- ఆర్డీఓ క్వార్టర్లే.. కలెక్టర్ క్వార్టర్లు
- కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులకు మరమ్మతులు
- డీఈఓ కార్యాలయానికి రంగులు
ముమ్మరంగా జిల్లా కార్యాలయాల పనులు
Published Sun, Oct 2 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
మహబూబాబాద్ : మానుకోట జిల్లా కార్యాలయాల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పట్టణ శివారు ఇందిరానగర్‌కాలనీ సమీపంలోని వైటీసీ భవనాన్ని కలెక్టరేట్‌గా కేటాయించగా కార్యాలయానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం, ఇతర పనులు కొనసాగుతున్నాయి. బీఎస్‌ఎన్ఎల్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు పనులు చేస్తున్నారు. కలెక్టర్ క్వార్టర్స్‌గా ఆర్డీఓ క్వార్టర్స్‌నే కేటాయించగా మరమ్మతులు సాగుతున్నాయి. ఇక ఆర్డీఓ నివాసానికి అద్దెకు పట్టణంలోని పలు ఇళ్లను చూస్తున్నారు. కాగా ప్రస్తుత జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ మానుకోటకు కలెక్టర్‌గా వస్తున్నారనే ప్రచారం సాగుతోంది. వైటీసీ భవనంలోని కలెక్టర్ చాంబర్, గదుల మధ్య గోడల నిర్మాణ పనులను ఇటీవల జేసీ పరిశీలించారు. ఈ ప్రాంతంపై జేసీ పూర్తి అవగాహన ఉండటం వల్ల ఆయనే వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పట్టణ శివారులోని ఐటీఐ భవనాన్ని ఎస్పీ కార్యాలయానికి కేటాయించారు.
దీంతో ఈ భవనం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ.15లక్షలు, రోడ్డు నిర్మాణానికి రూ.25లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఇటీవల ప్రకటించారు. ఈ భవనం ఆవరణలో బోర్లు వేయించడం, మరుగుదొడ్లు, ఇతర పనులు వేగంగా సాగుతున్నాయి. వెంకటేశ్వర్లబజార్‌లోని ఓ ఇంటిని ఎస్పీ క్యాంపు కార్యాలయంగా అధికారులు పరిశీలించారు. కానీ ఆ భవనానికి అద్దె భారీగా ఉండటంతో మరోచోట చూడాలని అధికారులు యోచిస్తున్నారు. డీఎస్పీ కార్యాలయాన్నే ఎస్పీ క్యాంప్ ఆఫీస్‌గా ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. తొర్రూరు రోడ్‌లోని ఎస్పీ కార్యాలయం సమీపంలోని బీసీకాలనీ వద్ద ఉన్న ఒక ఇంటిని కూడా పోలీసులు చూసినట్లు సమాచారం. ఆ ఇంటిని డీఎస్పీ కార్యాలయంగా ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లోనే ఎస్పీ క్యాంపు కార్యాలయం ఏర్పాటుపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. పట్టణంలోని ఎంఈఓ కార్యాలయాన్నే డీఈఓ కార్యాలయంగా కేటాయించగా, రంగులు వేస్తున్నారు. శనివారం నుంచి ఆ భవనానికి రంగులు వేస్తున్నారు. ఏదేమైనా మానుకోటలో జిల్లా ఏర్పాటు వాతావరణం నెలకొంది.
Advertisement
Advertisement