డబ్బు పోయే... ప్రాణమూ పోయే!
- వికటించిన ప్రైవేటు వైద్యం
- జ్వరం సోకిన సమయంలో జరగని రక్తప రీక్షలు
- మలేరియా మహమ్మారికి వివాహిత బలి
- ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న ఆమె కుమారుడు
- ఆలస్యంగా వెలుగుచూసిన సంఘటన తీవ్ర విషాదంలో ఓ గిరిజన ఉద్యోగి కుటుంబం
మలేరియా మహమ్మారిని ప్రైవేట్ వైద్యుడు సకాలంలో గుర్తించకపోవడంతో ఓ వివాహిత మృత్యువాతపడింది. ఆమెను బతికించుకునేందుకు భర్త, కుటుంబ సభ్యులు రూ. లక్షల్లో ఖర్చుపెట్టినా ఫలితం లేకపోయింది. జ్వర లక్షణాలతో బాధపడుతున్న ఆమెకు, కుమారుడికీ మొదటి రోజే రక్త పరీక్షలు చేసి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు. ప్రస్తుతం ఆమె కుమారుడు సెరిబ్రల్ మలేరియాతో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. రక్తపరీక్షలను నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో ఈ ఉదంతమే నిదర్శనం.
హుకుంపేట : మండలంలోని రాప పంచాయతీ గ్రామానికి చెందిన కాండ్రంగి రాజారావు డుంబ్రిగుడ హాస్టల్‌లో వార్డెన్‌గా పనిచేస్తున్నారు. వేసవి సెలవులకు ఏప్రిల్‌లో భార్య దేముడమ్మ, ముగ్గురు పిల్లలతో రాప గ్రామానికి వచ్చారు. ఈ నెల 7న ఉద్యోగరీత్యా నివాసం ఉంటున్న అరకులోయకు వెళ్లారు. దేముడమ్మ, నానిలకు జ్వరం తీవ్రంగా ఉండడంతో, మరుసటిరోజు అరకులోయలోని ఓ ప్రైవేట్ ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద వైద్యసేవలు పొందారు.
అయితే సదరు వైద్యుడు ఆరోజు రక్త పరీక్షలు జరపలేదని, వైరల్ జ్వరాలుగా భావించి, నివారణకు మందులు ఇచ్చారని వార్డెన్ రాజారావు గురువారం ఈ గ్రామాన్ని సందర్శించిన ‘సాక్షి’కి తెలిపారు. 9వతేదీన జ్వరం తగ్గడంతో దేముడమ్మ, నానిలు ఊపీరిపీల్చుకున్నారు. తిరిగి పదో తేదీ ఉదయం మరలా వీరిద్దరికీ జ్వరతీవ్రత అధికమవ్వడంతో అదే ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకు వెళ్లగా రక్తపరీక్షలు జరిపితే టైఫాయిడ్‌గా చెప్పి మళ్లీ మందులు లిచ్చాడు.
12వ తేదీ నాటికి వీరిద్దరికీ జ్వరం తగ్గకపోగా పరిస్థితి మరింత విషమించింది. సాయంత్రం హుటాహుటిన వీరిని మళ్లీ అదే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా మరోసారి రక్తపరీక్షలు జరిపితే దేముడమ్మకు మలేరియా లక్షణాలు ఉన్నట్టు తేల్చారు. నానికి మాత్రం ఏ జ్వరమో నిర్ధారించలేకపోయారు. పైగా, గాజువాకలోని మంచి ఆస్పత్రి ఉందని, వెంటనే అక్కడికి తీసుకుపోవాలని సూచించడంతో వార్డెన్ రాజారావు రాత్రికి రాత్రే భార్య, కుమారుడిని తరలించి, ఆస్పత్రిలో చేర్చారు.
విషయంగానే కుమారుడి ఆరోగ్యం !
అక్కడి వైద్యులు మళ్లీ రక్తపరీక్షలు జరపగా, ఇద్దరికీ మలేరియా ఉన్నట్టు నిర్ధారించడంతో పాటు, ప్రాణాంతక సెరిబ్రల్ మలేరియగా మారిందని నిర్ధారించి ఉన్నత వైద్యసేవలు ప్రారంభించారు. 13వ తేదీ ఉదయం వరకు ఆస్పత్రిలో కోలుకుంటున్న ఈ తల్లీబిడ్డల ఆరోగ్యం ఒక్కసారిగా మాటలు కూడా ఆడలేని పరిస్థితికి దిగజారింది. ప్లేట్‌లెట్స్ శాతం పూర్తిగా పడిపోయాయని వైద్యులు చెప్పడంతో మరింత ఉన్నత వైద్యసేవలకు విశాఖపట్నంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడి వైద్యులు కూడా ఉన్నత వైద్యసేవలు కల్పించినప్పటికీ దేముడమ్మను బతికించలేకపోయారు. అయితే నానికి ప్లేట్‌లెట్స్ కాస్త మెరుగ్గా ఉండడంతో వైద్యసేవలు కొనసాగిస్తున్నారు. అయినా పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పినట్లు రాజారావు తెలిపారు. అంతంతమాత్రంగా వచ్చే జీతంతో బతుకుతున్న ఓ గిరిజన ఉద్యోగి కుటుంబంలో ఓ వైపు డబ్బు పోవడమే కాకుండా.. మరోవైపు విలువైన ప్రాణాలు పోవడంపై కుటుంబ సభ్యులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్య దేముడమ్మ మరణం, ఆస్పత్రిలో ఆరోగ్యం విషయమించి ఉన్న పెద్దకుమారుడు నాని పరిస్థితితో వార్డెన్ రాజారావు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
విశాఖ ఆస్పత్రి నుంచి రాపలో ఇంటి వద్ద మరో ఇద్దరు బిడ్డలను చూసేందుకు గురువారం వచ్చి, వారిని పట్టుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రైవేటు వైద్యుడి వద్దకు వెళ్లడమే తాను చేసిన పాపంగా కుమిలిపోతున్నారు.. వైద్యసేవల్లో ఆర్‌ఎంపీ వైద్యుడి చిన్నపాటి నిర్లక్ష్యం ఈ కుటుంబానికి శాపమైందని గ్రామస్తులు కంటతడిపెడుతున్నారు.
ఏజెన్సీలో వెలుగులోకి రాని ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయని, జ్వరం సోకిన రోజునే మలేరియా రక్తపరీక్షలు జరిపి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైద్యసేవలను వినియోగించుకోవాలని వారు సూచిస్తున్నారు.