- టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క
కరువు తరుముకొస్తున్నా పట్టించుకోరా?
Published Tue, Aug 23 2016 12:10 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
వరంగల్: మూడేళ్లుగా అన్నదాత దిగాలు పడుతుంటే గోదావరి నదిపై ప్రాజెక్టులు కట్టేందుకు మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకుంటున్నామంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనసరి సీతక్క అన్నారు. సోమవారం హన్మకొండ బాలసముద్రంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మంత్రి హరీష్‌రావు ఒప్పందం చేసుకున్న నాటి నుంచి ఇప్పటిదాకా గోదావరిపై జల ప్రాజెక్టుల పనులు ఎంతమేరకు జరిగాయనేది వెల్లడించాలన్నారు. నీటిఎద్దడి కారణంగా జిల్లాలో పత్తి, మొక్కజొన్న ఇప్పటికే ఎండిపోగా, వరి కూడా ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దీనిపై దృష్టిసారించేందుకు అధికార పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సమయం లేదన్నారు. రాష్ట్రంలోని జలాలను సిద్ధిపేట, గజ్వేల్‌లకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఫలితంగా జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతం రైతులు ఇబ్బందిపడాల్సి వస్తోందన్నారు. దేవాదుల ప్రాంతం నుంచి తపాస్‌పల్లి వరకు నీటిని తరలించుకుపోతున్నారని ఆరోపించారు. ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయకుంటే చింతగట్టులోని ఎస్సారెస్పీ ప్రాజెక్టు కార్యాలయాన్ని ముట్టడిస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సమావేశంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్‌కుమార్, నాయకులు బాస్కుల ఈశ్వర్, మార్గం సారంగం, శ్రీరాముల సురేష్, రహీం, సంతోష్‌నాయక్, హన్మకొండ సాంబయ్య, జిల్లా అధికార ప్రతినిధి మార్క విజయ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement