యూట్యూబ్ ను ఏలుతున్న 'ఎడ్వర్డా' బీట్స్...
లయబద్ధమైన బీట్.. ముఖంలో తొణకని విశ్వాసం.. ఆ చిన్నారి డ్రమ్స్ వాయించిందంటే సంగీత ప్రియులే కాదు...చూసినవారంతా అడుగులు కదపాల్సిదే... అప్పుడప్పుడే పాఠశాల మెట్లు ఎక్కాల్సిన ఐదేళ్ళ వయసులోనే ... ఆమె చేయి తిరిగిన ప్రజ్ఞను ప్రదర్శించింది. ఎటువంటి లోపాలు లేకుండా డ్రమ్స్ వాయిస్తూ, స్టేజ్ షోలు, టీవీ షోలతో దూసుకుపోతోంది. ఆణిముత్యంలా ఆకట్టుకుంటున్న ఆ బాల కళాకారిణి ఎడ్వర్డా హెన్ క్లెయిన్ బటెరిస్టా ప్లే చేసిన వీడియోలు... ఇప్పుడు యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి.
బ్రెజిల్.. జాయిన్విల్లే నగరంలో నివసించే ఆరేళ్ళ ఎడ్వర్డా తన బీట్స్ తో సంగీత ప్రపంచాన్ని ఓలలాడిస్తోంది. ఇంతకు ముందే ఎన్నో లోకల్ టీవీ ప్రోగ్రామ్స్ లో ప్రతిభను చాటిన బాలిక.. తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఓ సంవత్సరం క్రితం ఐదేళ్ళ అతి చిన్న వయసులో వాయిద్యాన్నిమొదలుపెట్టిన చిన్నారి... చేయి తిరిగిన విద్వాంసురాలిలా డ్రమ్స్ వాయించడం చూపరులను విస్మయ పరుస్తోంది. అతి సుతారంగా కర్రలు తిప్పుతూ చాకచక్యంగా బీట్స్ వేసే ఆమె... వాద్య పరికరాల వెనుక నవ్వుతూ నిలబడినట్లే కనిపిస్తుంది. ట్రాక్ తో పాటు గొంతెత్తి పాడుతూ శక్తివంతంగా తన పరాక్రమాన్ని చాటుతోంది. ప్రదర్శన ముగించే మూడు నిమిషాలకు ముందు ఈలలు, చప్పట్లతో ఆమెకు వచ్చే రెస్సాన్స్ ఓ ప్రముఖ విద్యాంసుడికి కూడా రాదేమో అనిపిస్తుంది.
యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఆ బాల మేధావి వీడియోను ఇప్పటివరకూ ఐదు లక్షల మందికి పైగా చూడటమే కాదు, ఎందరో ఆమెను అభినందిస్తూ కామెంట్లు పోస్ట్ చేశారు. ''నిజానికి ఓ ఐదేళ్ళ చిన్నారి ఇంత అద్భుతంగా డ్రమ్స్ వాయించడం ఆశ్చర్యపరుస్తోంది.", "డ్రమ్స్ వాయిస్తూ పాటను కూడ పాటడం నిజంగా ఆశ్చర్యం" అంటూ వచ్చిన కామెంట్లు ఇప్పుడు ఆమె ప్రతిభకు పట్టం కడుతున్నాయి.