25 నుంచి జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు
కడప స్పోర్ట్స్ :
రాష్ట్రంలోని ఏకైక క్రీడాపాఠశాల అయిన వైఎస్‌ఆర్ క్రీడాపాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే జిల్లాస్థాయి ఎంపికలు ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్నారు. కడప నగరంలోని డీఎస్‌ఏ అవుట్‌డోర్ స్టేడియంలో ఈ ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ ఎంపికల్లో పాల్గొననున్నారు.
ఎంపిక ప్రక్రియ ఇలా...
4వ తరగతిలో 20 బాలురు, 20 బాలికల సీట్లకు ఎంపికలు నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్రస్థాయి ఎంపికలను కడప నగరంలోని డా.వైఎస్‌ఆర్ క్రీడాపాఠశాలలోనిర్వహిస్తారు. రాష్ట్రస్థాయి ఎంపికలు ఈనెల 27 నుంచే ప్రారంభమవుతున్నా.. వైఎస్‌ఆర్ జిల్లావిద్యార్థులకు ఈనెల 29న నిర్వహించనున్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను
ఎంపికచేసి వీరికి ఆగస్టు 1 నుంచి 3వ తేదీ వరకు కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తారు. అనంతరం తుది ఎంపికలు నిర్వహించి 4వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికలకు హాజరయ్యే విద్యార్థులకు ఎత్తు, బరువుతో పాటు 30 మీటర్ల ప్లయింగ్‌స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్‌జంప్, 6 ఇంటూ 10 మీటర్స్ షటిల్‌రన్, స్టాండింగ్ వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ, మెడిసినల్‌బాల్ త్రో, 800 మీటర్ల పరుగు పందెం
అంశాల్లో ప్రతిభను పరీక్షించి పాయింట్లు కేటాయిస్తారు. 4వ తరగతిలో ప్రవేశం పొందగోరే విద్యార్థులు 8 సంవత్సరాలు పూర్తయి 2008 ఫిబ్రవరి 28 నుంచి 2009 మార్చి1 మధ్యలో జన్మించిన వారు అర్హులు. దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాలతో పాటు ఫొటోలు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.