- దేశవ్యాప్తంగా ఒకే గుర్తింపు కార్డు
- జిల్లాలో 1.50 లక్షల లబ్ధిదారులు
- దివ్యాంగులు, గుర్తుంపుకార్డులు, బిల్లు ఆమోదం
దివ్యాంగులకు భవ్యమైన రోజులు!
Published Fri, Jan 20 2017 10:57 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM
రామచంద్రపురం రూరల్ :
దివ్యాంగులకు మంచిరోజులు రానున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే గుర్తింపు కార్డు ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇటీవల నిర్వహించిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దివ్యాంగుల హక్కుల బిల్లు–2016 కు ఆమోదం లభించింది. వివిధ రంగాల్లో దివ్యాంగులకు కల్పించే రిజర్వేష¯ŒS సైతం నాలుగు శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో మొదటి విడత గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించనుంది.
బిల్లులో ఏమేం ఉన్నాయి?
దివ్యాంగులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు, వివక్ష చూపితే రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 వేలు జరిమానా విధించనున్నారు. గతంలో ఒక రాష్ట్రంలో పొందిన సదరమ్ సర్టిఫికెట్ మరో రాష్ట్రంలో చెల్లుబాటు కాకపోయేది. దేశవ్యాప్తంగా ఒకే గుర్తింపు కార్డుతో ఈ సమస్యకు పరిష్కారం చూపారు. ఈ బిల్లుతో తూర్పుగోదావరి జిల్లాలో ఒక లక్షా యాభై వేల మంది దివ్యాంగులు లబ్ధి పొందనున్నారు.
మూడు రకాల కార్డులు
వైకల్య శాతాన్ని బట్టి దివ్యాంగులకు మూడు రకాల కార్డులు జారీ చేయనున్నారు. గతంలో వైకల్యం తక్కువ ఉన్నా సరే వైద్యులను ‘మంచి’ చేసుకుని దివ్యాంగులమనే సర్టిఫికెట్ పొందేవారు. ఇలాంటి సర్టిఫికెట్లతో వివిధ ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందుతున్న వారికి ఇక చెక్ పెట్టనున్నారు. 0–40 శాతం వైకల్యం ఉన్నవారికి తెల్లకార్డులు, 40–80 శాతం వైకల్యం ఉన్నవారికి పచ్చకార్డులు, 80 శాతానికి పైగా వైకల్యం ఉన్నవారికి నీలం రంగు కార్డులు జారీ చేయనున్నట్టు సమాచారం. ఈ ధృవీకరణ పత్రాలు ఇక నుంచి దేశవ్యాప్తంగా చెల్లుబాటు కానున్నాయి. ఆధార్ కార్డుల మాదిరిగా 18 అంకెల గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలోని దివ్యాంగుల వివరాలు ఆ¯ŒSలై¯ŒSలో పొందుపరిచారు.
లాభాలివీ..
కేంద్ర ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డుతో అనేక లాభాలున్నాయి. ఉద్యోగం కోసం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే సంక్షేమ పథకాలకు ప్రతిసారీ గుర్తింపు పత్రం జత చేయాల్సి ఉండేది. దీంతో డబ్బుతో పాటు సమయం వృథా అయ్యేది. ఇక నుంచి కొత్తగా జారీ చేసే 18 అంకెల గుర్తింపు కార్డు జత చేస్తే సరిపోతుంది. అందులో పేరు, ఊరు, విద్యార్హత, వైకల్య శాతం, పుట్టిన తేదీ, జిల్లా, రాష్ట్రంతో పాటు అన్ని వివరాలు పొందుపరచి ఉంటాయి. దీంతో ప్రభుత్వం అందజేసే పథకాలకు, ఆయా ఉద్యోగాలకు అర్హుడో, కాదో తెలిసిపోతుంది. ఈ గుర్తింపు కార్డుతో దివ్యాంగులు అన్ని రాష్ట్రాల బస్ సర్వీసుల్లో రాయితీ పాసులు పొందే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలపడంపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement