drum
-
అయోధ్యకు అతిపెద్ద నగారా.. ప్రత్యేకతలివే!
ప్రపంచంలోనే అతిపెద్ద నగారాను మధ్యప్రదేశ్‌లోని రేవాలో తయారు చేశారు. దీనిని అయోధ్యలోని రామమందిరానికి తరలించనున్నారు. గత 40 ఏళ్లుగా ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున రేవాలో ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. గత శివరాత్రినాడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎంబ్రాయిడరీ కళాకృతిని తయారు చేశారు. అలాగే 5,100 కిలోల మహాప్రసాదాన్ని తయారు చేశారు. ఈసారి ప్రపంచంలోనే అతిపెద్ద నగారాను తయారు చేశారు. జనవరి 22న అయోధ్యలో జరిగిన రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. అదిమొదలు ప్రపంచం నలుమూలల నుంచి అయోధ్యకు వివిధ కానుకలు అందుతున్నాయి. ఈ నేపధ్యంలోనే అయోధ్యకు కానుకగా పంపేందుకు రేవాలో ఆరు అడుగుల ఎత్తు , 11×11 వ్యాసం కలిగిన అతిపెద్ద నగారాను తయారు చేశారు. దీనిని మార్చి 12 నాటికి అయోధ్యకు తరలించనున్నారు. దీనిని మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా రేవా నగర వీధుల్లో ఊరేగించారు. ఈ నగారాను పరీక్షించేందుకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ బృందం రేవాకు వచ్చింది. వారి పరిశీలన అనంతరం ఈ నగరాను రికార్డులలో నమోదు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద నగారా ఇదేనని ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత డాక్టర్ ఏకే జైన్ తెలిపారు. -
కోనసీమలో ‘నల్ల బంగారం’
సాక్షి అమలాపురం: కోనసీమలో తయారయ్యే ‘కొబ్బరి చిప్ప బొగ్గు’ దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ సౌందర్యానికి ఫేస్‌ప్యాక్‌గా, తాగునీటిని శుద్ధిచేసేందుకు వినియోగించడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు, దేశ రక్షణకు చెందిన విడి భాగాలు, ఆటో మొబైల్ పరిశ్రమలలో కీలక విడిభాగాల తయారీలో ఈ బొగ్గు అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. తయారీదారుల ఇంట నల్ల బంగారమై మెరుస్తోంది. ఇటువంటి అత్యుత్తమమైన, నాణ్యమైన కొబ్బరి చిప్ప బొగ్గు తయారీకి కేరాఫ్ అడ్రస్‌గా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నిలుస్తోంది. నదీతీరంలో బొగ్గు తయారీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, అంబాజీపేట మండలాల్లో వైనతేయ నదీతీరంలో బొగ్గు తయారవుతోంది. ఇక్కడ నుంచి ఏడాదికి రూ. 2 కోట్ల విలువ చేసే 700 నుంచి 900 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడు లోని కాంగాయం, పల్లడం, కోయింబత్తూరు, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, మన రాష్ట్రంలోని నెల్లూ రు, గూడూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రయోజనాలెన్నో.. కొబ్బరి చిప్ప బొగ్గు ప్రయోజనాలు తెలిస్తే నిజంగా నల్ల బంగారమే అంటారు. సౌందర్య పోషణకు వాడే ఫేస్‌ప్యాక్‌లతోపాటు కాస్మోటిక్స్, సబ్బులలో వాడకం అధికం. ఆటోమొబైల్‌లో కీలకమైన స్పేర్ పార్టుల తయారీ, రక్షణ రంగంలో యుద్ధ పరికరా లు, గ్యాస్ మాస్కుల తయారీలో వినియోగిస్తారు. పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తిలో అధిక శాతం రికవరీకి ఇది దోహదపడుతుంది. నీటిలోని క్లోరిన్, పురుగు మందులు, మలినాలను, వైరస్, బ్యాక్టీరియాలను నివారిస్తుంది. దీనిలో అధిక ఉష్ణ విలువ ఉంటుంది. మండించడానికి సమర్థవంతమైన ఇంధన వనరు గా ఉపయోగపడుతుంది. చిప్ప బొగ్గుతో భూమిలో వేగంగా సేంద్రియ కర్భనం ఉత్పత్తి అవుతుంది. బాగా ఆరిన కొబ్బరి చిప్ప బొగ్గు అత్యధిక ధర కేజీ రూ.35 నుంచి రూ.38 వరకు ఉండగా, ఈ ఏడాది ఆశించిన ఎగుమతులు లేకపోవడంతో ధర తగ్గిపోయింది. ప్రస్తుతం కేజీ రూ.24 నుంచి రూ.26 కాగా, తడిసిన బొగ్గు ధర రూ.19 వరకు మాత్రమే ఉంది. దీనివల్ల నష్టపోతున్నామని, ఎగుమతులు లేక సరుకు పెద్ద ఎత్తున పేరుకుపోయిందని, అక్టోబర్ నుంచి మంచి ధర వస్తుందని తయారీదారులు ఆశలు పెట్టుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం వన్ డిస్ట్రిక్ట్.. వన్ ప్రొడెక్టులో భాగంగా కోనసీమ జిల్లాను కొబ్బరికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ చిప్ప బొగ్గు తయారీ పరిశ్రమలను ప్రోత్సహించాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. కోకోనట్ బోర్డు, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రూ.25 లక్షల విలువైన యూనిట్‌కు 35 శాతం వరకు రాయి తీ అందించనుంది. అంతకన్నా పెద్ద ప్రాజెక్టు పెట్టుకుంటే రూ.పది లక్షల వరకు రాయితీ ఇవ్వనున్నా రు. జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా) ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో జిల్లాలో కోకోనట్ మిల్క్ యూనిట్‌తోపాటు కోకోనట్ చార్ కోల్ పరిశ్రమ ఏర్పాటుకు ఉద్యానశాఖ సన్నాహాలు చేస్తోంది. మన్నిక ఎక్కువ.. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక కన్నా ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గు నాణ్యమైంది. చిప్ప దళసరి కావడంతోపాటు దీనిలో అధిక శాతం గ్యాస్ నిక్షిప్తమైనందున ఇది వేగంగా మండుతోంది. మిగిలిన రాష్ట్రాలలో ఆరు బయట బొగ్గు తయారీ ఎక్కువ. కోనసీమలో బొగ్గు తయారీ డ్రమ్ములలో చేస్తారు. దీనివల్ల బూడిద శాతం తక్కువగా ఉంటోంది. ఇక్కడ తయారయ్యే బొగ్గు ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటుంది. మార్కెట్ అవకాశాలు పెరగాలి మనం తయారు చేసే బొగ్గే అత్యంత నాణ్యమైంది. మార్కెటింగ్ అవకాశాలు పెద్దగా లేక అనుకున్న ధర రావడం లేదు. ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నుంచి బొగ్గు తీసుకెళ్లి మరింత నాణ్యంగా తయారు చేసి కేజీ రూ.50 నుంచి రూ.70 చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. మనకు మాత్రం ఆ ధర రావడం లేదు. మార్కెటింగ్ అవకాశాలు పెరిగితే మరింత ధర వచ్చే అవకాశముంది.– మట్టపర్తి రామకృష్ణ,ముంజువరం, పి.గన్నవరం మండలం అత్యంత ధృడమైంది ఇక్కడ తయారయ్యే కొబ్బరి చిప్పలో 80 నుంచి 90 శాతం మేర చిన్న చిన్న రంధ్రాలు ఉండడంతో ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటోంది. ఆటోమొబైల్, రక్షణ పరికరాలు, పెట్రోలియం ఉత్పత్తుల తయారీలో అధికంగా వాడుతున్నారు. – ఎ.కిరిటీ, ఉద్యాన శాస్త్రవేత్త, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట -
ప్లాస్టిక్ డ్రమ్ములో యువతి శవం
బెంగళూరు: యువతిని దారుణంగా హత్య చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి పైన క్లాత్‌తో మూత బిగించి రైల్వే స్టేషన్లో దుండగులు వదిలివెళ్లిన దారుణమైన ఘటన ఐటీ సిటీ బెంగళూరులోని యశవంతపుర రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... గూడ్స్ రైలు ప్లాట్ ఫాం వద్ద ఒక నీలి డ్రమ్ము, దాని మూత చుట్టూ బట్ట కట్టి ఉంది. మూడు రోజులుగా నిలిచి ఉన్న గూడ్స్ వెళ్లిపోవడంతో డ్రమ్ము బయటకు కనిపించింది. అందులో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్వీపర్ జయమ్మ రైల్వే పోలీసులకు తెలియజేసింది. వారు వచ్చి పరిశీలించగా యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో బయటపడింది. మృతదేహం గొంతుకు తెల్లటి దుపట్టా చుట్టి ఉంది. ముఖమంతా గుర్తుపట్టలేకుండా ఉంది. మూడు నాలుగు రోజుల కిందటే ఆమెను చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆమె వయసు 23 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. యువతి రూపురేఖలను బట్టి విద్యావంతురాలై ఉంటుందని, ఎక్కడో చంపి, డ్రమ్ములో పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. రైల్వేస్టేషన్లో అమర్చిన సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో పడ్డారు. న్యూ ఇయర్ సంబరాల్లో ఎవరైనా దుండగులు ఆమెను అపహరించి హత్య చేసి ఉంటారనే సందేహాలూ వినిపిస్తున్నాయి. చదవండి: (అయోధ్య రామ మందిరం నిర్మాణంపై అమిత్ షా కీలక ప్రకటన) -
మూడేళ్లకు నూరేళ్లు
– నీటి డ్రమ్ములో పడి చిన్నారి మృతి రుద్రవరం: నీటి డ్రమ్ములో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన డి. కొట్టాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి డేరంగుల నరసింహ, నాగమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెల తర్వాత కుమారుడు పునీత్ కుమార్ జన్మించాడు. సోమవారం ఉదయం నాగమ్మ పొలానికి వెళ్లింది. సాయంత్రం నరసింహ కూడా పాఠశాల నుంచి ఇంటికొచ్చిన కుమార్తెలకు కుమారుడిని అప్పగించి పొలానికి వెళ్లాడు. పునీత్ ఇంటి ముందు మలవిసర్జన చేసి నీటి కోసం పక్కనే ఉన్న నీటి డ్రమ్ములో డబ్బాను అందుకునే ప్రయత్నంలో డ్రమ్ములో పడిపోయాడు. కొద్ది సేపటికి తమ్ముడు కనిపించకపోవడంతో ముగ్గురు అక్కలు ఇంటి పక్కల వెతికారు. చివరగా డ్రమ్ములో తలకిందులుగా పడి కనిపించాడు. స్థానికులు వచ్చి నీటిలో నుంచి చిన్నారిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఢిల్లీ దాకా.. డోలు మోత
వికసించిన ఒగ్గుడోలు విన్యాసం స్వాతంత్య్ర వేడుకల్లో ప్రదర్శనకు మొదటిసారి ఎంపిక తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దం చుక్క సత్తయ్య ఆధ్వర్యంలో జనగామ డివిజన్లో కళాకారులకు ప్రత్యేక శిక్షణ విచిత్ర వేషధారణ.. చేతిలో డోలు.. లయబద్ధంగా కొనసాగే విన్యాసాలు.. ఒళ్లు గగుర్పొడిచే తల్వార్ల ప్రదర్శన.. ఇవన్నీ ఒగ్గుడోలుకు సంబంధించిన దృశ్యాలు. పదిమంది కళాకారులు ఒకరిపై ఒకరు నిలబడి డోలు వాయి ద్యం చేస్తుంటే రెండు కళ్లు చాలవు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే ఓరుగల్లు.. ఒగ్గుడోలు ప్రదర్శన ఢిల్లీ, హైదరాబాద్‌లో జరిగే పంద్రాగస్టు వేడుకలకు మెుదటిసారిగా ఎంపికైంది. ఈ నేపథ్యంలో ఒగ్గుడోలు విశిష్టత, కళాకారుల విన్యాసాలపై ప్రత్యేక కథనం. –జనగామ త్రిపురాసురులైన రాక్షసులను.. శివుడు సంహరించే సమయంలో తన శక్తియుక్తులు సరిపోకపోవడంతో అమ్మ వారైన చండీకామాతను వేడుకుంటాడు. అయితే రాక్షస సంహారంలో శివుడు తన శక్తియుక్తులు కోల్పోతున్న సమయంలో అమ్మవారు ప్రత్యక్షమవుతారు. ఈ క్రమంలో రాక్షసులను సంహరించే సమయంలో శివుడి రక్తం నేలపై పడకుండా చండీకామాత మింగేస్తుంది. యుద్ధంలో శివుడు విజయం సాధించిన తర్వాత ఇద్దరు కలిసి ఢమరుక నాదాల మధ్య శివతాండవం చేస్తారు. పరమేశ్వరుడి అర్ధ భాగమైన చండీకామాత వద్ద ఉన్న ఢమరుకం శివుడి చేతిలోకి రావడంతో పూజలు చేస్తున్న ఒగ్గు పూజారులకు మల్లికార్జునుడి రూపంలో వచ్చి దానిని అప్పగిస్తాడు. శివుడి చేతిలో ఉన్న ఢమరుకాన్ని అందుకున్న నాటి నుంచి ఒగ్గు పూజారులు.. డోలు కళాకారులుగా కీర్తించబడుతూ మల్లన్న సేవలో తరిస్తున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక ఒగ్గు కథ, ఒగ్గు డోలు విన్యాసాలు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి. కళలకు, కళాకారులకు పుట్టినిల్లుగా పేరొందిన వరంగల్ జిల్లాలోని జనగామ డివిజన్ ప్రాంతానికి చెందిన కళాకారులు డోలు విన్యాసంలో తమదైన ప్రతిభను చాటుతున్నారు. లయబద్ధంగా చేసే వాయిద్యాలు, కాలి అందెల సవ్వడి, ఒళ్లు గగుర్పొడిచే విన్యా సాలతో వారు ప్రజలను మంత్ర ముగ్ధులను చేస్తున్నారు. కాగా, విచిత్ర వేషధారణ, పోతరాజుల పొలికేకలు, పిర మిడ్ విన్యాసాలు కళాకారుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. పండుగలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారాలు ఇలా ఏదైన ఒగ్గుడోలు విన్యాసాలు ప్రజల మదిలో నిలిచిపోతున్నాయి. చుక్క సత్తయ్యకు మణిహారం ఒగ్గు కథ పితామహుడు చుక్క సత్తయ్యకు మణిహారంగా ఒగ్గు డోలు విన్యాసాలు నిలిచాయి. డివిజన్లోని లింగాలఘణపురం మండలం మాణిక్యాపురానికి చెందిన చెందిన చుక్క సత్తయ్య దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు పొరుగు దేశాల్లో కూడా ఒగ్గుకథ ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మంది మన్ననలు పొందారు. ఒగ్గు కథ మాదిరిగానే ఒగ్గు డోలు విన్యాసాలు కూడా అదే స్థాయిలో జనగామ డివిజన్లో అభివృద్ధి చేసేందుకు చుక్క సత్తయ్య తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ మేరకు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఆసక్తి కలిగిన కళాకారులకు డోలు విన్యాసాలు నేర్పిస్తున్నారు. ఇందులో భాగంగా 27 రాష్ట్రాల్లో ఆరు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి ఒగ్గు డోలు విన్యాసాల ప్రాధాన్యతను వెలుగులోకి తీసుకొస్తున్నారు. చుక్క సత్తయ్య శిష్యుల్లో ఒకరైన మాణిక్యాపురానికి చెం దిన చౌదరిపల్లి రవికుమార్ డోలు విన్యాసంలో తన బృందంతో జిల్లాతోపాటు ఇతర రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఇటీవల హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో అద్భుత ప్రతిభను కనబరిచారు. 220 మంది కళాకారుల ఎంపిక జనగామ డివిజన్‌కు చెందిన ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త విన్యాసాలతో సౌత్ ఇండియా ట్రెడిషియన్ను ఆకట్టుకునే విధంగా వీరశైవ సంప్రదాన్ని పాటిస్తూ ఉంటుంది. చూడగానే అబ్బో అనిపించే విధంగా మేకప్‌లు.. రంగు రంగుల కాస్ట్యూమ్స్‌పై వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. రౌద్రం, ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉండే తల్వార్ల ప్రదర్శన, ఒకరిపై ఒకరు వరుసగా పది మంది నిలబడి డోలు కొడుతూ వీక్షకులకు కనువిందు చేస్తుంటారు. అయితే పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం ‘భాగర్ పర్వ్’ పేరిట వారం రోజుల పాటు ఢిల్లీ పరేడ్‌గ్రౌండ్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళా ప్రదర్శనలు నిర్వహించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం జనగామ నుంచి ఒగ్గు కళాకారులను ఎంపిక చేసి పంపించగా వారు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఈ మేరకు వారు తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శనలు సిద్ధమయ్యారు. కాగా, రెం డు ప్రాంతాల్లో జరిగే వేడుకలకు జనగామ డివిజన్లోని లింగాలఘణపురం (మాణిక్యాపురం), బచ్చన్నపేట, మద్దూరు, జనగామ మండలాలకు చెందిన 220 మంది కళాకారులు ఎంపికయ్యారు. ఇందులో 20 మంది నేడు (ఆదివారం) ఢిల్లీకి బయలు దేరనున్నారు. చాలా సంతోషంగా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఒగ్గుడోలు విన్యాసాలను స్వాతంత్య్ర వేడుకల్లో ప్రదర్శించేందుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను బతికిస్తున్న ఒగ్గు కళాకారులకు గుర్తింపు రావడం ఆనం దంగా ఉంది. కళలు కళ కోసం కాదు.. ప్రజల కోసం అని ప్రభుత్వాలు మరోసారి గుర్తించాయి. – చుక్క సత్తయ్య, ఒగ్గుకథ పితామహుడు కళాకారుల ప్రదర్శన చూసి మురిసిపోవాలె జనగామ డివిజన్‌కు చెందిన ఒగ్గు కళాకారులు చుక్క సత్తయ్య చేతిలో మెరికల్లా తయారయ్యారు. కైలాసంలో ఉన్న పరమేశ్వరుడే పులకించే విధంగా డోలు విన్యాసం మోగిస్తారు. ఒక్కో స్టెప్పు.. స్టెప్పు స్టెప్పునకు మారుతున్న శబ్దం.. ఇలా గంటల పాటు డోలు మోగించే కళాకారులు వేలల్లో ఉన్నారు. ఢిలోలో జరిగే ప్రంద్రాగస్టు వేడుకలకు మొట్టమొదటి సారిగా ఒగ్గుకళకు అరుదైన గౌరవం దక్కింది. దీనికి కారణం సీఎం కేసీఆర్ ప్రభుత్వం. – చౌదరపల్లి రవికుమార్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఒగ్గు కళాకారుల కోఆర్డినేటర్ -
ఢంకా పోయే..
సాక్షి, చెన్నై : తమిళనాట ఎన్నికల గుర్తింపు ఉన్నంత మాత్రన, పుదుచ్చేరిలోనూ ఉన్నట్టేనా? ఈ లాజిక్‌ను మిస్సైన డీఎండీకే వర్గాలు ఢంకా పోయే...అని ఆవేదనలో మునగాల్సిన పరిస్థితి. తమిళనాడు, పుదుచ్చేరీలు రాష్ట్రాల పరంగా వేర్వేరైనా, భాషలు, సంప్రదాయాలు ఒక్కటే. ఇక, ఇక్కడున్న పార్టీలే అక్కడ కూడా ఉన్నాయి. ఆయా పార్టీల అధినేతలు ఒక్కరే. ఏ చిన్న సమస్య ఎదురైనా, తమిళనాడులోని అధినేతల్ని కలిసేందుకు అక్కడి ద్రవిడ పార్టీల నాయకులు రావాల్సిందే. ఇక, ఎన్నికలు అంటారా..? రెండు రాష్ట్రాలకు ఒకే తేదీలోనే జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎండీకే వర్గాలు చేసిన చిన్న తప్పు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఢంకా చిహ్నం దూరం చేసుకోక తప్పలేదు. గత ఎన్నికల్లో తమిళనాట ప్రధాన ప్రతిపక్షంగా డీఎండీకే అవతరించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలతో ఆ పార్టీ ఎన్నికల గుర్తుగా ఢంకాకు అధికారిక ముద్ర పడింది. ఢంకా ఇక తమదే అన్న ధీమాతో డీఎండీకే వర్గాలు ముందుకు సాగుతూ వస్తున్నాయి. అయితే, పుదుచ్చేరి ఎన్నికల బరిలో ఉన్న ఆ పార్టీ అభ్యర్థులు సైతం ఆ చిహ్నంతోనే ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యారు. తమకు ఢంకాను కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికం చేసినందున, పుదుచ్చేరిలోనూ అదే చిహ్నం దక్కుతుందన్న ధీమాతో ఉన్న డీఎండీకే వర్గాలకు మంగళవారం ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. ప్రజా సంక్షేమ కూటమి తరపున డిఎండికే అభ్యర్థులు ఏడు స్థానాల్లో పుదుచ్చేరిలో పోటీ చేస్తున్నారు. నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక, చిహ్నాల కేటాయింపుల సమయంలో ఢంకా కానరాని దృష్ట్యా, డీఎండీకే వర్గాలు కంగు తినాల్సి వచ్చిందటా..!. ఇదేమంటూ ప్రశ్నిస్తే, అక్కడి ఎన్నికల అధికారులు ఇచ్చిన సమాధానం షాక్‌కు గురి చేసిందట. తమిళనాట ఢంకా అధికారిక ముద్రగా ఉన్న పుదుచ్చేరిలో అదే చిహ్నం కావాలంటే ముందస్తు అనుమతి తప్పని సరి అని వారికి ఎన్నికల అధికారులు సెలవిచ్చారు. దీంతో ఢంకా పోయే...అని తదుపరి ప్రయత్నాల్లో పడ్డారట..!. ఇదే విషయంగా అక్కడి ఎన్నికల అధికారి కందవేల్ను ప్రశ్నించగా, ఢంకా కావాలనుకుంటే, ముందుగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, అలాంటి ప్రయత్నాలే చేయకుండా ఢంకా..ఢంకా అంటే ఎలా..? అని సమాధానం ఇవ్వడం గమనార్హం. -
యూట్యూబ్ ను ఏలుతున్న 'ఎడ్వర్డా' బీట్స్...
లయబద్ధమైన బీట్.. ముఖంలో తొణకని విశ్వాసం.. ఆ చిన్నారి డ్రమ్స్ వాయించిందంటే సంగీత ప్రియులే కాదు...చూసినవారంతా అడుగులు కదపాల్సిదే... అప్పుడప్పుడే పాఠశాల మెట్లు ఎక్కాల్సిన ఐదేళ్ళ వయసులోనే ... ఆమె చేయి తిరిగిన ప్రజ్ఞను ప్రదర్శించింది. ఎటువంటి లోపాలు లేకుండా డ్రమ్స్ వాయిస్తూ, స్టేజ్ షోలు, టీవీ షోలతో దూసుకుపోతోంది. ఆణిముత్యంలా ఆకట్టుకుంటున్న ఆ బాల కళాకారిణి ఎడ్వర్డా హెన్ క్లెయిన్ బటెరిస్టా ప్లే చేసిన వీడియోలు... ఇప్పుడు యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి. బ్రెజిల్.. జాయిన్విల్లే నగరంలో నివసించే ఆరేళ్ళ ఎడ్వర్డా తన బీట్స్ తో సంగీత ప్రపంచాన్ని ఓలలాడిస్తోంది. ఇంతకు ముందే ఎన్నో లోకల్ టీవీ ప్రోగ్రామ్స్ లో ప్రతిభను చాటిన బాలిక.. తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఓ సంవత్సరం క్రితం ఐదేళ్ళ అతి చిన్న వయసులో వాయిద్యాన్నిమొదలుపెట్టిన చిన్నారి... చేయి తిరిగిన విద్వాంసురాలిలా డ్రమ్స్ వాయించడం చూపరులను విస్మయ పరుస్తోంది. అతి సుతారంగా కర్రలు తిప్పుతూ చాకచక్యంగా బీట్స్ వేసే ఆమె... వాద్య పరికరాల వెనుక నవ్వుతూ నిలబడినట్లే కనిపిస్తుంది. ట్రాక్ తో పాటు గొంతెత్తి పాడుతూ శక్తివంతంగా తన పరాక్రమాన్ని చాటుతోంది. ప్రదర్శన ముగించే మూడు నిమిషాలకు ముందు ఈలలు, చప్పట్లతో ఆమెకు వచ్చే రెస్సాన్స్ ఓ ప్రముఖ విద్యాంసుడికి కూడా రాదేమో అనిపిస్తుంది. యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఆ బాల మేధావి వీడియోను ఇప్పటివరకూ ఐదు లక్షల మందికి పైగా చూడటమే కాదు, ఎందరో ఆమెను అభినందిస్తూ కామెంట్లు పోస్ట్ చేశారు. ''నిజానికి ఓ ఐదేళ్ళ చిన్నారి ఇంత అద్భుతంగా డ్రమ్స్ వాయించడం ఆశ్చర్యపరుస్తోంది.", "డ్రమ్స్ వాయిస్తూ పాటను కూడ పాటడం నిజంగా ఆశ్చర్యం" అంటూ వచ్చిన కామెంట్లు ఇప్పుడు ఆమె ప్రతిభకు పట్టం కడుతున్నాయి.