నాలుగు నెలలు.. ముహూర్తాల్లేవ్..! | No Ceremonies and weddings for four months | Sakshi
Sakshi News home page

నాలుగు నెలలు.. ముహూర్తాల్లేవ్..!

Published Sun, May 31 2015 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

నాలుగు నెలలు.. ముహూర్తాల్లేవ్..!

నాలుగు నెలలు.. ముహూర్తాల్లేవ్..!

* అప్పటి వరకూ పెళ్లిళ్లు, శుభకార్యాలు అన్నీ బంద్
* గోదావరి తీర ప్రాంతాల్లో 2016 ఆగస్ట్ వరకూ కరువే
* జూన్ 11 తర్వాత ముహూర్తాలు లేవంటున్న పండితులు

 
సాక్షి, హైదరాబాద్: మీ అమ్మాయికో.. అబ్బాయికో త్వరలో పెళ్లి చేయాలని భావిస్తున్నారా.. అయితే మరో నాలుగు మాసాలు ఆగాల్సిందే. పెళ్లి అనేకాదు.. ఏ శుభకార్యం చేయాలన్నా వేచిచూడక తప్పని పరిస్థితి. జూన్ 11 దాటితే మంచి ముహూర్తాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఒకవైపు రెండు ఆషాఢాలు(అధిక, నిజ ఆషాఢం).. మరోవైపు గోదావరి పుష్కరాలు.. తరుముకొస్తుండటంతో శుభకార్యాల కోసం కనీసం నాలుగు నెలలు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఏటా ఒకటే ఆషాఢ మాసం ఉంటుంది. ఆ సమయంలో పెళ్లి ముహూర్తాలు ఉండవు. అయితే ఈసారి రెండు ఆషాడాలు(అధిక, నిజ ఆషాఢం) వస్తున్నాయి.
 
 దీంతో రెండు నెలలు ముహూర్తాలు ఉండవు. ఇక జూలై 14న గురుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఇదే రోజూ గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో అంతా పెద్దల్ని స్మరించుకుంటూ తర్పణం సమర్పిస్తారు. ఇలా పుష్కరాలు ప్రారంభమైన నాలుగైదు మాసాల వరకు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసంలోనూ పెళ్లి ముహూర్తాలు పెద్దగా లేవు. ఇక గోదావరి నదీ తీరప్రాంతంలోని వారైతే 2016 ఆగస్ట్ వరకూ ఎలాంటి శుభకార్యాలు చేయకూడదట. మిగిలిన వారు మాత్రం దసరా తర్వాత పెళ్లిళ్లు, గృహప్రవేశాలు చేసుకోవచ్చని పండితులు అభిప్రాయపడుతున్నారు.
 
 తప్పని పరిస్థితుల్లో కొన్ని దోషాలున్నా పర్లేదు
 ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి గోదావరి పుష్కరాలు వస్తాయి. పుష్కరాలు దాటిన తర్వాత ఏడాది పాటు ఎలాంటి ముహూర్తాలూ ఉండవు. అయితే ఉత్తమ పక్షం లేకపోయినప్పటికీ.. కొన్ని దోషాలు ఉన్నా.. తప్పని పరిస్థితుల్లో ముహూర్తాలు అంగీకారమే అని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యులు, ప్రముఖ జోతిష్య పండితుడు డాక్టర్ సీవీబీ సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు.
 
 గోదావరి తీరప్రాంత వాసులకే..
 జూన్ 11 తర్వాత ఆగస్టు 2016 వరకూ మంచి రోజులు లేవని కొంతమంది పండితులు చెపుతుంటే.. అలాంటిదేమీ లేదు నవంబర్ నుంచి ముహూర్తాలు పెట్టుకోవచ్చని మరికొందరు వాదిస్తున్నారు. అయితే ఇది గోదావరి తీరప్రాంత వాసులకే వర్తిస్తుందని, మిగతా వారు దసరా తర్వాత శుభకార్యాలు చేసుకోవచ్చని ప్రముఖ జోతిష్య పండితుడు సింహంభట్ల సుబ్బారావు అభిప్రాయపడ్డారు.
 
11 రోజులూ.. వేలాదిగా పెళ్లిళ్లు..

 మరోవైపు జూన్ 11 తర్వాత ముహూర్తాలు లేకపోవడంతో ఈ 11 రోజుల్లోనే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు చేసేందుకు వేలాదిమంది సిద్ధమయ్యారు. వరుసగా పెళ్లిళ్లు ఉండటంతో ఫంక్షన్ హాళ్లు, పురోహితులకు మాంచి డిమాండ్ ఏర్పడింది. నగరంలో మూడు వేలకుపైగా ఫంక్షన్‌హాళ్లు ఉండగా అన్నీ ఇప్పటికే బుక్కయ్యాయి. ఫంక్షన్‌హాళ్లు బుక్కైపోవడంతో బస్తీల్లో ఖాళీ స్థలం కన్పిస్తే చాలు మండపం వేసేస్తున్నారు. ఇక పురోహితులకు సామాన్య, మధ్యతరగతి వారు వివాహానికి రూ.1,116 నుంచి  రూ.10,116 వరకూ, ధనికులైతే బంగారాన్ని, ఎన్‌ఆర్‌ఐలైతే డాలర్లను సంభావనగా సమర్పించుకోవాల్సి వస్తోంది. మరోవైపు బ్యాండ్ బాజాలు, వంటవాళ్లు, డెకరేటర్లు, ఈవెంట్‌మేనేజర్లు కూడా ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement