3 ముళ్లు 7 అడుగులు 10 రోజులు.. | Marriages Break from April 30 to August 30 | Sakshi
Sakshi News home page

3 ముళ్లు 7 అడుగులు 10 రోజులు..

Published Tue, Apr 19 2016 4:19 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM

3 ముళ్లు 7 అడుగులు 10 రోజులు..

3 ముళ్లు 7 అడుగులు 10 రోజులు..

మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వాలనుకునే జంటలకు ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మరో పదిరోజులు మాత్రమే మిగిలాయి.
ఈ నెలాఖరు వరకు మాత్రమే ముహూర్తాలు ఉండడంతో జిల్లాలో పెళ్లిళ్ల సందడి నెలకొంది.
ఈ నెల 21, 22, 24, 29 తేదీల్లో వేల జంటలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటికానున్నాయి.
29వ తేదీ అనంతరం 116 రోజులు వివాహాలు, శుభకార్యాలకు బ్రేక్ పడనుంది.
 
 
* నెలాఖరు వరకే వివాహ ముహూర్తాలు
* ఏప్రిల్ 30 నుంచి ఆగస్టు 30 వరకు బ్రేక్
* జిల్లా వ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి

ద్వారకాతిరుమల/జంగారెడ్డిగూడెం రూరల్ : ఈ నెలాఖరు వరకే వివాహ ముహూర్తాలు ఉండడంతో జిల్లా అంతటా పెళ్లిళ్ల సందడి నెలకొంది. 30వ తేదీ నుంచి మూఢం రావడంతో పాటు దాదాపు 116 రోజుల వరకు వివాహ, శుభకార్యాలలకు విరామం కల గనుంది.

దీంతో ఇప్పటికే నిశ్చయ తాంబూలాలు అందుకున్న జంటల తల్లిదండ్రులు ఈ పదిరోజుల్లో ఉన్న ముహూర్తాల్లో పెళ్లిళ్లు జరిపేందుకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ప్రధానంగా ఈనెల 21, 24, 29 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉండటంతో వే లాది జంటలు వివాహ బంధంతో ఒక్కటి కానున్నట్టు పురోహితులు తెలిపారు. ఈ ముహూర్తాలు దాటితే మళ్లీ ఆగస్టు 6 వరకు వేచి ఉండాల్సిందేనని అంటున్నా రు. పుష్కరాలు జరిగే కృష్ణానది పరివాహక ప్రాంతాల వారికైతే ఈ గడువు ఆగస్టు 23 వరకు ఉందని చెబుతున్నారు.
 
శ్రీవారి క్షేత్రంలో సందడి
ఈనెలాఖరు వరకు జరుగనున్న వివాహాలకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల (చిన్నతిరుపతి) శ్రీవారి క్షేత్రం వేదిక కానుంది. ఇప్పటికే పెళ్లి బృందాలు క్షేత్రంలోని కల్యాణ మండపాలు, సత్రాలు, కాటేజీలు, గదులను ముందస్తుగా బుక్ చేసుకున్నారు. దీంతో వెనుక వచ్చే వారికి కష్టాలు తప్పనట్టే. శేషాచలకొండపైన, దిగువన ఈనెల 21, 22, 24, 29 తేదీల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి కల్యాణ మండపాలకు విద్యుద్దీపాలంకారాలు, అలాగే పచ్చిపూల మండపాలు వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఈ నెలలో ముహూర్తాలు కొన్నే ఉండటంతో పెళ్లి సామాగ్రి ధరలకు రెక్కలొచ్చాయి. పురోహితులకు, ట్రావెల్స్‌కు డిమాండ్ ఏర్పడింది. వివాహాన్ని అట్టహాసంగా జరుపుకోదలచిన వారు ఖర్చును సైతం లెక్కచేయడం లేదు. ఇప్పటికే చిన్నతిరుపతి క్షేత్రంలో వివాహ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
 
ఆగస్టు 6 వరకు వివాహాలకు బ్రేక్
ప్రస్తుతం చైత్రమాసం కొనసాగుతోంది. ఈ నెలాఖరు నుంచి శ్రావణంలో సగభాగం ముగిసే వరకు ముహూర్తాలు లేవు. ఈనెల 30 నుంచి జూలై 13 వరకు శుక్రమౌఢ్యం ఉందని పురోహితులు చెబుతున్నారు. ఆ వెంటనే ఆషాఢమాసం వస్తుందని, దాన్ని శూన్యమాసంగా భావించి వివాహాలు జరపరని పండితులు తెలిపారు. ఆ తర్వాత వచ్చే శ్రావణం శుభప్రదం కావడంతో ఆగస్టు 6 నుంచి వివాహ ముహూర్తాలు ఉన్నాయన్నారు.
 
పురోహితులు.. వివాహ సామగ్రికి డిమాండ్
జిల్లాలో వివాహాలు పెద్ద సంఖ్యలో జరుగుతుండడంతో వివాహ సామగ్రికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కల్యాణ మండపాలు ఇప్పటికే బుక్ కాగా పురోహితులు, షామియానా, లైటింగ్, పూలకు, పూల వేదికలు సెట్టింగ్‌లకు, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లకు గిరాకీ నెలకొంది.  
 
నెలల వారీగా ముహూర్తాలు ఇలా
ఏప్రిల్ : 20, 21, 22, 24  27, 29 తేదీల్లో ముహూర్తాలు
మే :  శుక్లమౌడ్యమి కావడంతో ముహుర్తాలు లేవు
జూన్ :  గురుమౌఢ్యమి కావడంతో ముహుర్తాలు లేవు
జూలై    :    ఆషాడం కావడంతో ముహూర్తాలు లేవు
ఆగస్టు    :    శ్రావణమాసంలో 6 నుంచి 27వ తేదీ వరకు ముహూర్తాలు ఉన్నాయి
సెప్టెంబర్     :    భాద్రపదం కావడంతో ముహర్తాలు ఉండవు
అక్టోబర్    :    ఆశ్వీయుజంలో 5 నుంచి 21 వరకు ముహూర్తాలు ఉన్నాయి
నవంబర్    :    కార్తీకంలో 2 నుంచి 24వ తేదీ వరకు ముహూర్తాలు ఉన్నాయి
డిసెంబర్    :    మార్గశిరంలో 3 నుంచి 22 వరకు ముహూర్తాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement