దివీస్‌పై ఆగని పోరు | divis villagers rally | Sakshi
Sakshi News home page

దివీస్‌పై ఆగని పోరు

Published Thu, Feb 23 2017 11:55 PM | Last Updated on Fri, Sep 28 2018 4:30 PM

దివీస్‌పై ఆగని పోరు - Sakshi

దివీస్‌పై ఆగని పోరు

బీచ్‌ రోడ్డుపై సీపీఎం, బాధిత గ్రామాల ప్రజల భారీ ర్యాలీ  
అణచివేతకు పోలీసుల వ్యూహం... ఆందోళనకారుల ప్రతిఘటన
ప్రహరీ వద్ద బైఠాయించి నిరసన 
85 మంది అరెస్టు
పోలీసుల దమనకాండపై ఎమ్మెల్యే రాజా ఆగ్రహం
 
ఓ రోజు ముందు నుంచే దివీస్‌ బాధిత గ్రామాల్లో పోలీసులు మోహరించారు. నిఘా కెమెరాలతో హడావుడి ... బూట్ల శబ్దాలు ... లాఠీల ఝళిపింపులు ... పోలీసు వ్యాన్ల హారన్లు ...ముందుకు వస్తే ఖబడ్దారంటూ హెచ్చరికలతో హోరెత్తించారు. బయటకు వస్తే చాలు అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించి ఆందోళనపై ఉక్కుపాదం మోపి భయోత్పాతం సృష్టించారు. అయినా బాధితుల ఆగ్రహం ఆగలేదు ...కట్టలు తెంచుకొని రోడ్డెక్కింది. సేకరించిన భూముల దరిదాపుల్లోకి రానీయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా ఛేదించుకొని దూసుకువచ్చి బైఠాయించారు. ఇంకానా ఇకపై చెల్లదంటూ పిడికిలి బిగించారు.   
 
తొండంగి : కోన ప్రాంతంలో రైతులు సాగులో ఉన్న భూములతోపాటు హైకోర్టు స్టేటస్కో భూముల్లోకి వెళ్లేందుకు మార్గం లేకుండా దివీస్‌ యాజమాన్యం ప్రహరీ నిర్మాణాలు చేపట్టడంతో సీపీఎం ఆధ్వర్యంలో గురువారం బాధిత గ్రామాల ప్రజలు తమ భూముల్లోకి ప్రవేశించేందుకు ఉప్పెనలా ఎగిసిపడ్డారు. ఇప్పటివరకూ జరిగింది చాలు ఇకపై మీ ఆటలు సాగనివ్వమంటూ ఆగ్రహించారు. దివీస్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా బాధిత గ్రామాలైన పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం, నర్శిపేట తదితర గ్రామాల ప్రజలు కొంతకాలం నుంచి ఉద్యమిస్తున్నారు. దివీస్‌ను ల్యాబొరేటరీస్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ, ఈ ప్రాంతంలో దీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న భూములను ఖాళీ చేసేది లేదంటూ కొంత మంది రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టేటస్కో పొందారు. మరికొంత మంది ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం తీసుకోకుండా గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాల ప్రకారం భూములను సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రాంతంలో దివీస్‌ యాజమాన్యం బలవంతంగా ప్రహరీ నిర్మాణాన్ని ప్రారంభించింది. స్టేటస్కో, సాగు భూముల్లో ఏవిధంగా నిర్మాణాలు ప్రారంభిస్తారని బాధితులు దివీస్‌ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్వంలో రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఎటువంటి చర్యలు లేకపోవడంతో దివీస్‌ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు వారం రోజులపాటు కొత్తపాకల గ్రామంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష ప్రారంభించిన రెండు రోజుల తర్వాత రెవెన్యూ అధికారులు వచ్చి భూములను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే విచారణ పూర్తయిందని, అక్రమ నిర్మాణాలు లేవని తెలిపారు. దీంతో అధికారులంతా దివీస్‌కు వత్తాసు పలుకుతున్నారని, తమకు న్యాయం జరగలేదని భావించడంతో సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, సీఐటీయూ జిల్లా నాయకుడు వేణుగోపాల్, దివీస్‌ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు కలిసి 23వ తేదీలోపు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోతే గురువారం భూముల్లోకి వెళ్తామని పిలుపునిచ్చారు.
నడుం బిగించిన మహిళలు...
దివీస్‌ ప్రాంతంలోకి వెళ్లే రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నప్పటికీ మహిళలు పోలీసులను లెక్కచేయకుండా పరుగులు పెడుతూ దివీస్‌ నిర్మించిన ప్రహరీ గోడ భూముల్లోకి ప్రవేశించారు. పంపాదిపేట ఐద్వా సంఘం అధ్యక్షురాలు అంగుళూరి నాగ కృష్ణవేణి, కొత్తపాకలకు చెందిన ఐద్వా సంఘం ప్రెసిడెంట్‌ అంగుళూరి సుశీల, అంగుళూరి బేబి, సత్యవతి, సంధ్య, వీరలక్షి్మలతోపాటు మరికొంత మంది ఆ ప్రహరీ వద్ద బైఠాయించారు. ‘మా భూముల్లోకి మార్గం కల్పించకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం అన్యాయమంటూ నినాదాలు చేశారు. గోడను తొలగించాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు, మహిళలకు మధ్య వాగ్వివాదం జరిగింది. అక్కడే బైఠాయించిన మహిళలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి వాహనంలోకి ఎక్కించారు. 
సొమ్మసిల్లిన మహిళలు...
ఈడ్చుకువెళ్తున్న సమయంలో సంధ్య అనే మహిళ సొమ్మసిల్లిపోయింది. అయినా సరే పోలీసులు వ్యాన్‌ వద్దకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా వీరలక్ష్మి అనే మరో మహిళ పోలీసులను ప్రతిఘటించి వాగ్వాదానికి దిగారు. 108కు సమాచారం అందించి, ఆసుపత్రికి తీసుకువెళ్లాలని డిమాండ్‌ చేసింది. అయినా పోలీసులు లెక్కచేయకుండా మినీ వ్యాన్లో ఎక్కించి యు.కొత్తపల్లి పోలీస్‌స్టేçÙ¯ŒSకు తరలించారు. 
వ్యూహాత్మకంగా అడుగులు...
పంపాదిపేట గ్రామంలో దివీస్‌ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు మట్ల ముసలయ్యను అరెస్టు చేయడం గ్రామ ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో వారంతా సరుగుడు తోటలు వెంబడి కొత్తపాకల గ్రామానికి చేరుకున్నారు. అక్కడ వారంతా ఒకేచోట ఉన్నారని పోలీసులకు సమాచారం అందడంతో కొత్తపాకల గ్రామ శివారు సరుగుడు తోటల వద్దకు పోలీసులంతా వెళ్లారు. ఇది తెలుసుకున్న సీపీఎం నాయకులు శేషుబాబ్జి, వేణుగోపాల్, బాధిత గ్రామాల ప్రజలంతా కొత్తపాకల గ్రామం నడిబొడ్డు నుంచి ర్యాలీగా బయలుదేరి బీచ్‌ రోడ్డుపైకి వచ్చారు. కొత్తపాకల శివారులో ఉండిపోయిన పోలీసులు మెయిన్‌ సెంటర్‌కు వచ్చే సరికి ప్రజలంతా రోడ్డుపై పాదయాత్ర నిర్వహిం చారు. దివీస్‌ ప్రతిపాదిత ప్రాంతానికి ‘దివీస్‌ మాకొద్దంటూ’ నినాదాలు చేస్తూ తరలివెళ్లారు. కాలినడకను వెళ్తున్న వారిని పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అరెస్టు అయిన వారిపై కేసులు...
బాధిత గ్రామాల ప్రజలను పోలీసులు అరెస్టు చేసి పలు కేసులు నమోదు చేశారు. అయితే డ్రోన్‌ కెమేరా, ఇతర వీడియో చిత్రీకరణ, ఫొటోల ఆధారంగా మరికొంత మందిపై కేసులు పెట్టేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం.
చుట్టుముట్టి నిర్బంధం..
దివీస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న కమిటీ సభ్యుడు మట్ల ముసలయ్య గురువారం ఉదయం టీ తాగేందుకు ఇంటి సమీపంలో ఉన్న హోటల్‌కు వస్తుండగా సుమారు రెండు వందల మంది పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించిన మరో వ్యక్తిని కూడా జీపులో ఎక్కించి కిర్లంపూడి పోలీస్‌స్టేష‌న్‌కు తరలించారు. పంపాదిపేట ప్రధాన సెంటర్‌ కమ్యూనిటీ హాలు, ఇతర ప్రాంతాల్లో భారీగా పోలీసులు పహారా కాసి బయటకు వస్తే అరెస్టు చేస్తామని పరోక్షంగా హెచ్చరించారు. 
పోలీసుల మోహరింపు..
దివీస్‌ ప్రతిపాదిత ప్రాంతంలోని భూముల్లోకి వెళ్తామని రైతులు ప్రకటించిన నేపథ్యంలో అడ్డుకునేందుకు పోలీసులు బుధవారం నుంచి తీర ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పంపాదిపేట, తాటియాకులపాలెం, నర్శిపేట, కొత్తపాకల తదితర ప్రాంతాలను పోలీసులు మోహరించారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్‌ను అమలు చేశారు. గుంపులుగా కనిపిస్తే కేసులు పెడతామని ఆటో ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
డ్రోన్‌ కెమేరాలతో నిఘా...
ఉద్యమంపై పూర్తి స్థాయిలో నిఘా వేసేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నారు. అడిషనల్‌ ఎస్పీ దామోధర్, పెద్దాపురం డీఎస్పీ రాజశేఖర్, తుని, తుని రూరల్, ప్రత్తిపాడు సీఐలతోపాటు ఎస్సైలు పంపాదిపేట చేరుకున్నారు. అక్కడ గ్రామస్తుల కదలికలను గమనించేందుకు డ్రోన్‌ కెమేరాను ఆకాశంలోకి పంపి ఏరియల్‌ వ్యూ చిత్రీకరించారు. అయినప్పటికీ పోలీసుల కంటపడకుండా పంపాదిపేట ప్రజలు కొత్తపాకల గ్రామానికి చేరుకున్నారు.
సీపీఎం, ఇతర నాయకుల అరెస్టు...
ర్యాలీగా వెళ్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి, సీఐటీయూ నాయకుడు ఎన్‌.వేణుగోపాల్, ఇతర నాయకులు సింహాచలం, అప్పారెడ్డి, దివీస్‌ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు గంపల దండు, అంగుళూరి శ్రీను తదితరులతోపాటు మరో 85 మందిని పోలీసులు అరెస్టు చేసి వ్యాన్లలో అన్నవరం పోలీస్‌స్టేష‌న్‌ కు తరలించారు. ఉద్యమ నాయకులను చొక్కాలు పట్టుకొని పోలీసులు లాక్కెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement