Marriage Dates
-
హ్యాపీ వెడ్డింగ్.. నగరంలో పెళ్లి సందడి మొదలు
గ్రేటర్లో పెళ్లి సందడి మొదలైంది. వచ్చే నెల నుంచి వివాహ ముహూర్తాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నగరంలోని కన్వెన్షన్ సెంటర్లు, బాంకెట్ హాళ్లు, కమ్యూనిటీ సెంటర్లకు డిమాండ్ ఏర్పడింది. మరోవైపు వధూవరులు పెళ్లి షాపింగ్‌లతో నగరంలోని జ్యువెలరీ షోరూమ్‌లు, షాపింగ్ మాళ్లలో రద్దీ మొదలైంది.. అంగరంగ వైభవంగా వివాహ వేడుకలను తీర్చిదిద్దేందుకు వెడ్డింగ్ ప్లానర్లు, అలంకరణ డిజైనర్లు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ముహూర్తాలు ఇవే.. దీపావళి తర్వాతి నవంబర్ 12 నుంచి ఫిబ్రవరి వరకూ వివాహాలకు శుభ ముహూర్తాలని పండితులు చెబుతున్నారు. నవంబర్ 12, 13, 17, 22, 23, 25, 26, 28, 29 తేదీల్లో వివాహాలకు శుభ ముహూర్తాలుగా ఉన్నాయి. అలాగే డిసెంబర్ 3, 4, 5, 9, 10, 11, 14, 15 తేదీలు కూడా శుభప్రదమే. దీంతో నగరంలో పెళ్లి హడావుడి మొదలైంది.హాళ్లు.. హౌస్‌ఫుల్.. ఓ వైపు పెళ్లి సందడి.. మరోవైపు నూతన సంవత్సర వేడుకలు కూడా రానుండటంతో చాలా మంది వివాహ కుటుంబాలు ఒకటి రెండు నెలల ముందే రిసార్ట్స్, హోటళ్లలోని ఫంక్షన్ హాళ్లను బుకింగ్ చేసుకున్నారు. కన్వెన్షన్ సెంటర్లు, కమ్యూనిటీ హాళ్లలో బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. కొంపల్లి, శామీర్‌పేట, తుర్కపల్లి, తిమ్మాపూర్, షాద్‌నగర్, మొయినాబాద్, చేవెళ్ల, ఘట్కేసర్ వంటి శివారు ప్రాంతాల్లోని కన్వెన్షన్ సెంటర్లు, రిసార్ట్‌లతో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నానక్‌రాంగూడ, గచి్చ»ౌలి వంటి ప్రధాన నగరంలోని స్టార్ హోటళ్లలోని బాంకెట్, పార్టీ హాల్స్ అన్నీ ఇప్పటికే హౌస్‌ఫుల్ అయ్యాయి. కూరగాయల ధరలు పెరగడంతో.. కూరగాయల ధరలు పెరుగుదల కూడా పెళ్లింట భారంగా మారింది. టమోట, బెండకాయ, ఉల్లిగడ్డ, మిర్చిలతో పాటు వంట నూనె, పన్నీర్ వంటి ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఫుడ్ క్యాటరర్స్ ప్లేట్‌కు రూ.350 నుంచి రూ.1,500 వరకూ చార్జ్ చేస్తున్నారు. ఇక మాంసాహార భోజనమైతే అంతకుమించి అన్నట్లు ఉంది. థీమ్స్, కాన్సెప్ట్‌లతో బిజీ.. ఉన్నత వర్గాల కుటుంబాలు, ఉద్యోగస్తులైన వధూవరులు ప్రత్యేకమైన థీమ్‌లు, కాన్సెప్‌్టలతో మండపాల అలంకరణ కోరుతున్నారు. ప్రీ–వెడ్డింగ్ ఫొటో షూట్లకూ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆయా పెళ్లి వేడుకలు, ఫొటో షూట్లు వైభవంగా, సజావుగా జరగడానికి ఈవెంట్, వెడ్డింగ్ ప్లానర్లు, ఫొటో గ్రాఫర్లు బిజీ బిజీలో గడుపుతున్నారు. మరోవైపు కళ్యాణ మండపాల నిర్వాహకులు సుమారు 300 నుంచి 700 మంది అతిథులు హాజరయ్యేలా వేడుకలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం బాంకెట్ హాల్, పార్టీ లాన్స్, కన్వెన్షన్ సెంటర్ల అద్దె రోజుకు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయి.ప్రీ వెడ్డింగ్ షూట్స్ షురూ.. వివాహ వేదికలు లగ్జరీగా ఉండాలని వధూవరులు భావిస్తున్నారు. ఖర్చుకు వెనకాడట్లేదు. వారి అభిరుచులకు తగ్గట్టుగా, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మండపాలు, వేదికలు ఉండేలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. లావెండర్, వింటేజ్ వంటి థీమ్‌లతో ప్రాంగణాలను అద్భుతంగా అలంకరిస్తున్నారు. ఇక ప్రీ–వెడ్డింగ్ షూట్స్‌తో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో చారి్మనార్, గోల్కొండ కోట, రామోజీ ఫిల్మ్ సిటీ, చౌమోహల్లా ప్యాలెస్, తారమతి బారాదరి, బొటానికల్ గార్డెన్, కుతుబ్షాయి టూంబ్స్ వంటి ప్రాంతాల్లో ప్రీ–వెడ్డింగ్ షూట్స్‌తో సందడి నెలకొంది. దీంతో పాటు ఫుడ్ క్యాటరర్స్, మెహందీ ఆరి్టస్ట్‌లు, ఫొటోగ్రాఫర్లు, బాజా భజంత్రీలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.శానిటైజేషన్, భద్రతకే అధిక ప్రాధాన్యం..పెళ్లి సీజన్‌తో పాటు న్యూ ఇయర్ కూడా రానుండటంతో రిసార్ట్‌లోని వెడ్డింగ్ జోన్స్, హోటళ్లలోని బాంకెట్, పార్టీ లాన్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. అతిథులకు వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులూ కాకుండా శానిటైజేషన్, భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ తరహా ఈవెంట్ సెంటర్లు ఇప్పటికే చాలా వరకూ బుక్ అయ్యాయి. – డాక్టర్ కిరణ్, సీఈఓ, సుచిరిండియా గ్రూప్ -
నేటి నుంచి శుభ గడియలు షురూ!
సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి నేటి నుంచి మొదలు కానుంది. జూన్, జులై, ఆగస్టు నెలల్లో శుభముహూర్తాలు ఉన్నా.. కరోనా సెకండ్‌వేవ్‌తో ఎక్కువ వివాహాలు జరుగలేవు. దీనికి తోడు ప్రభుత్వం కరోనా నిబంధనలు ప్రకటించడంతో అనేక పెళ్లిళ్లు అక్టోబర్, నవంబర్‌కు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం దసరా నుంచి శుభముహూర్తాలు ఆరంభం కావటంతో అక్టోబర్ 17 నుంచి ఉపనయనాలు, గృహప్రవేశాలు, వివాహాలు తదితర శుభముహూర్తాలకు అనుకూలమైన రోజులు ఉన్నాయి. దీంతో శుభకార్యాలు ప్రారంభం కావడంతో అన్ని రకాల వ్యాపారాలకు చేతి నిండా పని దొరకనుంది. కల్యాణ మండపాలకు కళ.. గత మూడు నెలల నుంచి ముహూర్తాలు లేకపోవటంతో కల్యాణ మండపాలు ఖాళీగా కన్పించాయి. కరోనా కారణంతో వాయిదా పడ్డా వివాహాలు ఈ ముహూర్తాల్లో చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. శుభ ముహూర్తాలు ప్రారంభం కావడంతో కల్యాణ మండపాలకు శుభకార్యాల కళ సంతరించనుంది. అశ్వినీ నక్షత్రంతో పౌర్ణిమ రావడంతో ఆశ్వయుజ మాసం అన్ని రకాల శుభముహూర్తాలకు అనుకూలమని పెద్దలు చెబుతారు. కృతికా నక్షత్రంతో పౌర్ణమి రావడంతో కార్తీక మా సంలో చేసే దానాలు, ధార్మికపూజలు, వ్రతాలు ఆ ధ్యాత్మిక చింతనతో పాటు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయని కార్తీక పురాణం పేర్కొంటుంది. అందుకే ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే శుభముహుర్తా ల్లో శుభకార్యాలు చేయడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. శుభకార్యాలకు అనువు... ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసాల్లో పెళ్లిళ్లు ఇతర కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ మాసా ల్లో వివాహాలు చేసుకుంటే అఖండ సౌభాగ్యం, సుసంతానం కలుగుతుందని పురాణాలు చెబుతు న్నాయి. –గుణవంత్‌రావు జోషి, వేద పండితుడు ముహూర్త తేదీలు ఇవే.. అక్టోబర్ 17, 18. 20, 30, నవంబర్ 14, 21, 22, 29, డిసెంబర్ 8, 10, 11, 22, 26 ఫిబ్రవరి 3,5, 6, 7, 10, 14, 16, 17, 18. -
మే 13 తర్వాతే మళ్లీ మంచి రోజులు
సాక్షి, హైదరాబాద్: ఒకదాని వెంట ఒకటిగా గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమిలు కలిసి రావటంతో కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఏకంగా 115 రోజులపాటు శుభ ముహూర్తాలు లేకుండా పోయాయి. దీంతో వరసగా మూడున్నర నెలలపాటు పెళ్లి భాజాలకు విరామమే. జనవరి ఏడుతో చివరి మంచి ముహూర్తం ముగియనుండగా, మళ్లీ మే 14 నుంచి బలమైన ముహూర్తాలు మొదలు కానున్నాయి. జనవరి 8 దశమి ముగుస్తుంది. ఆ తర్వాత సంక్రాంతి పీడ దినాలుగా భావిస్తూ శుభకార్యాలు నిర్వహించరు. జనవరి 14 పుష్య శుద్ధ పాఢ్యమి నుంచి ఫిబ్రవరి 12 వరకు శూన్యమాసం కొనసాగనుంది. ఈ సమయంలో శుభ దినాలు ఉండవని పండితులు పేర్కొంటున్నారు. అదే సమయంలో జనవరి 15 పుష్య శుద్ధ విదియ నుంచి ఫిబ్రవరి 12 మాగ శుద్ధ పాఢ్యమి వరకు 29 రోజులపాటు గురు మౌఢ్యమి కొనసాగనుంది. మళ్లీ ఫిబ్రవరి 14 మాగ శుద్ధ తదియ నుంచి మే 4 చైత్య బహుళ అష్టమి వరకు ఏకంగా 80 రోజుల పాటు శుక్ర మౌఢ్యమి ఏర్పడనుంది. ఆ తర్వాత మరో పది రోజులపాటు శుభ దినాలున్నా బలమైన ముహూర్తాలు లేవు. తిరిగి మే 14 నుంచి బలమైన ముహూర్తాలు మొదలవుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ రెండు మూఢముల మధ్య రెండు రోజుల విరామం ఉన్నా, అవి బలమైన ముహూర్తాలకు అవకాశం లేనివేనని పండితులు పేర్కొంటున్నారు. ఆ తర్వాతే బలమైన ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. మళ్లీ జూలై 4 నుంచి మొదలయ్యే అషాఢమాసం ఆగస్టు 11 వరకు కొనసాగనుంది. ఇది కూడా శుభముహూర్తాలు లేని సమయ మే. ఇలా 2021లో ముహూర్తాలకు కొరతే ఏర్పడనుంది. బంధువులను పిలుచుకోవడం సాధ్యం కాకపోవడంతో కరోనా సమయంలో చాలా మంది శుభకార్యాలు నిర్వహించుకోలేదు. ఇప్పుడు కాస్త కోవిడ్ ప్రభావం తగ్గినా జనవరి 7 తర్వాత మంచి ముహూర్తాలు లేవు. దీంతో తప్పని పరిస్థితిలో పెళ్లిళ్లు నిర్వహించుకుంటున్నారు. లేదంటే 4 నెలల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. శుభ ముహూర్తాలకు ఇన్ని రోజుల విరామం రావటానికి గురు, శుక్ర మౌఢ్యమిలు కలిసి రావటమే కారణమని, ఆ సమయంలో శుభకార్యాలకు దూరంగా ఉండటమే మంచిదని ప్రముఖ పౌరాణికులు శ్రవణ్‌కుమార్ శర్మ పేర్కొన్నారు. రెండు మౌఢ్యమిలు కలిసి రావటం అరుదే.. ‘ఇలా వరసగా రెండు మూఢాలు కలిసి రావటం ప్రత్యేకమేమీ కానప్పటికీ అరుదుగా మాత్రమే సంభవిస్తుంది. దీన్ని శాస్త్ర ప్రకారం చెడు చేసే కాలంగా భావించాల్సిన అవసరమేమీ లేదు.’ – శృంగేరీ ఆస్థాన పౌరాణికులు బాచంపల్లి సంతోషకుమారశాస్త్రి -
3 ముళ్లు 7 అడుగులు 10 రోజులు..
మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వాలనుకునే జంటలకు ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మరో పదిరోజులు మాత్రమే మిగిలాయి. ఈ నెలాఖరు వరకు మాత్రమే ముహూర్తాలు ఉండడంతో జిల్లాలో పెళ్లిళ్ల సందడి నెలకొంది. ఈ నెల 21, 22, 24, 29 తేదీల్లో వేల జంటలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటికానున్నాయి. 29వ తేదీ అనంతరం 116 రోజులు వివాహాలు, శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. * నెలాఖరు వరకే వివాహ ముహూర్తాలు * ఏప్రిల్ 30 నుంచి ఆగస్టు 30 వరకు బ్రేక్ * జిల్లా వ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి ద్వారకాతిరుమల/జంగారెడ్డిగూడెం రూరల్ : ఈ నెలాఖరు వరకే వివాహ ముహూర్తాలు ఉండడంతో జిల్లా అంతటా పెళ్లిళ్ల సందడి నెలకొంది. 30వ తేదీ నుంచి మూఢం రావడంతో పాటు దాదాపు 116 రోజుల వరకు వివాహ, శుభకార్యాలలకు విరామం కల గనుంది. దీంతో ఇప్పటికే నిశ్చయ తాంబూలాలు అందుకున్న జంటల తల్లిదండ్రులు ఈ పదిరోజుల్లో ఉన్న ముహూర్తాల్లో పెళ్లిళ్లు జరిపేందుకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ప్రధానంగా ఈనెల 21, 24, 29 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉండటంతో వే లాది జంటలు వివాహ బంధంతో ఒక్కటి కానున్నట్టు పురోహితులు తెలిపారు. ఈ ముహూర్తాలు దాటితే మళ్లీ ఆగస్టు 6 వరకు వేచి ఉండాల్సిందేనని అంటున్నా రు. పుష్కరాలు జరిగే కృష్ణానది పరివాహక ప్రాంతాల వారికైతే ఈ గడువు ఆగస్టు 23 వరకు ఉందని చెబుతున్నారు. శ్రీవారి క్షేత్రంలో సందడి ఈనెలాఖరు వరకు జరుగనున్న వివాహాలకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల (చిన్నతిరుపతి) శ్రీవారి క్షేత్రం వేదిక కానుంది. ఇప్పటికే పెళ్లి బృందాలు క్షేత్రంలోని కల్యాణ మండపాలు, సత్రాలు, కాటేజీలు, గదులను ముందస్తుగా బుక్ చేసుకున్నారు. దీంతో వెనుక వచ్చే వారికి కష్టాలు తప్పనట్టే. శేషాచలకొండపైన, దిగువన ఈనెల 21, 22, 24, 29 తేదీల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి కల్యాణ మండపాలకు విద్యుద్దీపాలంకారాలు, అలాగే పచ్చిపూల మండపాలు వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నెలలో ముహూర్తాలు కొన్నే ఉండటంతో పెళ్లి సామాగ్రి ధరలకు రెక్కలొచ్చాయి. పురోహితులకు, ట్రావెల్స్‌కు డిమాండ్ ఏర్పడింది. వివాహాన్ని అట్టహాసంగా జరుపుకోదలచిన వారు ఖర్చును సైతం లెక్కచేయడం లేదు. ఇప్పటికే చిన్నతిరుపతి క్షేత్రంలో వివాహ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఆగస్టు 6 వరకు వివాహాలకు బ్రేక్ ప్రస్తుతం చైత్రమాసం కొనసాగుతోంది. ఈ నెలాఖరు నుంచి శ్రావణంలో సగభాగం ముగిసే వరకు ముహూర్తాలు లేవు. ఈనెల 30 నుంచి జూలై 13 వరకు శుక్రమౌఢ్యం ఉందని పురోహితులు చెబుతున్నారు. ఆ వెంటనే ఆషాఢమాసం వస్తుందని, దాన్ని శూన్యమాసంగా భావించి వివాహాలు జరపరని పండితులు తెలిపారు. ఆ తర్వాత వచ్చే శ్రావణం శుభప్రదం కావడంతో ఆగస్టు 6 నుంచి వివాహ ముహూర్తాలు ఉన్నాయన్నారు. పురోహితులు.. వివాహ సామగ్రికి డిమాండ్ జిల్లాలో వివాహాలు పెద్ద సంఖ్యలో జరుగుతుండడంతో వివాహ సామగ్రికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కల్యాణ మండపాలు ఇప్పటికే బుక్ కాగా పురోహితులు, షామియానా, లైటింగ్, పూలకు, పూల వేదికలు సెట్టింగ్‌లకు, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లకు గిరాకీ నెలకొంది. నెలల వారీగా ముహూర్తాలు ఇలా ఏప్రిల్ : 20, 21, 22, 24 27, 29 తేదీల్లో ముహూర్తాలు మే : శుక్లమౌడ్యమి కావడంతో ముహుర్తాలు లేవు జూన్ : గురుమౌఢ్యమి కావడంతో ముహుర్తాలు లేవు జూలై : ఆషాడం కావడంతో ముహూర్తాలు లేవు ఆగస్టు : శ్రావణమాసంలో 6 నుంచి 27వ తేదీ వరకు ముహూర్తాలు ఉన్నాయి సెప్టెంబర్ : భాద్రపదం కావడంతో ముహర్తాలు ఉండవు అక్టోబర్ : ఆశ్వీయుజంలో 5 నుంచి 21 వరకు ముహూర్తాలు ఉన్నాయి నవంబర్ : కార్తీకంలో 2 నుంచి 24వ తేదీ వరకు ముహూర్తాలు ఉన్నాయి డిసెంబర్ : మార్గశిరంలో 3 నుంచి 22 వరకు ముహూర్తాలు ఉన్నాయి. -
మోగనున్న పెళ్లిబాజా
* నేటి నుంచి మాఘమాసం ప్రారంభం * రేపటి నుంచి వివాహ ముహూర్తాలు పిఠాపురం : గోదావరి పుష్కరాల కారణంగా ఆరు నెలలకు పైగా మూగబోయిన పెళ్లిబాజాలు ఇకనుంచి మోగనున్నాయి. పెళ్లిళ్లు ఎక్కువగా జరిగే మాఘమాసం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. దీంతో వివాహాలు కూడా మొదలు కానున్నాయి. బుధవారం నుంచే ముహూర్తాలు కూడా ఆరంభమవుతున్నాయి. దీంతో ఆరు నెలలుగా నిశ్శబ్దంగా ఉన్న కల్యాణ మండపాలు బాజాభజంత్రీలతో వివాహ మంత్రాల ఘోషతో మార్మోగనున్నాయి. బంధుమిత్రుల సందళ్లతో కళకళలాడనున్నాయి. నిశ్చితార్థాలు, వివాహాలతోపాటు గృహప్రవేశాలు, శంకుస్థాపనల వంటి శుభకార్యాలకు కూడా పలువురు సన్నాహాలు చేసుకుంటున్నారు. జిల్లాలో పేరొందిన కల్యాణ మండపాలు ఇప్పటికే బుక్ అయ్యాయి. పురోహితులు, షామియానాలు, మైక్, లైటింగ్, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, కేటరర్స బిజీగా మారిపోయారు.