెండేళ్లు గడిచిపోయింది. కొత్త దర్శకులకు, ఒకటి, రెండు చిత్రాల అనుభవం ఉన్న దర్శకులకు అవకాశాలివ్వడానికి నిర్మాతలు వెనుకాడుతున్నారు. చెప్పినదానికన్నా నిర్మాణ వ్యయం పెంచేస్తారనో, చెప్పిన సమయానికి తీయకుండా ఎక్కువ రోజులు తీసుకుంటారేమోననో.. ఇలా అవకాశాలివ్వకపోవడానికి వాళ్ల కారణాలు వాళ్లకుంటాయి. అందుకే, తక్కువ రోజుల్లో, తక్కువ బడ్జెట్‌లోనూ సినిమా తీయొచ్చని నిరూపించాలనుకున్నాను. అప్పుడీ ఆలోచన వచ్చింది.
 
 ఇందుకు ప్రేరణ ఏంటి?
 సౌత్ ఆఫ్రికన్ సినిమా ‘షాట్‌గన్ గార్‌ఫంకల్’ని ఆదర్శంగా తీసుకున్నాం. ఆ చిత్రాన్ని 10 రోజుల 10 గంటల 30 నిమిషాల్లో తీశారు. ప్రపంచంలో అత్యంత వేగవంతంగా తీసిన సినిమాగా గిన్నిస్ రికార్డ్ సాధించిన చిత్రం అది. ఆ రికార్డ్‌ని బ్రేక్ చేయాలన్నదే మా పట్టుదల.
 
  గిన్నిస్ రికార్డ్ అయితే మంచి గుర్తింపు వస్తుందనా.. దాన్నే టార్గెట్ చేశారు?
 తక్కువ పని గంటల్లో సినిమా తీసి నిరూపించుకోవాలన్నది ప్రధాన కారణం. గిన్నిస్ రికార్డ్ సాధించడం అంటే అంత సులువు కాదు. ఆ రికార్డ్ ద్వారా తప్పకుండా నలుగురిలో గుర్తింపు వస్తుందన్నది మా నమ్మకం.
 
 సోమవారం ఉదయం ఎన్ని గంటలకు మీ ప్రయత్నాన్ని మొదలుపెట్టనున్నారు?
 సరిగ్గా తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు మొదలుపెడతాం. కథ నుంచే మొదలుపెట్టాలనుకుంటున్నాం. ప్రస్తుతానికి మా దగ్గర స్టోరీ లైన్ మాత్రమే ఉంది. దాన్ని కథగా మలచడం నుంచి మా పని మొదలవుతుంది. ఈ నెల 22కి ఈ సినిమా పూర్తి చేసేస్తాం. ఆ తర్వాత మా సన్నిహితులకు, మీడియావారికి ప్రివ్యూ చూపిస్తాం.
 
 మరి.. నటీనటులు, సాంకేతిక నిపుణుల సంగతేంటి?
 కథ పూర్తయ్యాక వాళ్ల ఎంపిక మొదలుపెడతాం. సోషల్ మీడియా సహకారంతో మాక్కావాల్సినవారిని యుద్ధ ప్రాతిపదికన ఎంపిక చేసుకుంటాం.
 
 గిన్నిస్ రికార్డ్ సాధించిన ‘షాట్‌గన్ గార్‌ఫంకల్’ నిడివి ఎంత? మరి... మీ చిత్రం నిడివి ఎంత ఉంటుంది?
 ఆ చిత్రం నిడివి 75 నిమిషాలు. మా చిత్రం నిడివి 120 నిమిషాలు. అయినా ఫర్వాలేదు.. తక్కువ సమయంలో.. అనుకున్నది సాధిస్తాం.
 
 మీ ప్రయత్నాన్ని గమనించడానికి గిన్నిస్ రికార్డ్ నిర్వాహకుల్లో ఎవరైనా వస్తారా? మీరిచ్చే వివరాలు సరైనవనే అభిప్రాయానికి వాళ్లెలా వస్తారు?

 మామూలుగా అయితే వాళ్లని ఇక్కడికి రప్పించవచ్చు. కాకపోతే, అదనంగా ఖర్చుపెట్టాలి. అందుకే, ఆ అభిప్రాయాన్ని విరమించుకున్నాం. మేం సోమవారం ఉదయం ఈ చిత్రాన్ని ప్రారంభించినప్పట్నుంచీ ముగించే వరకు మొత్తం వీడియో షూట్ చేస్తాం. దాన్ని సబ్మిట్ చేస్తాం.
 
 ఈ చిత్రంలో పాటలు ఉంటాయా?
 ఓ రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలో ఉండే అంశాలన్నీ ఇందులో ఉంటాయి. కాకపోతే పాటల గురించి కథ పూర్తిగా సిద్ధమైన తర్వాత ఆలోచిస్తాం.
 
 ఏ కెమెరాతో సినిమా తీయబోతున్నారు?
 సౌత్ ఆఫ్రికన్ చిత్రాన్ని సోనీ కామ్ హెచ్‌డి ఫార్మాట్‌లో తీశారు. కానీ, మేం మాత్రం రెగుల్యర్ కమర్షియల్ చిత్రాలకు వాడే రెడ్ కెమెరానే వాడనున్నాం. నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు.
 
 ఫైనల్‌గా నిర్మాతల గురించి?
 సునీల్, ప్రజ్ఞాధర్ నిర్మించడానికి ముందుకు రావడం గొప్ప విషయం. అలాగే, ఐడర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శివకుమార్‌గారు ‘ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధం’ అని ముందుకు రావడం మరింత ప్రోత్సాహాన్నిచ్చింది.
 
 గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం ‘స్క్రిప్ట్ టు స్క్రీన్’ కాన్సెప్ట్‌తో నాగేంద్ర ప్రసాద్ చేస్తున్న ఈ బృహత్తర ప్రయత్నం తాలూకు విశేషాలను ప్రతిరోజూ ‘సాక్షి’ ప్రత్యేకంగా అందించనుంది. గమనించగలరు.
 
 డి.జి. భవాని
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement