ఎండిపోయిన మొక్కజొన్న
- ఖాళీ అవుతున్న పల్లెలు.. రైతుల వలసబాట
- గ్రామాల్లో కానరాని ఉపాధి పనులు
- చేసినా పనులకూ డబ్బులందని దుస్థితి
మెదక్: వరుస కరువులతో బోరుబావులు ఎండిపోయాయి.. సాగునీటి వనరులు వట్టిపోయాయి.. పచ్చని పొలాలు కళతప్పాయి.. పల్లెలన్నీ ఖాళీ అవుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ముందు కురిసిన వర్షాలకు సాగుచేసిన పంటలన్నీ ఎండిపోయాయి. దీంతో ఊళ్లో ఉపాధి లేక ఒక్కక్కరూ వలసబాట పడుతున్నారు. కొందరు క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఆగస్టులో 78 మిల్లీలీటర్ల వర్షపాతం
గడిచిన రెండేళ్లలో జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడంతో రైతన్నలు వలస వెళ్లి అడ్డాకూలీలుగా మారారు. కాగా, ఈసారైనా వర్షాలు కురవకపోతాయన్న ఆశతో తిరిగి ఊళ్లకు వచ్చారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే వేలాది రూపాయలు అప్పలు చేసి వర్షాధార పంటలైన మొక్కజొన్న, పెసర, కంది, సోయాబీన్‌ను జిల్లావ్యాప్తంగా సుమారు 5 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. అదేవిధంగా బోరుబావులు, నీటివనరుల ఆధారంగా 2.8 లక్షల హెక్టార్లలో వరి వేశారు.
కాగా, అడపాదడపా కురిసిన వర్షాలకు ఆరుతడి పంటలు ఏపుగా పెరిగినా.. మొక్కజొన్న, కంది, సోయాబీన్ గింజదశలోనే ఉన్నాయి. ఆగస్టులో సాధారణ వర్షపాతం 370 మిల్లీమీటర్ల కురవాల్సి ఉండగా.. కేవలం 78 మిల్లీమీటర్లే నమోదైంది. దీంతో పంటలన్నీ ఎండిపోయాయి. బోర్లలో నీటి ఊటలు అడుగంటి వరి సైతం అంతంతమాత్రంగానే సాగవుతోంది. దీంతో రైతులు మరోసారి అప్పుల బాధ తప్పదన్న వేదనతో వలస వెళ్తున్నారు. ఇప్పటికే పల్లెలు 60 శాతం ఖాళీ అయ్యాయి.
పల్లెలో ఉపాధి కరువు
వ్యవసాయంలో నష్టాలు మూటగట్టుకుంటున్న రైతులకు ఉపాధి దొరకడం లేదు. వలసల నివారణ కోసం ప్రవేశపెట్టిన ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. కొన్ని గ్రామాల్లో అప్పుడప్పుడూ చేసిన పనికి నెలల తరబడి కూలీ ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి.
అందని నష్టపరిహారం
వరుస కరువులతో తల్లడిల్లుతున్న రైతులకు ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం అందడం లేదు. ఇన్‌పుట్ సబ్సిడీలు సైతం కరువయ్యాయి. దీంతో చేసేది లేక రైతులు పల్లెల్ని వదిలి పట్టణాలకు వలస వెళ్తున్నారు.
చావస్తె బాగుండు బిడ్డా
నా వయస్సు 80 ఏళ్లు. వరుసగా కరువు పడుతుంది. రెండేళ్ల కిందట నా కొడుకు రాములు పట్నం పోయి కూలి చేసిండు. ఈ ఏడు ఇక్కడికి వచ్చి రెండు ఎకరాల్లో మక్క ఏసిండు. వర్షాలు లేక ఎండిపోయింది. మళ్లా కొడుకు, కోడలు, పిల్లలు పట్నం పోయారు. నాకు ఇనపడదు.. సరిగ్గా కానరాదు. నాకు చావస్తె బాగుండు బిడ్డా. - బోయిని ఆశమ్మ రాజిపేట
పట్నం ఎళ్తున్నా..
నాకున్న 2 ఎకరాల భూమిలో బోరుబావి ఉంది. వరి ఏసినా. వర్షాలు లేక బోరుబావిలో నీరు రాలేదు. ఊళ్లో చేసేందుకు పనుల్లేవు. భార్య, పిల్లల్ని తోలుకొని పట్నం ఎళ్తున్నా. హైదరాబాద్‌లోని లింగంపల్లిలో పనికుదుర్చుకొని వచ్చా. - నిరుడి ఇసాక్, రాజ్‌పేట గ్రామం
ఆరు ఎకరాల పొలం ఎండింది
ముందుగా కురిసిన వర్షాలకు నాకున్న ఆరు ఎకరాల్లో వరి, మొక్కజొన్న వేశా. అందులో బోరు కూడా ఉంది. ఆపై వర్షాలు లేకపోవడంతో పంటంతా ఎండిపోయింది. అప్పులు తీర్చే పరిస్థితి లేదు. ఆదుకునేవారు లేరు. నేను కూడా వలస వెళ్లాల్సిన అవసరం ఉంది. - లింగం మల్లయ్య వాడిగ్రామం