ఢంకా పోయే..
సాక్షి, చెన్నై : తమిళనాట ఎన్నికల గుర్తింపు ఉన్నంత మాత్రన, పుదుచ్చేరిలోనూ ఉన్నట్టేనా? ఈ లాజిక్‌ను మిస్సైన డీఎండీకే వర్గాలు ఢంకా పోయే...అని ఆవేదనలో మునగాల్సిన పరిస్థితి. తమిళనాడు, పుదుచ్చేరీలు రాష్ట్రాల పరంగా వేర్వేరైనా, భాషలు, సంప్రదాయాలు ఒక్కటే. ఇక, ఇక్కడున్న పార్టీలే అక్కడ కూడా ఉన్నాయి. ఆయా పార్టీల అధినేతలు ఒక్కరే. ఏ చిన్న సమస్య ఎదురైనా, తమిళనాడులోని అధినేతల్ని కలిసేందుకు అక్కడి ద్రవిడ పార్టీల నాయకులు రావాల్సిందే. ఇక, ఎన్నికలు అంటారా..? రెండు రాష్ట్రాలకు ఒకే తేదీలోనే జరుగుతున్నాయి.
ఈ ఎన్నికల్లో డీఎండీకే వర్గాలు చేసిన చిన్న తప్పు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఢంకా చిహ్నం దూరం చేసుకోక తప్పలేదు. గత ఎన్నికల్లో తమిళనాట ప్రధాన ప్రతిపక్షంగా డీఎండీకే అవతరించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలతో ఆ పార్టీ ఎన్నికల గుర్తుగా ఢంకాకు అధికారిక ముద్ర పడింది. ఢంకా ఇక తమదే అన్న ధీమాతో డీఎండీకే వర్గాలు ముందుకు సాగుతూ వస్తున్నాయి. అయితే, పుదుచ్చేరి ఎన్నికల బరిలో ఉన్న ఆ పార్టీ అభ్యర్థులు సైతం ఆ చిహ్నంతోనే ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యారు. తమకు ఢంకాను కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికం చేసినందున, పుదుచ్చేరిలోనూ అదే చిహ్నం దక్కుతుందన్న ధీమాతో ఉన్న డీఎండీకే వర్గాలకు మంగళవారం ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు.
ప్రజా సంక్షేమ కూటమి తరపున డిఎండికే అభ్యర్థులు ఏడు స్థానాల్లో పుదుచ్చేరిలో పోటీ చేస్తున్నారు. నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక, చిహ్నాల కేటాయింపుల సమయంలో ఢంకా కానరాని దృష్ట్యా, డీఎండీకే వర్గాలు కంగు తినాల్సి వచ్చిందటా..!. ఇదేమంటూ ప్రశ్నిస్తే, అక్కడి ఎన్నికల అధికారులు ఇచ్చిన సమాధానం షాక్‌కు గురి చేసిందట. తమిళనాట ఢంకా అధికారిక ముద్రగా ఉన్న పుదుచ్చేరిలో అదే చిహ్నం కావాలంటే ముందస్తు అనుమతి తప్పని సరి అని వారికి ఎన్నికల అధికారులు సెలవిచ్చారు. దీంతో ఢంకా పోయే...అని తదుపరి ప్రయత్నాల్లో పడ్డారట..!.
ఇదే విషయంగా అక్కడి ఎన్నికల అధికారి కందవేల్‌ను ప్రశ్నించగా, ఢంకా కావాలనుకుంటే, ముందుగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, అలాంటి ప్రయత్నాలే చేయకుండా ఢంకా..ఢంకా అంటే ఎలా..? అని సమాధానం ఇవ్వడం గమనార్హం.