వినతిపత్రమిస్తున్న ఇల్లెందు ప్రజాప్రతినిధులు
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాల పునర్విభజన ప్రక్రియలో ఇల్లెందు నియోజకవర్గాన్ని ముక్కలు చేసి మూడు జిల్లాల్లో కలపాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని, ఈ ప్రాంతాన్ని డివిజన్ కేంద్రంగా చేయాలని ఇల్లందు ప్రాంత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆదివారం జాయింట్ కలెక్టర్ దివ్య, జెడ్పీ చైర్‌పర్సన్ కవితకు వినతిపత్రం ఇచ్చారు. పురాతన నియోజకవర్గమైన ఇల్లందుకు చారిత్రక ప్రాధాన్యముందని చెప్పారు. ఇల్లెందు ప్రాంతంలో విస్తృత స్థాయిలో బొగ్గు, ఇనుము, డోలమైట్, బెరైటిస్ తదితర విలువైన ఖనిజాలు ఉన్నాయన్నారు. ప్రజాభీష్టానికి విరుద్ధంగా విభజిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. నియోజకవర్గ మండలాలతోపాటు సింగరేణి, గుండాల మండలాలను కలిపి ఇల్లెందును నూతన రెవెన్యూ డివిజన్‌గా చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బయ్యారం, ఇల్లెందు, గుండాల జెడ్పీటీసీ సభ్యులు గౌని ఐలయ్య, చండ్ర అరుణ, గొగ్గెల లక్ష్మి, గుండాల ఎంపీపీ చాట్ల లక్ష్మి, సర్పంచులు ఉన్నారు.