మూడేళ్లకు నూరేళ్లు
– నీటి డ్రమ్ములో పడి చిన్నారి మృతి
రుద్రవరం: నీటి డ్రమ్ములో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన డి. కొట్టాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి డేరంగుల నరసింహ, నాగమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెల తర్వాత కుమారుడు పునీత్ కుమార్ జన్మించాడు. సోమవారం ఉదయం నాగమ్మ పొలానికి వెళ్లింది. సాయంత్రం నరసింహ కూడా పాఠశాల నుంచి ఇంటికొచ్చిన కుమార్తెలకు కుమారుడిని అప్పగించి పొలానికి వెళ్లాడు. పునీత్ ఇంటి ముందు మలవిసర్జన చేసి నీటి కోసం పక్కనే ఉన్న నీటి డ్రమ్ములో డబ్బాను అందుకునే ప్రయత్నంలో డ్రమ్ములో పడిపోయాడు. కొద్ది సేపటికి తమ్ముడు కనిపించకపోవడంతో ముగ్గురు అక్కలు ఇంటి పక్కల వెతికారు. చివరగా డ్రమ్ములో తలకిందులుగా పడి కనిపించాడు. స్థానికులు వచ్చి నీటిలో నుంచి చిన్నారిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.