‘అనంత’లో అలజడి
‘అనంత’లో అలజడి
Published Thu, Jul 21 2016 11:10 PM | Last Updated on Sat, Sep 29 2018 4:52 PM
– పరిటాల శ్రీరాం అనుచరులు గోపీనాయక్, వెంకటేశ్‌నాయక్ దారుణ హత్య
– పట్టపగలే నడిరోడ్డుపై హతమార్చిన దుండగులు
– ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రోద్భలంతోనే దారుణం జరిగిందంటున్న మృతుల బంధువులు
– అనంతపురం నాలుగో టౌన్ సీఐ సాయిప్రసాద్, ఎస్‌ఐ హేమంత్‌పైనా ఆరోపణలు
– రుద్రంపేటలో ఉద్రిక్తత, భారీ పోలీస్ బందోబస్తు
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
సాక్షిప్రతినిధి, /అనంతపురం సెంట్రల్: ‘అనంత’లో జరిగిన జంట హత్యల ఉదంతం కలకలం రేపింది. అనంతపురం నియోజకవర్గం రుద్రంపేటకు చెందిన టీడీపీ నేతలు గోపీనాయక్(27), వెంకటేశ్‌నాయక్(35) గురువారం దారుణహత్యకు గురయ్యారు. రుద్రంపేటకే చెందిన కొందరు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. వారి కథనం ప్రకారం... గోపీనాయక్ సోదరుని కుమారుడు వెంకటేశ్‌నాయక్. వరుసకు ఇద్దరూ తండ్రీకొడుకులు అవుతారు. వీరిద్దరూ రుద్రంపేటలో నివాసముంటున్నారు. అనంతపురంలో పని ముగించుకుని మధ్యాహ్నాం బైక్‌పై ఇంటికి బయలుదేరారు. వారి కదలికలను కనిపెట్టుకొని ఉన్న ప్రత్యర్థులు వారి వెనకాలే ఆటోలో అనుసరించారు. రుద్రంపేటకు వెళ్లిన తర్వాత ఎదురుగా మరో బైక్‌తో వచ్చిన వారు వీరిని ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు. వెంటనే ఆటోలో ఉన్న వారు కిందకు దిగి వేటకొడవళ్లు, ఇనుపరాడ్లతో ఇద్దరిపైనా దాడి చేయడంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. అనంతరం దుండగులు బొలేరో వాహనంలో ఆలమూరు రోడ్డు వైపునకు వెళ్లిపోయారు.
ఉలిక్కిపడిన ‘అనంత’
అనంతపురంలోని నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో పట్టపగలు నడిరోడ్డుపై జంటహత్యలు జరగడంతో రుద్రంపేటతో పాటు అనంతపురం ప్రజలు ఉలికి ్కపడ్డారు. జంట హత్యల విషయం క్షణాల్లో అంతటా తెలిసిపోవడంతో జనం భారీగా అక్కడికి చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు సైతం ఘటనాస్థలికి చేరుకుని విగతజీవులుగా మారిన తమ వారిని చూసి బోరున విలపించారు. గోపీనాయక్ భార్య కవిత, వెంకటేశ్‌నాయక్ భార్య సుప్రియ కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పెద్దాస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనతో రుద్రంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
దోస్తీ చెడింది... ప్రాణం పోయింది
గోపీనాయక్, వెంకటేశ్‌నాయక్ అదే ప్రాంతంలోని అక్కులప్ప, అమర్‌తో పాటు మరికొందరితో ఒక గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. రుద్రంపేట సమీపంలోని వికలాంగుల కాలనీలో ఇళ్లపట్టాల కోసం ఒక్కో వ్యక్తి నుంచి రూ.50 వేలు వసూలు చేశారు. ఈ విషయంలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో గోపీ, వెంకటేశ్ కలసి అక్కులప్ప, అమర్‌తో విభేదించారు. ఈ వ్యవహారం నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ వరకూ వెళ్లింది. రెండు వర్గాలను పోలీసులు బైండోవర్ చేశారు. ఈ క్రమంలో గురువారం జంట హత్యలు జరగడం గమనార్హం.
ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై ఆరోపణలు
జంట హత్యల వెనుక అనంతపురం ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి హస్తం ఉందంటూ వెంకటేశ్‌నాయక్ తండ్రి నారాయణనాయక్, గోపీనాయక్ సోదరుడు కుమార్‌నాయక్ ఆరోపించారు. నాలుగో పట్టణ ఎస్‌ఐ హేమంత్, సీఐ ప్రసాద్ ద్వారా తమపై వేధింపులకు పాల్పడ్డారని, చివరకు హత్యకు తెగించారని వారు గద్గద స్వరంతో అన్నారు.
బాధితులను కఠినంగా శిక్షిస్తాం: పరిటాల సునీత
హత్యకు గురైన గోపీ, వెంకటేశ్‌ను చూసేందుకు మంత్రి పరిటాల సునీత సర్వజనాస్పత్రిలోని మార్చురీకి వచ్చారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఫ్యాక్షనిజం సరైంది కాదని, ఫ్యాక్షనిజం అంతరించిపోతున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ హత్యలకు కారకులైనవారు ఎవరైనా, వారి వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షిస్తామన్నారు.
హత్యలకు కారణం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరే:
గోపీ, వెంకటేశ్ హత్యలకు కారణం అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరే. అతని నుంచి ప్రాణాపాయం ఉందని పోలీసులుకు గతంలోనే ఫిర్యాదు చేశాం. అయినా వారు స్పందించలేదు. మా తమ్ముడికి రెండుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రాణాపాయం ఉందని తెలిసినా, జనం లేకుండా గోపీ ఒక్కడే తిరిగేవాడు. ఎస్‌ఐ హేమంత్, సీఐ ప్రసాద్ సహాయంతో లోకల్ ఎమ్మెల్యే ఈ హత్యలు చేయించారు. నా వద్దక రమ్మని చెప్పాను. అయినా పరిటాల వర్గం వైపు పోతున్నారు. అని ఎమ్మెల్యే గతంలో హెచ్చరించారు. కానీ మా దారిలో మేం వెళ్లాం. చివరకు ఇలా జరిగింది. హత్యకు కారణం అక్కులప్ప, చంద్ర, చరణ్, స్టీఫెన్ రాథోడ్, అమర్, రామాంజి, పోతలయ్య, నగేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాం.
– నారాయణనాయక్, కుమార్ నాయక్(హతుల కుటుంబీకులు)
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
తొమ్మిది మందిపై కేసు నమోదు చేశాం
గోపీ నాయక్, వెంకటేశ్ నాయక్‌ను అదే కాలనీకి చెందిన అక్కులప్ప మరికొందరు హత్య చేశారు. అంతా స్నేహితులుగానే ఉండేవారు. ఇటీవల అభిప్రాయ భేదాలు వచ్చాయి. రెండు వర్గాలుగా విడిప్యోరు. వారిపై గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయి. హత్యలు జరిగిన వెంటనే గోపీనాయక్ సోదరుడు విజయ్‌కుమార్‌నాయక్ ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశాం. ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి ప్రమేయం ఉన్నట్లు మాకెవరూ ఫిర్యాదు చేయలేదు.
– మల్లికార్జున వర్మ, డీఎస్పీ, అనంతపురం
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
గోపీకి రక్షణ కల్పించాం
గోపీ నాయక్‌పై మూడు హత్య కేసులు ఉన్నాయి. నరసింహులు, నారాయణస్వామి, అచ్యుత్ అనే వ్యక్తుల హత్య కేసుల్లో ఇతను నిందితుడు. అమర్ గ్రూపునకు గోపీకి మధ్య విభేదాలున్నాయి. ఇద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపాం. గోపీకి నేనే రక్షణ కల్పించా. జాగ్రత్తగా ఉండాలని సూచించా.
– సాయిప్రసాద్, సీఐ, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్
––––––––––––––––––––––––––––––––––––––
Advertisement
Advertisement