లోపలేసి మూసేస్తా!
- మెదక్ డీఎస్పీ నాగరాజు కస్సుబుస్సు
- సెల్‌ఫోన్లు లాక్కుని.. ఫొటోలు డిలీట్
- దుర్భాషలాడుతూ విలేకరులపై వీరంగం
కొండపాక: మెదక్ డీఎస్పీ నాగరాజు సహనం కోల్పోయి విలేకరులపై విరుచుకుపడ్డారు. విలేకరుల చేతిలో నుంచి సెల్‌ఫోన్లు లాకున్నారు. అందులోని డేటాను, ఫొటోలను డిలీట్ చేశారు. ఎక్కువ మాట్లాడితే సెల్‌లో వేస్తానంటూ బెదిరించారు. దొంగల్లా వస్తారా? అంటూ నానా దుర్భాషలాడారు. ఈ ఘటన శనివారం కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కుకునూర్‌పల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఉన్నతాధికారుల వేధింపులను భరించలేక ఈనెల 16న సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు శనివారం డీఐజీ అకున్ సబర్వాల్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి వచ్చారు. ఈ వార్తను కవర్ చేయడానికి స్థానిక విలేకరులు ఠాణాకు వెళ్లారు.
అధికారులు సాక్షులను విచారిస్తున్న ఫొటోలను విలేకరులు చిత్రీకరించారు. వీరావేశంతో విలేకరుల వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చిన మెదక్ డీఎస్పీ నాగరాజు.. తన అనుమతి లేకుండా ఫొటోలు ఎలా తీస్తారంటూ చిందులేశారు. ఇలా చేసినందుకు లోపల కూర్చోబెడతానంటూ రెచ్చిపోయారు. తాము విలేకరులమని చెప్పినా విన్పించుకోలేదు.
‘మీరు దొంగలో.. విలేకరులో ఎలా తెలుస్తుంది?’ అంటూ పరుష పదజాలాన్ని ప్రయోగించారు. ఐడీ కార్డు చూపించినా కోపం తగ్గలేదు. విలేకరుల వద్ద ఫోన్లు లాక్కుని పోలీస్‌స్టేషన్‌లో విచారణకు సంబంధించిన ఫొటోలతో పాటు ఇతర ఫొటోలనూ డిలీట్ చేశారు. కేసు విచారణ విషయంలో పేపర్లో ఏమో బాగా రాశారట గదా అంటూ కన్నెర్ర చేస్తూ వెళ్లిపోయారు.
లోపలేసినా వార్తలు పంపుతాం..
వరుస ఘటనలతో పోలీసులు సహనం కోల్పోయి విలేకరులపై విరుచుకు పడటం మంచిది కాదని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. డీఎస్పీ నాగరాజు విలేకరులను సెల్‌లో వేసి బంధించినా అక్కడి నుంచి వార్తలను పంపటమే తమ వృత్తి ధర్మమన్నారు. డీఎస్పీ అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నామన్నారు. జిల్లాలో విలేకరులపై పోలీసు దాడులు కొత్తకాదని, ఇప్పుడు మెదక్ డీఎస్పీ కూడా అలాగే వ్యవహరించారన్నారు. మరోసారి ఇలాంటి సంఘటన జరిగితే ఆందోళనకు సిద్ధమవుతామని విష్ణువర్ధన్‌రెడ్డి హెచ్చరించారు.