ఢిల్లీ దాకా.. డోలు మోత | Drum ghallu | Sakshi
Sakshi News home page

ఢిల్లీ దాకా.. డోలు మోత

Published Sat, Aug 13 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

ఢిల్లీ దాకా.. డోలు మోత

ఢిల్లీ దాకా.. డోలు మోత

  • వికసించిన ఒగ్గుడోలు విన్యాసం  
  • స్వాతంత్య్ర వేడుకల్లో  ప్రదర్శనకు మొదటిసారి ఎంపిక
  • తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దం
  • చుక్క సత్తయ్య ఆధ్వర్యంలో జనగామ డివిజన్‌లో కళాకారులకు ప్రత్యేక శిక్షణ
  • విచిత్ర వేషధారణ.. చేతిలో డోలు.. లయబద్ధంగా కొనసాగే విన్యాసాలు.. ఒళ్లు గగుర్పొడిచే తల్వార్ల ప్రదర్శన.. ఇవన్నీ ఒగ్గుడోలుకు సంబంధించిన దృశ్యాలు. పదిమంది కళాకారులు ఒకరిపై ఒకరు నిలబడి డోలు వాయి ద్యం చేస్తుంటే రెండు కళ్లు చాలవు. తెలంగాణ సంస్క­ృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే ఓరుగల్లు.. ఒగ్గుడోలు ప్రదర్శన ఢిల్లీ, హైదరాబాద్‌లో జరిగే పంద్రాగస్టు వేడుకలకు మెుదటిసారిగా ఎంపికైంది. ఈ నేపథ్యంలో ఒగ్గుడోలు విశిష్టత, కళాకారుల విన్యాసాలపై ప్రత్యేక కథనం.
    –జనగామ
     
     త్రిపురాసురులైన రాక్షసులను.. శివుడు సంహరించే సమయంలో తన శక్తియుక్తులు సరిపోకపోవడంతో అమ్మ వారైన చండీకామాతను వేడుకుంటాడు. అయితే రాక్షస సంహారంలో శివుడు తన శక్తియుక్తులు కోల్పోతున్న సమయంలో అమ్మవారు ప్రత్యక్షమవుతారు. ఈ క్రమంలో రాక్షసులను సంహరించే సమయంలో శివుడి రక్తం నేలపై పడకుండా చండీకామాత మింగేస్తుంది. యుద్ధంలో శివుడు విజయం సాధించిన తర్వాత ఇద్దరు కలిసి ఢమరుక నాదాల మధ్య శివతాండవం చేస్తారు. పరమేశ్వరుడి అర్ధ భాగమైన చండీకామాత వద్ద ఉన్న ఢమరుకం శివుడి చేతిలోకి రావడంతో పూజలు చేస్తున్న ఒగ్గు పూజారులకు మల్లికార్జునుడి రూపంలో వచ్చి దానిని అప్పగిస్తాడు. శివుడి చేతిలో ఉన్న ఢమరుకాన్ని అందుకున్న నాటి నుంచి ఒగ్గు పూజారులు.. డోలు కళాకారులుగా కీర్తించబడుతూ మల్లన్న సేవలో తరిస్తున్నారు. 
     
    తెలంగాణ సంస్కృతికి ప్రతీక
    ఒగ్గు కథ, ఒగ్గు డోలు విన్యాసాలు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి. కళలకు, కళాకారులకు పుట్టినిల్లుగా పేరొందిన వరంగల్‌ జిల్లాలోని జనగామ డివిజన్‌ ప్రాంతానికి చెందిన కళాకారులు డోలు విన్యాసంలో తమదైన ప్రతిభను చాటుతున్నారు. లయబద్ధంగా చేసే వాయిద్యాలు, కాలి అందెల సవ్వడి, ఒళ్లు గగుర్పొడిచే విన్యా సాలతో వారు ప్రజలను మంత్ర ముగ్ధులను చేస్తున్నారు. కాగా, విచిత్ర వేషధారణ, పోతరాజుల పొలికేకలు, పిర మిడ్‌ విన్యాసాలు కళాకారుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. పండుగలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారాలు ఇలా ఏదైన ఒగ్గుడోలు విన్యాసాలు ప్రజల మదిలో నిలిచిపోతున్నాయి. 
     
    చుక్క సత్తయ్యకు మణిహారం
    ఒగ్గు కథ పితామహుడు చుక్క సత్తయ్యకు మణిహారంగా ఒగ్గు డోలు విన్యాసాలు నిలిచాయి. డివిజన్‌లోని లింగాలఘణపురం మండలం మాణిక్యాపురానికి చెందిన చెందిన చుక్క సత్తయ్య దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు పొరుగు దేశాల్లో కూడా ఒగ్గుకథ ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మంది మన్ననలు పొందారు. ఒగ్గు కథ మాదిరిగానే ఒగ్గు డోలు విన్యాసాలు కూడా అదే స్థాయిలో జనగామ డివిజన్‌లో అభివృద్ధి చేసేందుకు చుక్క సత్తయ్య తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ మేరకు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఆసక్తి కలిగిన కళాకారులకు డోలు విన్యాసాలు నేర్పిస్తున్నారు. ఇందులో భాగంగా 27 రాష్ట్రాల్లో ఆరు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి ఒగ్గు డోలు విన్యాసాల ప్రాధాన్యతను వెలుగులోకి తీసుకొస్తున్నారు. చుక్క సత్తయ్య శిష్యుల్లో ఒకరైన మాణిక్యాపురానికి చెం దిన చౌదరిపల్లి రవికుమార్‌ డోలు విన్యాసంలో తన బృందంతో జిల్లాతోపాటు ఇతర రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఇటీవల హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో అద్భుత ప్రతిభను కనబరిచారు. 
     
    220 మంది కళాకారుల ఎంపిక
    జనగామ డివిజన్‌కు చెందిన ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త విన్యాసాలతో సౌత్‌ ఇండియా ట్రెడిషియన్‌ను ఆకట్టుకునే విధంగా వీరశైవ సంప్రదాన్ని పాటిస్తూ ఉంటుంది. చూడగానే అబ్బో అనిపించే విధంగా మేకప్‌లు.. రంగు రంగుల కాస్ట్యూమ్స్‌పై వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. రౌద్రం, ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉండే తల్వార్ల ప్రదర్శన, ఒకరిపై ఒకరు వరుసగా పది మంది నిలబడి డోలు కొడుతూ వీక్షకులకు కనువిందు చేస్తుంటారు. అయితే పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం ‘భాగర్‌ పర్వ్‌’ పేరిట వారం రోజుల పాటు ఢిల్లీ పరేడ్‌గ్రౌండ్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళా ప్రదర్శనలు నిర్వహించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం జనగామ నుంచి ఒగ్గు కళాకారులను ఎంపిక చేసి పంపించగా వారు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఈ మేరకు వారు తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శనలు సిద్ధమయ్యారు. కాగా, రెం డు ప్రాంతాల్లో జరిగే వేడుకలకు జనగామ డివిజన్‌లోని లింగాలఘణపురం (మాణిక్యాపురం), బచ్చన్నపేట, మద్దూరు, జనగామ మండలాలకు చెందిన 220 మంది కళాకారులు ఎంపికయ్యారు. ఇందులో 20 మంది నేడు (ఆదివారం) ఢిల్లీకి బయలు దేరనున్నారు. 
     
    చాలా సంతోషంగా ఉంది
    తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఒగ్గుడోలు విన్యాసాలను స్వాతంత్య్ర వేడుకల్లో ప్రదర్శించేందుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను బతికిస్తున్న ఒగ్గు కళాకారులకు గుర్తింపు రావడం ఆనం దంగా ఉంది. కళలు కళ కోసం కాదు.. ప్రజల కోసం అని ప్రభుత్వాలు మరోసారి గుర్తించాయి. 
    – చుక్క సత్తయ్య, ఒగ్గుకథ పితామహుడు
     
    కళాకారుల ప్రదర్శన చూసి మురిసిపోవాలె
    జనగామ డివిజన్‌కు చెందిన ఒగ్గు కళాకారులు చుక్క సత్తయ్య చేతిలో మెరికల్లా తయారయ్యారు. కైలాసంలో ఉన్న పరమేశ్వరుడే పులకించే విధంగా డోలు విన్యాసం మోగిస్తారు. ఒక్కో స్టెప్పు.. స్టెప్పు స్టెప్పునకు మారుతున్న శబ్దం.. ఇలా గంటల పాటు డోలు మోగించే కళాకారులు వేలల్లో ఉన్నారు. ఢిలోలో జరిగే ప్రంద్రాగస్టు వేడుకలకు మొట్టమొదటి సారిగా ఒగ్గుకళకు అరుదైన గౌరవం దక్కింది. దీనికి కారణం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం. 
    – చౌదరపల్లి రవికుమార్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఒగ్గు కళాకారుల కోఆర్డినేటర్‌
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement