ఆటోడ్రైవర్ నిజాయితీ
-
రూ 2లక్షలు విలువైన బంగారు నగలు అప్పగింత
-
అభినందించిన అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి
రాజమహేంద్రవరం క్రైం :
ఆటోలో ప్రయాణికులు మరచిపోయిన రూ. 2 లక్షల విలువైన బంగారు నగలను వారికి తిరిగి అప్పగించి ఆ ఆటోడ్రైవర్ తన నిజాయితీని నిరూపించుకున్నాడు. అతనిని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి. రాజకుమారి అభినందించారు. వివరాల్లోకి వెళితే.. గాంధీపురానికి చెందిన అరుణ, శ్రీనివాస్ వారి బంధువులు ఆదివారం రాత్రి జాగృతి బ్లడ్ బ్యాంక్ వద్దగల ఆటో స్టాండ్ వద్ద ఆటో ఎక్కి గోదావరి గట్టున ఉన్న శ్రీకన్య హోటల్ వద్ద ఆటో దిగి హోటల్‌లోకి వెళ్లిపోయారు. వారు పైకి వెళ్లాక ఆటోలో హ్యాండ్ బ్యాగ్ మరచిపోయిన సంగతి గుర్తించి కిందకు వచ్చేసరికి ఆటో కనిపించలేదు. దాంతో వారు త్రీ టౌన్ ఏఎస్సై శంకరరావు ఆధ్వర్యంలో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆటోలో ప్రయాణికులు హ్యాండ్ బ్యాగ్‌ను మరచిపోయిన విషయాన్ని తిరిగి ఆటోస్టాండ్‌కు వచ్చిన అనంతరం ఆటో డ్రైవర్ కె. భూషణం గుర్తించాడు. ఆయన ఆ బ్యాగ్‌ను ప్రకాష్‌నగర్ పోలీసులకు అప్పగించాడు. మంగళవారం ఆ హ్యాండ్ బ్యాగ్ ను త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు ఆటో డ్రైవర్ తీసుకురాగా ఆ బ్యాగ్‌ను అర్బన్‌జిల్లా ఎస్పీ బి. రాజకుమారి చేతుల మీదుగా బాధితులకు అప్పగించారు. ఆటో డ్రైవర్ భూషణం నిజాయితీని గుర్తించిన ఎస్పీ అతనికి నగదు బహుమతిని అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆటో డ్రైవర్ భూషణం ఆటోడ్రైవర్లందరికీ ఆదర్శంగా నిలిచాడని కొనియాడారు. రాజమహేంద్రవరం సెంట్రల్ డీఎస్పీ కులశేఖర్, త్రీటౌన్ సీఐ శ్రీ రామ కోటేశ్వరరావు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.