హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
గుంతకల్లు రూరల్ : లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో భాగంగా మండలంలోని గుర్రబ్బాడు గ్రామంలో రెండు రోజుల పాటు హోరాహోరీగా సాగిన రాష్ట్ర స్థాయి రాతిదూలం లాగుడు పోటీలు శుక్రవారం ముగిశాయి. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి దాదాపు 33 జతల వృషభాలు పాల్గొన్న ఈ పోటీల్లో గుత్తి మండలం బేతాపల్లికి చెందిన రైతు ఓబులపతి వృషభాలు నిర్ణీత సమయంలో 5,523 అడుగుల దూరం రాతి దూలాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచి రూ.30 వేల ఫ్రైజ్‌మనీని సొంతం చేసుకున్నాయి.
అదేవిధంగా ఆత్మకూరు మండలం, రంగం పేట గ్రామానికి చెందిన రైతు అంకిరెడ్డి వెంకట్రామిరెడ్డి వృషభాలు రెండవ స్థానం, గుత్తి మండలం ఊబిచెర్ల గ్రామానికి చెందిన ఆముదాల వెంకట్రాముడు వృషభాలు మూడో స్థానం, కర్నూలు జిల్లా , ప్యాపిలి మండలం, జక్కసానిగుంట్ల కుచెందిన రైతు నాగేశ్వరయ్య వృషభాలు నాలుగో స్థానం, గంజికుంటకు చెందిన బైరెడ్డి అనిమిరెడ్డి వృషభాలు, కర్నూలు జిల్లా మామిల్లపల్లికి చెందిన చెక్కా శ్రీనివాసులు వృషభాలు సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాయి. గుత్తి గేట్స్ కళాశాల కరస్పాండెంట్ సుధీర్ రెడ్డి సౌజన్యంతో విజేతలకు వరుసగా రూ.25,000, రూ.20,000, రూ.15,000, రూ.10,000, రూ.5000 అందజేశారు.