మే 13 తర్వాతే మళ్లీ మంచి రోజులు | No Suitable Date For Hindu Marriage For 4 Months From January 7 | Sakshi
Sakshi News home page

4 నెలలు శుభముహూర్తాలే లేవు 

Published Thu, Dec 31 2020 1:40 AM | Last Updated on Thu, Dec 31 2020 2:44 PM

No Suitable Date For Hindu Marriage For 4 Months From January 7 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒకదాని వెంట ఒకటిగా గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమిలు కలిసి రావటంతో కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఏకంగా 115 రోజులపాటు శుభ ముహూర్తాలు లేకుండా పోయాయి. దీంతో వరసగా మూడున్నర నెలలపాటు పెళ్లి భాజాలకు విరామమే. జనవరి ఏడుతో చివరి మంచి ముహూర్తం ముగియనుండగా, మళ్లీ మే 14 నుంచి బలమైన ముహూర్తాలు మొదలు కానున్నాయి. జనవరి 8 దశమి ముగుస్తుంది. ఆ తర్వాత సంక్రాంతి పీడ దినాలుగా భావిస్తూ శుభకార్యాలు నిర్వహించరు. జనవరి 14 పుష్య శుద్ధ పాఢ్యమి నుంచి ఫిబ్రవరి 12 వరకు శూన్యమాసం కొనసాగనుంది.

ఈ సమయంలో శుభ దినాలు ఉండవని పండితులు పేర్కొంటున్నారు. అదే సమయంలో జనవరి 15 పుష్య శుద్ధ విదియ నుంచి ఫిబ్రవరి 12 మాగ శుద్ధ పాఢ్యమి వరకు 29 రోజులపాటు గురు మౌఢ్యమి కొనసాగనుంది. మళ్లీ ఫిబ్రవరి 14 మాగ శుద్ధ తదియ నుంచి మే 4 చైత్య బహుళ అష్టమి వరకు ఏకంగా 80 రోజుల పాటు శుక్ర మౌఢ్యమి ఏర్పడనుంది. ఆ తర్వాత మరో పది రోజులపాటు శుభ దినాలున్నా బలమైన ముహూర్తాలు లేవు. తిరిగి మే 14 నుంచి బలమైన ముహూర్తాలు మొదలవుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ రెండు మూఢముల మధ్య రెండు రోజుల విరామం ఉన్నా, అవి బలమైన ముహూర్తాలకు అవకాశం లేనివేనని పండితులు పేర్కొంటున్నారు.

ఆ తర్వాతే బలమైన ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. మళ్లీ జూలై 4 నుంచి మొదలయ్యే అషాఢమాసం ఆగస్టు 11 వరకు కొనసాగనుంది. ఇది కూడా శుభముహూర్తాలు లేని సమయ మే. ఇలా 2021లో ముహూర్తాలకు కొరతే ఏర్పడనుంది. బంధువులను పిలుచుకోవడం సాధ్యం కాకపోవడంతో కరోనా సమయంలో చాలా మంది శుభకార్యాలు నిర్వహించుకోలేదు. ఇప్పుడు కాస్త కోవిడ్‌ ప్రభావం తగ్గినా జనవరి 7 తర్వాత మంచి ముహూర్తాలు లేవు.

దీంతో తప్పని పరిస్థితిలో పెళ్లిళ్లు నిర్వహించుకుంటున్నారు. లేదంటే 4 నెలల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. శుభ ముహూర్తాలకు ఇన్ని రోజుల విరామం రావటానికి గురు, శుక్ర మౌఢ్యమిలు కలిసి రావటమే కారణమని, ఆ సమయంలో శుభకార్యాలకు దూరంగా ఉండటమే మంచిదని ప్రముఖ పౌరాణికులు శ్రవణ్‌కుమార్‌ శర్మ పేర్కొన్నారు.  

రెండు మౌఢ్యమిలు కలిసి రావటం అరుదే.. 
‘ఇలా వరసగా రెండు మూఢాలు కలిసి రావటం ప్రత్యేకమేమీ కానప్పటికీ అరుదుగా మాత్రమే సంభవిస్తుంది. దీన్ని శాస్త్ర ప్రకారం చెడు చేసే కాలంగా భావించాల్సిన అవసరమేమీ లేదు.’  – శృంగేరీ ఆస్థాన పౌరాణికులు బాచంపల్లి సంతోషకుమారశాస్త్రి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement