
‘కుందూ–పెన్నా’ కోసం కుస్తీ
అధికార పార్టీలో వరద టెన్షన్
కాలువ పనుల కోసం పోటాపోటీగా టెండర్లు
నిబంధనలపై విమర్శలు
టెండర్లకు నేడే చివరి రోజు
ప్రొద్దుటూరు: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా తెలుగు తమ్ముళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంట్రాక్టు పనుల కోసం పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. ఎలాగైనా ఈ పనులు దక్కించుకుని నాలుగు కోట్లు వెనకేసుకోవాలనే విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కుందూ–పెన్నా వరద కాలువ టెండర్ల నిర్వహణ రాష్ట్రంలోనే చర్చంశనీయంగా మారింది. ప్రొద్దుటూరు ప్రజలకు తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో దివంగత సీఎం ముఖ్యమంత్రి వైఎస్సార్ 2007 మే 24న కుందూ–పెన్నా వరద కాలువ కోసం రూ.72.53 కోట్లు మంజూరుచేశారు. 2007 సెప్టెంబర్ 21న ఈ కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా భూసేకరణపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇందుకు సంబంధించి రూ.24 కోట్లు ఖర్చుపెట్టారు. ఇదిలావుండగా కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మళ్లీ ఈ కాలువ పనులకు రూ.183.21 కోట్లు మంజూరు చేస్తూ 2014 ఫిబ్రవరి 6న ఉత్తర్వులు జారీచేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక 11–4–2016న ఈ పనులను సాగించేలా ఉత్తర్వులు జారీచేశారు. ఇందులోభాగంగానే ప్రస్తుతం రూ.112 కోట్లతో టెండర్లు పిలిచారు.
పనుల కోసం పైరవీలు
ఎలాగైనా ఈ పనులను దక్కించుకునేందుకు అధికారపార్టీ నేతలు కుస్తీ పడుతున్నారు. ఈపనులు తమకే దక్కేలా పోట్లదుర్తి సోదరులు మంత్రాంగం నడుపుతున్నారు. టెండర్ నిబంధనలను తమకు అనుకూలంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని గమనించిన పలువురు నేతలు ఈ పనుల కోసం పోటీపడుతున్నారు. గతంలో ఈ పనులకు సంబంధించిన కాంట్రాక్టు పనులు చేసిన స్థానిక సీనియర్‌నేత తనయుడు ఎలాగైనా మళ్లీ ఈ పనులు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీనియర్‌నేతకు పోటీగా వ్యవహరిస్తున్న స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్లు ఇద్దరు కూడా ఈ పనుల కోసం టెండర్లు వేసేందుకు పూనుకున్నారు. తన నియోజకవర్గంలో జరిగే ఈ పనులకు అడ్డు రావద్దని సీనియర్ నేత పోట్లదుర్తి సోదరులను కలిసినట్లు తెలుస్తోంది. అయితే గతంలో మైదుకూరు–బద్వేలు రోడ్డు కాంట్రాక్టు పనుల కోసం మీ తనయుడు పోటీపడి తమకు వ్యతిరేకంగా టెండర్ వేశాడని, అలాంటప్పుడు తాము టెండర్ వేయకుండా ఎలా ఉంటామని పోట్లదుర్తి సోదరులు సీనియర్ నేతకు తేల్చిచెప్పినట్లు సమాచారం. ఈ కారణంగానే పోట్లదుర్తి సోదరులు సీనియర్ నేత మధ్య సత్సంబంధాలు లేవనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలావుండగా ఈ పనుల కోసం సీనియర్ నేత పార్టీ పెద్దలను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. మంత్రి స్థాయిలో కూడా ఇప్పటికే చర్చలు జరిగాయి. స్థానిక మున్సిపాలిటీకి చెందిన కీలక నేత కూడా సీనియర్‌నేతకు వ్యతిరేకంగా టెండర్ వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఏది ఏమైనా కుందూ–పెన్నా కుస్తీ పోటీల్లో ఎవరు నెగ్గుతారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రూ.112 కోట్ల ఈ కాంట్రాక్టు పనులకు సంబంధించి శుక్రవారం సాయంత్రంలోపు టెండర్లు కోడ్ చేయాల్సి ఉంది.
ఇంజనీరింగ్ అధికారులు టీడీపీ నేతలకు తొత్తులుగా మారారు
జిల్లా, రాష్ట్రస్థాయి ఇరిగేషన్ ఇంజనీరింగ్ ముఖ్య అధికారులు టీడీపీ నేతలకు తొత్తులుగా మారారని బీజేపీ నాయకుడు కొవ్వూరు బాలచంద్రారెడ్డి విమర్శించారు. ఆయన గురువారం రాత్రి సాక్షితో మాట్లాడుతూ కేవలం అధికార పార్టీ నేతల కోసమే టెండర్ల నిబంధనలు విధించారన్నారు. అసలు ఈ నిబంధనలు విధించడాన్ని బట్టి చూస్తే బయటి వ్యక్తులు టెండర్లలో పాల్గొనకుండా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోందని చెప్పారు. ఈ పనుల నిర్వహణకు సంబంధించి గడువులోగా పనులు పూర్తి చేయకపోతే జరిమానా విధించవచ్చన్నారు. అలాంటిది కాకుండా అసలు నిబంధనలే మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో తాను ఎప్పుడు ఇలాంటి పరిస్థితిని చూడలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ అధికారులను కలిసి టెండర్లు వాయిదా వేయాలని కోరుతానని తెలిపారు. లేనిపక్షంలో ఇష్టారాజ్యంగా నిబంధనలు విధించిన ఇంజనీరింగ్ అధికారులపై కోర్టులో కేసు వేస్తానని చెప్పారు.