పల్స్ సర్వేపై భయం వద్దు
ఏలూరు (మెట్రో): జిల్లాలో చేపట్టిన ప్రజాసాధికారి సర్వేపై ఎటువంటి భయం వద్దని, ప్రజా శ్రేయస్సు కోసమే సర్వే నిర్వహిస్తున్నామని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. స్థానిక శనివారపుపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మొక్కల పెంపకం, మినీ రైతుబజార్ల ఏర్పాటు వంటి అంశాలపై అధికారులతో బుధవారం ఆమె సమీక్షించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో సర్వేకు మంచి స్పందన వస్తోందని, సాంకేతిక సమస్యల వల్ల సర్వేలో కొంత జాప్యం జరుగుతోందని చెప్పారు. జాప్యం నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరామని చెప్పారు. ఈ ఏడాది రూ.418 కోట్లతో 18,400 ఇళ్లను సంక్రాంతిలోపు నిర్మించాలని అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలో 50 మినీ రైతుబజార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. జిల్లా అటవీ శాఖాధికారి ఎన్.నాగేశ్వరరావు, రేంజర్ ధనరాజ్, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి పాల్గొన్నారు.