దర్జాగా తిరుగుతున్నారు! | District recognition of 16 thousand vehicles | Sakshi
Sakshi News home page

దర్జాగా తిరుగుతున్నారు!

Published Wed, Jun 8 2016 8:50 AM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM

దర్జాగా తిరుగుతున్నారు!

దర్జాగా తిరుగుతున్నారు!

అనంతపురానికి చెందిన రమేష్ ఆరేళ్ల క్రితం ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేశాడు. నిబంధనల ప్రకారం నెల రోజుల్లో శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే దర్జాగా తిరుగుతున్నాడు.. అతడే కాదు.. జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో వాహనదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్ల (టీఆర్)తోనే రోడ్డుపైకి వస్తున్నారు. కొందరికైతే టీఆర్ కూడా లేదు. అటు పోలీసులు, ఇటు రవాణాశాఖ అధికారుల తనిఖీలు తూతూమంత్రంగా సాగుతుండటంతో ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది.          
 
* రిజిస్ట్రేషన్‌పై వాహనదారుల అనాసక్తి
* జిల్లాలో 16 వేల వాహనాల గుర్తింపు
* ప్రభుత్వాదాయానికి గండి

అనంతపురం టౌన్ : జిల్లాలో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఇందులో ద్విచక్రవాహనాలు, కార్లు వంటికే అధికంగా ఉంటున్నాయి. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తున్న యజమానులు వాటి రిజిస్ట్రేషన్‌కు ముందుకు రావడం లేదు. కొనుగోలు జరుగుతున్న మేరకు రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ప్రస్తుతం అన్ని రకాల వాహనాలు 5 లక్షలకు పైగా ఉన్నాయి.

ఇందులో సుమారు 16 వేల వాహనాలు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ప్రధానంగా 80 శాతం ద్విచక్రవాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్)తోనే కాలం వెళ్లదీస్తున్నాయి. నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన వాహనానికి తప్పనిసరిగా నెలరోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నెల దాటితే రూ.20, ఆరు నెలలు దాటితే రూ.100 నామమాత్రపు రుసుం ఉండడంతో వాహనదారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రభుత్వానికి వీటి నుంచి వచ్చే ఆదాయం కోల్పోతుంది.

ఈనేపథ్యంలో రవాణాశాఖ అధికారులు ‘స్పెషల్ డ్రైవ్’ పేరుతో జిల్లా వ్యాప్తంగా మూడ్రోజులుగా తనిఖీలు చేపడుతున్నారు. టీఆర్‌తో మొదటి సారి వాహనం పట్టుబడితే రూ.2 వేలు, రెండో సారి పట్టుబడితే సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.  
 
నేరాలకు కొత్త వాహనాలు  
చోరీలు, అక్రమ రవాణా ఇతరత్రా వాటికి కొన్ని అసాంఘిక శక్తులు కొత్త వాహనాలను ఉపయోగిస్తున్నారు. నేరాలు చేయాలన్నా నూతన వాహనాలనే ఎంచుకుంటున్నారు. నేరాలు జరిగినప్పుడు వాహనాన్ని ఎవరైనా చూసినా దానికి నంబర్ ప్లేట్ లేకపోవడంతో అసలు సమస్య ఎదురవుతోంది.
 
వాహనదారులకూ నష్టమే

వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే యజమానికే నష్టం జరుగుతుందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. వాహనచట్టం ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ లేని వాహనం చోరీకి గురయితే ఎలాంటి కేసులు నమోదు చేయరు. పోలీసులు వాహనం గుర్తించడం కష్టంగా ఉంటుంది. ప్రమాదాలు జరిగినప్పుడు వాహన యజమానే వాటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. బీమా చెల్లింపులకు సైతం ఇబ్బందులు తప్పవు. పోలీసు కేసుల్లో కూడా ఇరుక్కోవాల్సి ఉంటుంది.
 
సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం
నిబంధనలను అతిక్రమించి టీఆర్ నంబర్‌తోనే తిరుగుతున్న వాహనాల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు సుమారు 100  కేసులు నమోదు చేశాం. స్వచ్ఛందంగా 440 మంది రిజిస్ట్రేషన్ చేరుుంచుకున్నారు. మొదటిసారి జరిమానా విధిస్తున్నాం. పరిస్థితి అలాగే ఉంటే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం.  జిల్లా వ్యాప్తంగా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాహనదారులు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే. వాహనదారులను చైతన్యవంతం చేసేందుకు గ్రామపంచాయతీలు, ఎంపీడీఓ కార్యాలయూల్లో ఫెక్లీలు ఏర్పాటు చేస్తున్నాం.
- వి.సుందర్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement